అమ్మ గౌరవం పెంచాలని …

Apr 10,2024 07:44 #feachers, #jeevana, #Jeevana Stories

కష్టాలతో కాపురం చేస్తున్న ఏ అమ్మ బిడ్డైనా, తల్లిని బాగా చూసుకోవాలని, ఆమెని గౌరవంగా ఉంచాలని ఆలోచిస్తారు. ఆమె తల ఎత్తుకునే పనులే చేయాలని కంకణం కట్టుకుంటారు. అలాంటి బిడ్డే అక్షర. విజయనగరం జిల్లా ఓ మారుమూల గ్రామంలో పుట్టిన అక్షరకి చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు. కుటుంబ భారమంతా తన మీద వేసుకుని తల్లే ఇద్దరు బిడ్డలనూ సాకింది. కూలి పనులు చేసింది. పెద్ద బిడ్డకు పెళ్లి చేసి ఇక అక్షర మీదే ఆశలు పెట్టుకుని జీవిస్తోంది ఆ తల్లి.. అక్షర కూడా తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. కానీ.. అక్షర పుట్టుకతో ఆడబిడ్డ కాదు. మగబిడ్డగా పుట్టి, మానసికంగా ఆడబిడ్డగా ఎదిగిన ప్రత్యేకమైన సంతానం.


రోజు కూలీ చేసుకునే కుటుంబంలో పుట్టిన అక్షరకు బాల్యం నుండే తన పుట్టుక గురించి భిన్నమైన ఆలోచనలు ఉండేవి. కానీ ఎక్కడా, ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. ‘నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ మమ్మల్ని సాకేందుకు ఎన్నో కష్టాలు పడింది. అలాంటి సమయంలో నా ఆలోచనల్లో వస్తున్న మార్పుల గురించి అమ్మతో చెప్పలేకపోయాను. స్కూలుకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు కొందరు గేలి చేసేవారు. ఎంతోకాలం భరించలేకపోయాను. చదువులో చురుకుగా ఉండేవాడ్ని. కానీ శ్రద్ద పెట్టలేకపోయాను. అమ్మకు సాయంగా, కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని నిర్ణయించుకుని, 7వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పేశాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంది అక్షర.
‘ఆడపిల్లలా తయారవ్వాలని, పూలు పెట్టుకోవాలని, చీర కట్టుకోవాలని మనసు ఎంతో ఆశపడేది. కానీ నేను అలా తయారైతే అమ్మ ఎక్కడ కుంగిపోతుందోనని భయమేసేది. నాతో పాటు అమ్మ కూడా అవమానాలు పడుతుందని బెదిరిపోయాను. అమ్మ మా కోసం ఎంతో కష్టపడింది. మేం సంతోషంగా ఉండాలని తన సంతోషాలను పక్కనబెట్టింది. ఇన్ని ఆలోచనల మధ్య మనసంతా ఎంతో అలజడిగా ఉండేది. ఇంటి నుండి వెళ్లిపోవాలని కొన్నిసార్లు, చచ్చిపోవాలని మరికొన్నిసార్లు అనుకున్నాను. కానీ, అమ్మ, అక్క గుర్తుకు వచ్చి ఆ ప్రయత్నాలు చేయలేదు. నేను అబ్బాయినైనా, అమ్మాయినైనా అమ్మను బాగా చూసుకోవాలి. నేను చేసే పనుల వల్ల అమ్మ గౌరవం పెరగాలి. ఇదే మనసులో బలంగా అనుకునేదాన్ని’ అని అక్షర చెబుతున్నప్పుడు ఆమె మాటల్లో ఎంతో సంఘర్షణ కనిపించింది.
యుక్త వయసు వచ్చేవరకు గ్రామంలోనే ఉన్న అక్షర, అక్క పెళ్లి తరువాత, ‘సిటీలో ఏదైనా పని చేస్తా. నా కాళ్ల మీద నేను బతుకుతా’ అని చెప్పి హైద్రాబాద్‌కి బయలుదేరింది. ‘అమ్మకు అలా చెప్పినా, ఉపాధి కంటే ముందు, నా ఉనికిని వెతుక్కుంటూ వెళ్లాను. ఫ్యాంటు, షర్టు వేసుకునే ఇళ్లల్లో పనులు చేశాను. నా గురించి తెలియకుండా జాగ్రత్తపడుతూ నన్ను ఆదరించే వారి కోసం వెతికాను. యాచన చేయడం, సెక్స్‌ వర్క్‌ చేయడం నాకిష్టం లేదు. గౌరవమైన పనులు చేయాలి. గౌరవప్రదంగా జీవించాలి. అదొక్కటే నా మనసులో ఉంది. అలాంటి పనులు ఇచ్చేవారి కోసం ఎదురుచూశాను. సినిమా ఇండిస్టీలో మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేయాలని ఎంతో ప్రయత్నించాను. నా అవసరాన్ని బలహీనతగా చేసుకుని మోసం చేసినవాళ్లని చూశాను. లాక్‌డౌన్‌ తరువాతే అక్షరగా నా ప్రయాణం మొదలైంది’ అని తన ఉనికిని గుర్తించే క్రమంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.


