పొమ్మనలేక పొగ

Apr 29,2024 04:30 #jeevana

పూర్వం మధుపాడ గ్రామంలో సత్తిబాబు, కామేశ్వరి దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి నలుగురు సంతానం. కాయకష్టం చేసి రూక రూక సంపాదించి పిల్లల్ని పోషించేవారు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితం వారిది.
సత్తిబాబు తెచ్చే సంపాదనతో ఎవరి దగ్గర చేయి చాపకుండా, అప్పు చేయకుండా కామేశ్వరి కుటుంబ పోషణ చేసేది. సత్తిబాబు దూరపు బంధువు లోభనాథం తల్లికి ఆరోగ్యం బాగోలేనందున మధుపాడలో ఉన్న ఆయుర్వేద వైద్యునికి చూపించే నిమిత్తం కుటుంబంతో సహా వచ్చాడు. సత్తిబాబు దంపతులు వారిని ఆప్యాయంగా పలకరించి ఆతిథ్యమిచ్చారు. లోభనాధం కుటుంబం వారికి నచ్చిన వంటకాలు చేయించుకుని తింటూ హాయిగా కాలక్షేపం చేశారు. అలా వారం గడిచింది చేతిలో డబ్బులు అయిపోవడంతో ఏమి చేయడానికి సత్తిబాబుకి తోచలేదు. ఇది గమనించిన కామేశ్వరి తన చెవి కమ్మలు ఇచ్చి ‘ఇవి కుదువ పెట్టి డబ్బులు తీసుకు రండి’ అని చెప్పింది.
భార్య మాట ప్రకారం షావుకారు ఇంటికి వెళ్ళబోతుండగా ‘వచ్చే వారం మరో స్నేహితుని ఇంటికి వెళ్దాం. ఈ నెల అంతా ఇలా గడిపేద్దాం’ అన్న లోభనాధం మాటలు సత్తిబాబు చెవిన పడ్డాయి. ఆ విషయం భార్యకు చెప్పాడు.
ఆ మాటలు విన్న కామేశ్వరికి గుండె గుభేల్‌ మంది. వారి పథకం అర్థమయ్యింది. ‘మీరు వెళ్ళిపొండి అని చెప్పకుండా వాళ్ళంతట వాళ్లే వెళ్ళిపోయే పరిస్థితి కల్పించాలి అనుకుంది.
పచ్చి కట్టెలను పొయ్యిలో పెట్టి మంట రాజేసింది. ఇల్లంతా దట్టమైన పొగ అలముకుంది. దాంతో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు లోభనాధం కుటుంబం. ఆ పొగ భరించలేక లోభనాథం తల్లి పిల్లలు వెళ్ళిపోదామని పేచీ పెట్టారు. గత్యంతరం లేక లోభనాథం తక్షణమే కుటుంబంతో మరో గ్రామానికి పయనమయ్యాడు. ‘మొత్తానికి పొమ్మనలేక పొగ పెట్టావు’ అన్నాడు సత్తిబాబు. ‘పొగ పెడితేనే కదా కలుగులో ఎలుక బయటకు వచ్చేది’ అంది కామేశ్వరి. నాటినుంచి ఈ సామెత వాడుకలోకి వచ్చింది.
– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445

➡️