ఆప్‌ ప్రచార గీతంపై ఇసి అభ్యంతరం

Apr 28,2024 23:36 #AAP's campaign song

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ వాడుతున్న సాంగ్‌లోని నినాదం పట్ల ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని ఆప్‌ని ఆదేశించింది. పాటలో మార్పులు చేసిన తర్వాత మళ్లీ తమ ఆమోదం తీసుకోవాలని కోరింది. ఎన్నికల ప్రచార ప్రకటనలో ‘జైల్‌ కె జవాబ్‌ మే హమ్‌ ఓట్‌ సే దేంగె’ అన్న నినాదం వచ్చినప్పుడు.. కేజ్రీవాల్‌ జైల్లో ఉన్న చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సమూహం అంతా కలిసి న్యాయవ్యవస్థను దూషించినట్లుగా ఉందని,ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఇసి పేర్కొంది. కాగా ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాల వెనుక బిజెపి కుట్ర ఉందని ఆప్‌ విమర్శించింది. ఒక ప్రచార గీతంపై నిషేధం విధించడం బహుశా ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారని ఆప్‌ నేత, ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. సిబిఐ, ఈడీలపై నిందలు వేస్తే ఎన్నికల కమిషన్‌ తమ ప్రచార పాటపై నిషేధం విధించడమేంటని ఆమె ప్రశ్నించారు. ఈడీ, సిబిఐలు తమని అక్రమ అరెస్టులు చేస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్‌ ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు.

➡️