ఎన్నో ప్రయత్నాల తరువాత ట్రాన్సెజెండర్‌ హక్కుల కోసం, వారికి గౌరవప్రద జీవితాలు అందించేందుకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల నీడకి అక్షర చేరుకుంది. అక్కడ ఆమెకు తనలా తమ కాళ్ల మీద తాము నిలబడిన ఎంతోమందితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలు అక్షరని అంచెలంచెలుగా పైకి ఎదిగేలా చేశాయి. ఉన్నత వ్యక్తిత్వం గల మనిషిగా ఆమెకి ప్రత్యేక గుర్తింపుని సాధించి పెట్టాయి. అలా తన సేవలు కావాలని పర్సనల్‌ అసిస్టెంట్‌గా నియమించుకున్న పెద్ద మనుషులూ అక్షర జీవితంలో ఉన్నారు. వారితో కలిసి రాష్ట్రాలు దాటిన అక్షర, ఆ తరువాత ట్రాన్సెజెండర్‌ హక్కుల కార్యకర్త మాల ప్రోత్సాహంతో ప్రస్తుతం ఓ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థలో ఉన్నత కొలువులో స్థిరపడ్డారు. ‘మే నెల నాటికి ఈ జాబ్‌ పర్మినెంట్‌ అవుతుంది. అప్పుడే అమ్మను కలుస్తాను’ అని చెబుతున్నప్పుడు అక్షర మాటల్లో ఒకింత భావోద్వేగం కనిపించింది.
హైద్రాబాద్‌కి వచ్చిన దగ్గరి నుంచి అక్షర వాళ్ల అమ్మని కలవలేదు. ‘అమ్మ ఆలోచనలన్నీ నా కోసమే. నేను ఊరు వెళతానని చెప్పినప్పుడు కూడా, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డావు. కుటుంబానికి ఆసరాగా నిలబడ్డావు. ఇప్పుటికైనా నీ కోసం ఆలోచిస్తున్నావు. అంతే చాలు’ అని ఆశీర్వదించి పంపింది. ఏ రోజూ నేను పంపించే జీతం కోసం ఆశపడలేదు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని జెండర్‌ ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఇప్పుడు పూర్తిగా అమ్మాయిగా మారిపోయాను. అమ్మ ఎన్నో సార్లు ఫోన్లో నన్ను చూసి మాట్లాడాలని చెప్పేది. ఏదో సాకు చెప్పి తప్పించుకునేదాన్ని. కానీ ఇంకెన్నాళ్లు? అమ్మకు నా గురించి చెప్పాలని మనసు ఉవ్విళ్లూరుతోంది. ఆ రోజు త్వరలోనే రాబోతోంది. ఆ ఉద్విగ క్షణాల్లో అమ్మ నా గురించి తెలుసుకుని బాధపడినా నేను జీవిస్తున్న జీవితం గురించి గర్వపడాలి. అదొక్కటే నా ఆశ’ అని అక్షర అంటోంది.
పుట్టిన ప్రతి బిడ్డకు ఒకే జీవితం ఉంటుంది. అక్షర లాంటి వాళ్లకు మాత్రమే రెండు జీవితాలు ఉంటాయి. ఇప్పుడు అక్షర రెండో జీవితంలో ప్రయాణిస్తోంది. కుటుంబం, సమాజం ఆమెకు అండగా నిలవాలని కోరుకుందాం.

– జ్యోతిర్మయి

➡️