సిజెఐకి లేఖ రాసిన 600 మంది న్యాయవాదుల బృందం

న్యూఢిల్లీ :   స్వార్థ ప్రయోజనాలతో కూడిన  రాజకీయ  మూకలు న్యాయవ్యవ్యస్థపై ఒత్తిడి తీసుకువస్తున్నారని సుమారు 600 మంది న్యాయవాదులు బృందం సిజెఐ డి.వై చంద్రచూడ్‌కి లేఖ రాసింది. సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా సహా పలువురు న్యాయవాదులు బుధవారం లేఖ రాశారు. ఆ మూకలు కోర్టుల పరువు తీసేందుకు యత్నిస్తున్నారని, పనికిమాలిన తర్కాలతో తమ రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయ కేసుల్లో, ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతల ఒత్తిడి వ్యూహాలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. వారి వ్యూహాలు న్యాయస్థానాలను దెబ్బతీయడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు కలిగిస్తున్నాయని ఆ లేఖలో తెలిపారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు  సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ మధ్య కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థించడం, రాత్రి మీడియాతో న్యాయమూర్తులను ప్రభావితం చేయడం వంటి అంశాలు బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదని, ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే.. హాని చేయాలనుకునేవారికి మరింత బలం ఇచ్చినట్లేనని పేర్కొన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️