ఆ స్పర్శానందం.. సప్తవర్ణ సోయగం !

Mar 3,2024 09:17 #feature

పిల్లలను ఏదైనా కొత్త ప్రదేశానికి తీసుకెళ్లినప్పుడు అక్కడ ఏదైనా కళారూపం కనిపించగానే వారు తమ చేతికి పని చెబుతారు. ఆ రూపాన్ని కళ్లతో చూడడం కంటే చేతులతో స్పర్శించి అనుభూతి చెందడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇది చాలా సందర్భాల్లో ఎంతోమంది పెద్దలకు ఎదురయ్యే అనుభవం. అంటే చూపు కంటే స్పర్శ ద్వారానే కళారూపాలను ఆస్వాదించడానికి పిల్లలు ఇష్టపడతారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పిల్లలు కూడా అలాంటివారే. అయితే వీరంతా చూపు ఉన్న పిల్లలు కారు. పుట్టుకతోనో, అనారోగ్య సమస్యలతోనో, ఏదేని కారణంగానో చూపును కోల్పోయిన అంధ విద్యార్థులు. రాజస్థాన్‌లో 1968 నుంచి నిర్వహిస్తున్న ‘నేత్రహీన్‌ కల్యాణ్‌ సంఫ్‌ు’ విద్యార్థుల గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటోంది.

              ‘నేత్రహీన్‌..’ సంస్థను నిర్వహిస్తున్న జెఎన్‌ భార్గవ్‌ కూడా చూపులేని వ్యక్తే. ఆ సంస్థలో దశాబ్దాల తరబడి వేలాదిమంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. చదువొక్కటే కాదు, వారి మానసిక, శారీరక సామర్థ్యాలను అంచనా వేసి ఆ దిశగా ప్రోత్సహించడంలో కూడా సంస్థ ముందుంటోంది. ఇప్పుడు ఆ పాఠశాలలోనే నూతన ప్రాజెక్టు ‘స్పర్శ్‌’ను ప్రవేశపెట్టారు. ‘ఎస్‌టి-ఆర్ట్‌’ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఏషియన్‌ పెయింట్స్‌ భాగస్వామ్యం కూడా తోడైంది.

‘స్పర్శ్‌’లో ఏం చేస్తున్నారు ?

               సంగీతం, ఆటలు, పాటలు, వాయిద్యం వంటి వివిధ కళల్లో ఇక్కడి పిల్లలు రాణించేలా శిక్షణ ఇవ్వడం సంస్థ ప్రత్యేకత. ‘స్పర్శ్‌’ రంగప్రవేశం తరువాత ఈ పిల్లలను కళారంగంలోకి కూడా అడుగులు వేసేలా చేస్తున్నారు. చిత్రకళ, వస్త్రాలపై రంగులద్దడం, చేతితో తయారు చేసే కళారూపాలు ఇలా ఒకటేమిటి.. కళల మాధ్యమం ద్వారా కళా ప్రపంచాన్ని సరికొత్త మార్గంలో అన్వేషించేలా ఈ విద్యార్థులను ‘స్పర్శ్‌’ ప్రేరేపిస్తోంది. ఇందులో ప్రదర్శించిన కళారూపాలను ప్రతి విద్యార్థి తమ స్పర్శ ద్వారా ఆద్యంతం అనుభూతి చెందడం వెనుక, డిజైనర్‌ సిద్ధాంత్‌ సాహ్ కృషి ఎంతో ఉంది. ఆయన బ్రెయిలీ లిపిలో ఈ కళారూపాలను డిజైన్‌ చేశారు. రంగులద్దే పరికరాలను విద్యార్థుల చేతికందించి, ఆ కళారూపాలకు రంగులు వేయించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘నేత్రహీన్‌..’ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బృందాలు బృందాలుగా కూర్చొని రోలర్లు, పెన్సిళ్లు, పేపర్లు, దుస్తులు, కుంచెలతో అందమైన కళారూపాలు చిత్రించారు.

నిలువెత్తు గోడపై …

               ‘నేత్ర హీన్‌ కళ్యాణ్‌ సంఫ్‌ు’ పాఠశాలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఏడడుగుల గోడ ఉంది. ఇప్పుడు దానిపై విద్యార్థులు వేసిన కళారూపాలను పొందుపరిచారు. ఆర్ట్‌ మ్యూజియంగా నిర్వహిస్తున్న అందులో పొందుపరిచిన ఆ కళాఖండాలను విద్యార్థులంతా చేతితో తడుతూ ఆస్వాదిస్తున్నారు. ఆ రూపాలను స్పర్శిస్తున్నప్పుడు పిల్లల ముఖాల్లో ఎన్ని ఆనందపు వర్ణాలు వెల్లివిరుస్తాయో మాటల్లో చెప్పలేము. ఈ మొత్తం కార్యక్రమానికి వీడియో రూపంలో పొందుపరిచి సంస్థ నిర్వాహకులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. లక్షలాది మంది ఆ వీడియోను వీక్షించి, ‘స్పర్శ్‌’ కృషికి అభినందనలు చెబుతున్నారు. ఒక్కోసారి ప్రయత్నం చిన్నదే కావొచ్చు.. కానీ అది చూపించే ప్రభావం ఎంత పెద్దగా ఉంటుందో చెప్పటానికి ఈ సంఘటన గొప్ప ఉదాహరణ.

➡️