ఓటే కీలకం

May 13,2024 00:29 #elections

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రచారం ముగిసింది. ఇక కీలక ఘట్టమైన పోలింగ్‌ నేడు జరగనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇప్పటి వరకూ బయట ఎన్ని తిప్పలు పడ్డా గెలుపోటములు నిర్ణయించేది ఓటింగే. ఓట్లంటే గతంలో బ్యాలెట్‌ పత్రాలపై తమకు నచ్చిన అభ్యర్థి ఎన్నికల చిహ్నంపై ముద్ర వేసేవారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన దరిమిలా, నిర్వహణా వ్యయాన్ని తగ్గించడానికి దాదాపు రెండు దశాబ్దాల కింద ఇవిఎం(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌)లను కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) ప్రవేశపెట్టింది. దాంతో పోలింగ్‌, ఓట్ల లెక్కింపు గతం కంటే సులవయింది. ఇవిఎంలపై సందేహాలు రావడంతో ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవడం కోసం వివిపిఎటి (ఓటరు వెరిఫైబల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌)లను ఇవిఎంలకు అనుసంధానం చేసి ఉంచుతారు. ఈ రెండింటికీ కలిపి కంట్రోల్‌ యూనిట్‌ ప్రిసైడింగ్‌ అధికారి వద్ద ఉంటుంది. వివిప్యాట్‌, బ్యాలెట్‌ యూనిట్‌ ఓటింగు కంపార్టుమెంటులో ఉంచుతారు. ప్రతి బ్యాలెట్‌ యూనిట్లో 16 మంది పేర్లు మాత్రమే ఉంటాయి. అంతకుమించి ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే అదనంగా మరో ఇవిఎం ఏర్పాటు చేస్తారు. ఒక కంట్రోల్‌ యూనిట్‌తో 384 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించవచ్చు. అంటే సుమారు 24 బ్యాలెట్‌ యూనిట్లు పెట్టవచ్చు. ప్రతి బ్యాలెట్‌ యూనిట్‌పై అంథులకోసం బ్రెయిలీ చిహ్నాలతో 1 నుండి 16 వరకు అంకెలు ముద్రించి ఉంటాయి.
వేసేది ఇలా..
పోలింగ్‌ బూత్‌కు వెళ్లాక మొదటి అధికారి ఓటరు కార్డు చెక్‌ చేస్తారు. దానితోపాటు ఐడి ప్రూఫ్‌ కూడా చూస్తారు. రెండో అధికారి వేలిపై ఇంకు ముద్ర వేస్తారు. అక్కడే రిజిస్టర్‌లో(17ఏ)లో ఓటరుతో సంతకం చేయించుకుని స్లిప్‌ ఇస్తారు. దాన్ని తీసుకుని మూడో అధికారి వద్దకు వెళితే స్లిప్‌ తీసుకుని వేలిపై ఇంకు ముద్ర చూసి పోలింగ్‌ కంపార్టుమెంటులోకి పంపిస్తారు. అక్కడ కంట్రోల్‌ యూనిట్‌ నుండి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. కంపార్టుమెంట్లో పెట్టిన ఇవిఎం మిషన్‌లో ఎడమచేతివైపు పార్టీలు వాటి గుర్తులు ఎదురుగా బ్లూ బటన్‌ ఉంటుంది. దాన్ని ప్రెస్‌చేయగానే రెడ్‌బల్బు వెలిగి బీప్‌ సౌండ్‌ వస్తుంది. వివిప్యాట్‌ మిషన్లో ఎవరికి ఓటు వేశారో ఆ గుర్తు ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. అనంతరం స్లిప్‌ సీల్డ్‌ డ్రాప్‌ బాక్సులో పడిపోతుంది. అయితే పోలింగ్‌కు మూడుగంటల ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు ధృవీకరించిన ఎజెంట్ల సమక్షంలో ప్రతి ఇవిఎంలోనూ కనీసం 50 ఓట్లను ప్రయోగాత్మంగా పోల్‌ చేస్తారు. ఎటువంటి ఇబ్బందీ లేదనుకున్న తరువాత నిర్దిష్ట సమయానికి పోలింగ్‌ మొదలుపెడతారు. ప్రస్తుతం ఎంపి, ఎంఎల్‌ఎ రెండు ఎన్నికలూ ఒకేసారి జరుగుతున్నందున ఓటరు రెండు ఓట్లు వేయాలి. తొలుత ఎంపి ఓటు చేయడానికి మొదటి కంపార్టుమెంట్‌లోకి వెళ్లే ముందు తెలుపు స్లిప్‌, రెండవ కంపార్టుమెంట్‌లోకి వెళ్లే ముందు ఎంఎల్‌ఎ ఓటు కోసం గులాబి స్లిప్‌ ఇస్తారు.
కావాల్సిన గుర్తింపు కార్డులు
1. ఓటరు గుర్తింపుకార్డు 2. పాస్‌పోర్టు 3. డ్రైవింగ్‌ లైసెన్స్‌ 4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జారీ చేసిన సర్వీస్‌ కార్డులు 5. ఫోటోతో కూడిన బ్యాంకు లేదా పోస్టాఫీస్‌ పాస్‌బుక్‌ 6. పాన్‌కార్డు 7. ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు 8. ఉపాధి హామీ గుర్తింపు కార్డు 9.. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కార్డులు 10. పెన్షన్‌ పుస్తకం 11. ప్రజాప్రతినిధులయితే వారి గుర్తింపుకార్డు, 12. అథార్‌కార్డు.. ఈ 12 కార్డుల్లో ఏదో ఒకటి చూపితే చాలు. అయితే ఓటరు ఫొటో దానిపై తప్పనిసరిగా ఉండాలి.

➡️