విశాఖలో ఆసక్తికర పోరు !

May 8,2024 00:21 #Interesting fight, #Visakha

– టిడిపి కూటమిలో బుజ్జగింపులు కొలిక్కి
-సంక్షేమమే ప్రధాన అస్త్రంగా వైసిపి
-ఉక్కు పరిరక్షణ థ్యేయంగా
ఇండియా బ్లాక్‌
ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :రాష్ట్రంలో కీలక నగరంగా ఉన్న విశాఖ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. వైసిపి, టిడిపి – జనసేన – బిజెపి కూటమి, ఇండియా బ్లాక్‌లు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. విశాఖ పార్లమెంట్‌ పరిధిలో భీమునిపట్నం, గాజువాక, విశాఖ ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు, ఎస్‌.కోట నియోజకవర్గాలున్నాయి. ఎంపి అభ్యర్ధులుగా వైసిపిీ తరపున బొత్స ఝాన్సీ, టిడిపి తరపున ఎం.శ్రీభరత్‌, ఇండియా బ్లాక్‌ తరుపున కాంగ్రెస్‌ అభ్యర్థి పి.సత్యారెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సంక్షేమమే ప్రధాన అస్త్రంగా వైసిపి ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టింది. . ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టో తనను గెలిపిస్తాయన్న ధీమాలో శ్రీభరత్‌ ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ నినాదంతో సిపిఎం., సిపిఐ మద్దతుతో పి.సత్యారెడ్డి ప్రచారం సాగిస్తున్నారు.
రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖను వైసిపి ప్రతిపాదించిన నేపథ్యంలో ఇక్కడ నుండి అత్యధిక అసెంబ్లీ సీట్లు సాధించాలన్న తలంపుతో వైసిపి అధినేత వైఎస్‌.జగన్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారు. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచిన మొత్తం స్థానాల్లో దాదాపు ఐదో వంతు విశాఖ నగరంలోనివే. అయితే 2024 ఎన్నికలకొచ్చేసరికి పార్లమెంట్‌ మొదలుకొని అసెంబ్లీ స్థానాల వరకూ వైసిపికి ధీటైన అభ్యర్థులను బరిలోకి దించడం కనాకష్టంగా మారింది. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని బిజెపికి, దక్షిణ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో తలనొప్పులు ఎక్కువయ్యాయి. భీమిలి అసెంబ్లీ స్థానాన్ని అప్పటి వరకూ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న కోరాడ రాజబాబును కాదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కేటాయించడంపైనా అసంతృప్తులు వెల్లువెత్తాయి. పరిస్థితిని గమనించిన చంద్రబాబు రంగంలోకి దిగి అసంతృప్తివాదులను బుజ్జగించడంలో సఫలీకృతులయ్యారు.
పలుచోట్ల పోటీ ఇలా..
విశాఖ తూర్పులో టిడిపి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ వెలగపూడి రామకృష్ణబాబు… నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వైసిపి నుంచి ఎంపీ ఎంవివి.సత్యనారాయణ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ మత్స్యకారులు, యాదవులు, మధ్యతరగతి ఓట్లే కీలకం. దక్షిణంలో వైసిపి అభ్యర్థిగా వి గణేష్‌ కుమార్‌, జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్‌ బరిలో ఉన్నారు. వంశీకృష్ణ గతంలో వైసిపి ఎమ్మెల్సీగా పనిచేసి ఎమ్మెల్యే టికెట్‌ దక్కదన్న ఆలోచనతో, జనసేనలోకి వచ్చి టికెట్‌ దక్కించుకున్నారు. ఆయన రాకతో అప్పటికే టికెట్‌ ఆశిస్తున్న నేతలంతా భగ్గుమన్నారు. అధిష్టానం అభ్యర్థిని మార్చకపోవడంతో మూగి శ్రీనివాసరావు, గంపల గిరిధర్‌ వంటి జనసేన నేతలు పార్టీని వీడారు. ఇక్కడి నుంచి టికెట్‌ ఆశించిన వైసిపి నేత సీతంరాజు సుధాకర్‌ కొద్ది రోజుల క్రితం టిడిపిలో చేరారు. ఇలా జంపింగ్‌ జంపాంగ్‌లతో ఇక్కడ ఆసక్తికర పోటీ నెలకొంది. పశ్చిమలో టిడిపి అభ్యర్థి పి.గణబాబు, వైసిపి అభ్యర్థి ఆడారి ఆనందకుమార్‌ల మధ్య గట్టిపోటీ నెలకొంది. ఇండియా బ్లాక్‌ తరపున సిపిఐ అభ్యర్థిగా అత్తిలి విమల పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఉత్తరంలో వైసిపి నుంచి కెకె.రాజు, బిజెపి అభ్యర్థి విష్ణుకుమార్‌ రాజు,. జై భారత్‌ నేషనల్‌ పార్టీ నుంచి సిబిఐ మాజీ జెడి వివి.లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతోనే ఓడిపోయిన కెకె.రాజు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని పనిచేయడం వంటి అంశాలు ఆయనకు కలిసొస్తాయని పలువురు భావిస్తున్నారు. వి వి లక్ష్మీనారాయణ ప్రభావం కూడా గణనీయంగానే ఉండే అవకాశం ఉంది.
గాజువాకలో వైసిపి తరపున మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌, టిడిపి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు, ఇండియా బ్లాక్‌ బలపరిచిన సిపిఎం అభ్యర్థిగా ఎం జగ్గునాయుడు బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల ఓట్లు వైసిపి, కూటమి అభ్యర్థుల ఇరువురినీ కలవరపెడుతున్నాయి. ప్లాంట్‌ పరిరక్షణ కోసం సిపిఎం నిబద్ధతతో పోరాడుతోందన్న అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. సిపిఐ, కాంగ్రెస్‌ బలం తోడవ్వడంతో ధీటైన పోటీనే సిపిఎం ఇస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ భీమిలి అభ్యర్థి వర్మ, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌, ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి లక్కరాజు రామారావు… ఇండియా బ్లాక్‌ శ్రేణులను కలుపుకుని ప్రచారంలో ముందున్నారు.
ఆల్‌ రౌండర్‌ పాత్రలో బొత్స
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నా…భార్య విశాఖ ఎంపిగా పోటీచేస్తుండడంతో ఇక్కడే ఉండి ప్రచార వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎంఎల్‌ఎ అభ్యర్థులకు ఓట్లు తగ్గినా పార్లమెంట్‌కు తగ్గడానికి వీల్లేదన్న సంకేతాలు కూడా బొత్స ఇచ్చారన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే భీమిలి, గాజువాక, ఎస్‌.కోట వంటి చోట్ల టిడిపికి చెందిన ‘కాపు’ సామాజిక తరగతి నేతలతో కొన్ని సర్దుబాట్లు కూడా చేసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

➡️