నోట్లు.. డ్రగ్స్‌.. ఆభరణాలతో వల

  •  గుజరాత్‌లో అత్యధిక ప్రలోభాలు
  •  ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఇసి

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలలో ఎన్నడూలేని విధంగా నోట్లు.. డ్రగ్స్‌.. ఆభరణాలను గుమ్మరించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రలోభాల పర్వం సాగుతున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల క్రమంలో నాలుగువిడతల పోలింగ్‌ జరగ్గా.. ఇప్పటివరకు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. జప్తు చేసిన సొత్తులో మాదక ద్రవ్యాలదే 45 శాతం వాటా అని, రూ.3,958 కోట్ల మేర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.
స్వాధీనం చేసుకున్న సొత్తులో నగదు రూపేణా రూ.849.15 కోట్లు, మద్యం (రూ.814.85 కోట్లు), మాదక ద్రవ్యాలు (రూ.3,958 కోట్లు), బంగారం, వెండి వంటి ఆభరణాలు (రూ.1,260.33 కోట్లు), ఇతర ఉచితాలు (రూ.2006.59 కోట్లు) ఉన్నట్లు ఇసి తెలిపింది. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్‌ పదార్థాల స్వాధీనంపై ఈసారి ప్రత్యేక దృష్టిసారించినట్టు పేర్కొంది. గుజరాత్‌ ఏటీఎస్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లు కలిసి చేపట్టిన ఆపరేషన్లలో కేవలం మూడు రోజుల్లోనే రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడినట్టు వెల్లడించింది.
కోడ్‌పై ఇసికి ‘విజిల్‌’ .. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
అత్యధికంగా గుజరాత్‌లో రూ.1,461.73 కోట్ల విలువైన ప్రలోభాలను స్వాధీనం చేసుకున్నట్టు ఇసి నివేదికలో వెల్లడైంది. రాజస్థాన్‌ (రూ.1133.82 కోట్లు), పంజాబ్‌ (రూ.734.54 కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రూ.301.75 కోట్లు, తెలంగాణలో రూ.333.55 కోట్ల సొత్తు జప్తు చేసింది.

➡️