ఉత్కళ సీమలో ఊపెవరిది?

Apr 27,2024 22:44 #odisa

– నాలుగు దశల్లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు
– కేంద్రంలో దోస్తీ.. రాష్ట్రంలో కుస్తీ
-ఇదీ ఒడిశాలో బిజెడి, బిజెపి వ్యవహారం
– ఈ మారు డైరెక్టు పొత్తు కోసం ప్రయత్నించి వెనక్కి
-ఆ రెండు పార్టీలతో తలపడుతున్న కాంగ్రెస్‌
-ఒక ఎంపి, ఏడు ఎంఎల్‌ఎ స్థానాల్లో సిపిఎం పోటీ

ఒడిశా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బిజెడి, బిజెపి, కాంగ్రెస్‌ తమ ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా నాల్గవ విడత మే 13న పోలింగ్‌ కాగా అక్కడి నుంచి వరుసగా నాలుగు తడవల్లో ఒడిశాలో పోలింగ్‌ నిర్వహించేందుకు ఇసి ఏర్పాట్లు చేసింది. మే 13న 4 లోక్‌సభ, 28 అసెంబ్లీ, మే 20న ఐదు లోక్‌సభ, 35 అసెంబ్లీ, ఆరో మే 25న ఆరు లోక్‌సభ, 42 అసెంబ్లీ, జూన్‌ 1న ఆరు లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.

ఒడిశాలో సుదీర్ఘకాలంగా నవీన్‌ పట్నాయక్‌ సారధ్యంలోని బిజెడి పాలన కొనసాగుతోంది. ఈ తడవ బిజెడి పట్టు కాస్త సడలినట్లు కనిపిస్తున్నప్పటికీ నవీన్‌ పట్నాయక్‌ చేయి దాటి పోయినట్లు కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఇటీవల కొందరు సీనియర్‌ నేతలు పార్టీకి రాజీనామా చేయడం బిజెడికి కొంత నష్టమని చెప్పొచ్చు. మరోవైపు బిజెపి కేంద్రీకరించి పని చేస్తోంది. 2014లో ఒక ఎంపి గెలిచిన బిజెపి, 2019లో ఎనిమిది స్థానాలకు పెరిగింది. కాంగ్రెస్‌ తన పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2014లో యుపిఎ ఖాతా తెరవలేదు. 2019లో కాంగ్రెస్‌ ఒక సీటు గెలుచుకుంది. బిజెపి, బిజెడిలకు ప్రత్యామ్నా యంగా కాంగ్రెస్‌ ఎదుగుతోందని అంటున్నారు. కానీ ఆ రెండు పార్టీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఏ మేరకు ఓట్ల రూపంలో తన వైపు మరల్చుకుంటుందో చూడాలి. మొత్తంగా ఒడిశాలో త్రిముఖ పోటీ నెలకొంది.
బిజెపికి సహకరిస్తున్న బిజెడి
సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా ఒక పరిస్థితి ఉంటే ఒడిశాలో మాత్రం విభిన్న రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటే ఇక్కడ మాత్రం స్నేహపూర్వక పోటీ నెలకొన్నది. 1998 నుంచి 2009 వరకు బిజెడి, బిజెపి అన్ని ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. తొలి వాజపేయి సర్కారులో నవీన్‌ పట్నాయక్‌ కేంద్రమంత్రిగా పనిచేశారు. 2009 నుంచి విడిపోయినా గత పదేళ్లగా కేంద్రంలోని మోడీ సర్కారుకు బిజెడి అన్ని అంశాల్లో, బిల్లులపై మద్దతిస్తోంది. ఈ రెండు ఫ్రెండ్లీ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండగా.. వీటిపై ఉన్న వ్యతిరేకతనే ఆయుధంగా కాంగ్రెస్‌ బరిలో నిలుస్తున్నది.
ఎవరి బలమెంత?
ఒడిశాలో 21 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో.. బిజెడి 12 సీట్లల్లో, బిజెపి 8 చోట్ల, కాంగ్రెస్‌ ఒక సీటు గెలిచాయి. 147 అసెంబ్లీ స్థానాల్లో బిజెడి 112, బిజెపి 23, కాంగ్రెస్‌ ఎనిమిది, సిపిఎం 1 స్థానంలో గెలిచాయి. ప్రెస్తుత ఎన్నికల్లో బిజెడి, బిజెపి, కాంగ్రెస్‌, సిపిఎం ఒక ఎంపి, ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.

బిజెపితో పొత్తుపై వెనుకడుగు
దేశంలోనే సుదీర్ఘ కాలం పాటు సిఎంగా పనిచేసిన వారిలో నవీన్‌ పట్నాయక్‌ రెండవ స్థానంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారాన్ని చేపడితే నెంబర్‌ 1 స్థానానికి చేరుకుంటారు. ఈ సారి గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే తొలిత బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాట్లలో కుదరకపోవడం, మరికొన్ని కారణాల వలన ఒంటరిగా వెళ్తున్నారు.

కుమారుల పోటీ… తండ్రులకు పాట్లు
ఒడిశా రాజకీయాల్లో తమ కుమారుల విజయం కోసం ఇద్దరు తండ్రులు తపన పడుతున్నారు. తండ్రులు ఒకపార్టీలో ఉంటే.. కుమారులు మరో పార్టీలో పోటీ చేస్తున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్‌ సీనియర్‌ సురేష్‌ చంద్ర రౌత్రేకి కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీసు కూడా ఇచ్చింది. ఖాతరు చేయని రౌత్రే, బిజెపి నుంచి భువనేశ్వర్‌లో పోటీ చేస్తున్న తనయుడు మన్మత్‌ రౌత్రే గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బిజెపి నేత మోహపాత్రది కూడా అదే పరిస్థితి. పట్కురా అసెంబ్లీ నుంచి బిజెడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు అరబింద మోహపాత్ర గెలుపు కోసం శ్రమిస్తున్నారు.

(జె.జగదీష్‌)

➡️