దేశమంతటా బిజెపి వ్యతిరేక గాలి

  • ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి
  • హోదా ఇవ్వని బిజెపి కూటమిలో చంద్రబాబు ఎలా చేరారు?
  • విశాఖలో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కరత్‌

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేక గాలి వీస్తోందని, గడచిన పదేళ్లలో ఎన్‌డిఎ పాలనలో అధిక ధరలు, ప్రభుత్వ రంగ సంస్థల విధ్వంసానికి పాల్పడుతూ దేశాన్ని ప్రమాదంలో పడేసిందని, దేశ రక్షణ, ప్రజల అజెండాతో ఇండియా వేదిక 2024 ఎన్నికల్లో అధికారంలోకి రానుందని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కరత్‌ వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ఇండియా వేదిక తరపున ప్రచారానికి విచ్చేసిన ఆమె ఆదివారం ఉదయం విశాఖలోని సిపిఎం కార్యాలయం (ఎన్‌పిఆర్‌ భవన్‌) లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి, గాజువాక అభ్యర్థి ఎం.జగ్గునాయుడు, కాంగ్రెస్‌ పార్టీ తరపున విశాఖ పార్లమెంట్‌ బరిలో దిగిన సత్యారెడ్డి, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఐ అభ్యర్థి విమల అభ్యర్ధిత్వాలకు మద్దతుగా తాను విచ్చేశానన్నారు.
ఏపికి విభజన హామీలైన ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వేజోన్‌, పోలవరం ప్రాజెక్టు అమలులో బిజెపి విఫలమైందని బృందా ఎద్దేవా చేశారు. 2018లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమే తాను బయటకొస్తున్నానని చెప్పి , ఏపికి హోదా ఇవ్వని బిజెపితో 2024 ఎన్నికల్లో కూటమి ఎలా కడతారని చంద్రబాబును ప్రశ్నించారు. దేశంలోని ఇండియా వేదికలో అనేక ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, లెఫ్ట్‌ పార్టీలు సహా ప్రత్యామ్నాయంగా ఏర్పడి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర హోదా, పోలవరం, రైల్వే జోన్‌ కోసం ఎన్నికల బరిలో దిగామన్నారు. 2018లో దేశ ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చి ఎన్నో హామీలు కురిపించి వెళ్లారని అందులో రైల్వేజోన్‌కు నేటికీ అతీగతి లేదన్నారు. ప్రత్యేక హోదా ఎలాగూ కాగితాలకే పరిమితం అయిపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాల్సి ఉన్నా మోడీ ప్రభుత్వం ఇన్నాళ్లూ ఏం చేసిందని ప్రశ్నించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో తాను పర్యటిస్తానని, గిరిజనులు, నిర్వాసితుల కోసం ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

బాక్సైట్‌ దోపిడీకే బిజెపి అభ్యర్థి పోటీ
రాజ్యాంగం ద్వారా గిరిజనులకు దక్కిన హక్కులకు విశాఖపట్నం ఏజెన్సీలో రక్షణ లేదన్నారు. అనకాపల్లి ఎన్‌డిఎ కూటమి (బిజెపి) అభ్యర్థి సిఎం రమేష్‌పై ఇల్లీగల్‌ మైనింగ్‌ కేసులున్నాయని ఇలాంటి వారిని గెలిపించాలని ప్రధాని నరేంద్రమోడీ విశాఖ కశింకోటలో ప్రచారానికి రావడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. బాక్సైట్‌ భూముల్లో మైనింగ్‌ చేసేందుకే సిఎం రమేష్‌ అనకాపల్లి ఎంపిగా బరిలోకి దిగారని వ్యాఖ్యానించారు.

స్టీల్‌ప్లాంట్‌పై మోడీ కుట్రలు
పోర్టులు కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వచ్చే దేశ సంపద కాగా విశాఖలోని గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టారని ప్రధానితో అదానీ స్నేహంతో దీన్ని కబ్జా చేశారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కుట్రను గంగవరం పోర్టు అమలు చేస్తుందన్నారు. తక్షణమే కోర్టు చెప్పిన ప్రకారం కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి స్టీల్‌ప్లాంట్‌కు కోకింగ్‌ కోల్‌ను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం గాజువాక అభ్యర్థి జగ్గునాయుడు మాట్లాడుతూ.. లక్ష మందికి ఉపాధి, గాజువాక అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే స్టీల్‌ప్లాంట్‌ను బిజెపి, వైసిపి, టిడిపి చెర నుంచి కాపాడుకుంటామన్నారు. విశాఖ పార్లమెంట్‌ (కాంగ్రెస్‌ అభ్యర్థి) సత్యారెడ్డి మాట్లాడుతూ… ఏడు అసెంబ్లీల్లో ఐదు ఇండియా వేదికకు బలంగా ఉన్నాయని, సిపిఐ పశ్చిమ ఎమ్మెల్యే అత్తిలి విమల మాట్లాడుతూ.. ఇండియా వేదికను ప్రజలు ఓటేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు సిహెచ్‌ నరసింగరావు పాల్గొన్నారు.

➡️