అవసరార్థులకు రాత హస్తం ..!

May 8,2024 04:06 #Jeevana Stories

చదువుకుంటున్న ప్రతి ఒక్కరూ పరీక్షలు రాయాలి. ఇది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో వికలాంగులు, అంధత్వంతో బాధపడేవారు, ఆటిజం బాధిత వ్యక్తుల్లో ఎంతోమంది తమ ప్రతిభతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వారు కూడా పరీక్షలు రాయాల్సిందే. మరి ఇది వారికెలా సాధ్యమౌతుంది? వైకల్య బాధితులకు ముఖ్యంగా ఆటిజం విద్యార్థులు సంజ్ఞలు మాత్రమే చేయగలరు. వారు ఎలా పరీక్షలు రాస్తారు? బ్రెయిలీ లిపిలో రాసే సౌలభ్యం లేనప్పుడు అంధ విద్యార్థులు కూడా పరీక్షలు రాయడానికి చాలా కష్టపడాలి. వైకల్యం వెక్కిరించినా విద్యతో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, ఎంతో కష్టపడిన వారికి పరీక్షలు రాసే అవకాశం లేనప్పుడు ఎంత నిరుత్సాహం ఆవహిస్తుంది? ఈ పరిస్థితుల్లోనే వారికి కొండంత అండగా నిలబడుతున్నారు కోయంబత్తూర్‌కి చెందిన 51 ఏళ్ల రమా పద్మనాభన్‌. తనవి కానీ పరీక్షలు రాస్తూ వారి బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తోంది.

సైకాలజీలో గ్రాడ్యుయేట్‌, గైడెన్స్‌ అండ్‌ కౌన్సిలింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లోమా చేసిన రమ లక్ష్యం కోసం పనిచేయాలన్న కోరిక బలంగా ఉన్న ఓ సాధారణ గృహిణి. ఇంటికే పరిమితమైన ఈ ఉన్నత విద్యావంతురాలు తన జీవితంలో ఎప్పుడూ ఊహించని ప్రయాణాన్ని చేస్తున్నారు. 11 ఏళ్లుగా స్క్రైబ్‌ (పరీక్షలు రాయలేని వ్యక్తుల తరపున వరి సమక్షంలోనే ఎంతో కొంత రుసుము తీసుకుని లేదా స్వచ్ఛందంగా పరీక్షలు రాసే వ్యక్తులను స్క్రైబ్‌ అని పిలుస్తారు)గా సేవలు అందిస్తున్నారు. ఏవిధమైన లాభాపేక్ష లేకుండా ఆమె ఈ నిస్వార్ధ సేవను చేస్తున్నారు. మొదట్లో ఒక అభిరుచిగా ప్రారంభమైన ఈ సేవా మార్గం ఇప్పుడామె దైనందిన జీవితంలో భాగమై పోయింది. కాలేజీ ప్రతి సెమిస్టర్‌లో తనవి కాని 50 పరీక్షలకు హాజరై పరీక్షలు రాస్తున్నారు. రోజు మొత్తం మీద ఒకటి లేదా రెండు సార్లు కంటే ఎక్కువ పరీక్షలు రాయడం అంత ఆషామాషీ కాదు. కానీ రమ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు.
‘ఒక అభిరుచిగా ఈ ప్రయాణం మొదలుపెట్టాను. కానీ ఇప్పుడిదే సీరియస్‌ జాబ్‌గా మారిపోయింది. నా భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆర్థికంగా బాగానే ఉన్నాం. ఇద్దరు బిడ్డల ఆలనా పాలనా చూసుకుంటూ నేను ఇంటికే పరిమితమయ్యాను. 2013లో ఒకసారి నా స్నేహితురాలు ఫోను చేసింది. తనకు తెలిసిన ఒక అంధ పిల్లవాడికి పరీక్ష రాయాలని అభ్యర్థించింది. అతను రాసే పరీక్ష హాలు మా ఇంటికి చాలా దగ్గరగా ఉండడం వల్ల నేను వెంటనే ఒప్పుకున్నాను’ అంటున్న రమ ఇప్పుడు 25 కిలోమీటర్లు దూరం ప్రయాణించి కూడా పరీక్షలు రాస్తున్నారు. ‘ఒకసారి నా కొడుకును ఇంట్లో వదిలిపెట్టి పరీక్ష రాయడానికి వెళ్లాను. ఉదయం వెళితే మళ్లీ సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. కొన్ని గంటల పాటు పిల్లవాడు అలాగే ఒంటరిగా ఉన్నాడు’ అంటూ తన ప్రయాణపు ఓ జ్ఞాపకాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఇంత వ్యయప్రయాసలు పడి పరీక్షలు రాస్తున్న రమ, ఏ రోజూ ప్రతిఫలం ఆశించలేదు. ఏదైనా సంస్థ తరపున పరీక్షలకు హాజరైనప్పుడు, వారు డిజిటల్‌ వేదికగా రుసుము చెల్లించినా ఆ సొమ్మును ఇంటికి తీసుకువచ్చిన దాఖలా లేదు. దారిలోనే ఆ సొమ్మును సేవాసంస్థలకు ఇచ్చేసి వస్తారు. లేదా, పేద సాదలకు ఆహారం, దుస్తుల రూపంలో పంపిణీ చేస్తారు. ‘నా భర్త సహకారం లేకుండా నేను ఇది సాధించలేదు. ఏరోజూ ఆయన నన్ను ప్రశ్నించలేదు. నా స్వేచ్ఛను గౌరవించారు. నేను చేస్తున్న పనిని అభినందించారు. భర్త, కుటుంబ సహకారం ఉండబట్టే నేను ఇది సాధించాను’ అంటూ తన గొప్పతనాన్ని తగ్గించుకుంటారు రమ.
‘స్క్రైబ్‌’ సేవ వికలాంగ విద్యార్థుల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే గొప్ప సాధనం. అయితే దీర్ఘకాలం స్క్రైబ్‌గా ఉండడం సాధ్యం కాని పని. ఇది కేవలం పరీక్ష రాయడం ఒక్కటే కాదు, అంతకుమించిన బాధ్యత. రమ దశాబ్దం కాలానికి పైగా ఈ సేవలో నిమగమవ్వడం, అదీ ఉచితంగా అందించడం గొప్ప విషయం’ అంటున్నారు రమ గురించి బాగా తెలిసిన లూయీస్‌ బ్రెయిలీ అకాడెమీ కోఆర్డినేటర్‌ గణేష్‌.
రమ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో పదిమందికి పైగా అంధ విద్యార్థులు ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తమ ఉన్నతికి సహాయపడ్డ రమని ఇప్పటికీ వారు గుర్తుంచుకుని గౌరవిస్తారు. ‘ఎప్పుడో నేను చేసిన చిన్న సహాయాన్ని గుర్తుంచుకుని ఇప్పటికీ గౌరవించడం వారి మంచితనమే. ఇందులో నేను చేసిందేమీ లేదు. ఎంతోమంది విద్యార్థులకు పరీక్షలు రాశాను. ముఖ్యంగా ఆటిజం పిల్లలకు రాసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సంజ్ఞల భాషలో వారు చెప్పే సమాధానాన్ని పేపరు మీద పెట్టడం పెద్ద సవాలు. వాళ్లకి పరీక్షలు రాసిన చాలా సేపటి వరకు నేను సాధారణ స్థితికి వచ్చేదాన్ని కాదు. అంతలా వారితో మమేకమైతే గానీ పరీక్షలు రాయడం కుదరని పని’ అంటున్న రమ లాంటి నిస్వార్థ సేవకులు చాలా అరుదుగా కనిపిస్తారు.

➡️