భారత్‌ వెలిగిపోతోందా ? లేదే !

May 8,2024 05:18 #editpage

ప్రధాని మోడీ, బిజెపి నాయకులు చెబుతున్నట్లుగా భారతదేశం ఈరోజు మునుపెన్నడూ లేనంతగా వెలిగిపోతున్న మాట నిజమేనా? ప్రపంచ దేశాలకు భారత్‌ ఒక రోల్‌ మోడల్‌గా ఉన్నదా? భారత దేశాన్ని అలాంటి ఉన్నత స్థితిలో నిలపడం ద్వారానే మోడీ విశ్వగురు అయ్యారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే, వివిధ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు, వివిధ అంశాలలో తయారు చేసే వివిధ రకాల సూచీలను, ర్యాంకులను పరిశీలించాలి.
దేశమంటే మట్టి కాదు మనుషులు అన్న గురజాడ సూక్తి ప్రకారం, ఒక దేశపు సమగ్ర అభివృద్ధి అంటే ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాలలో, వారి స్థితిగతుల్లో, వారు అనుభవించే స్వేచ్ఛలో, సామాజిక గణాంకాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, వారు పొందే సూపరిపాలనలో అభివృద్ధిగా ఉంటుంది.
మరి అటువంటి అంశాల్లో మన దేశం పరిస్థితి, మన దేశ ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఒక పరిశీలన చేద్దాం.
ఇటీవల మన ప్రధాని, మంత్రిగణం నోట్లోంచి తరచుగా వినిపిస్తున్న మాట ”భారతదేశం ప్రపంచపు మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తి కాబోతోంది”.
అవును జిడిపి పరంగా 189 దేశాల్లో మనది 3వ స్థానం. కానీ జిడిపి పరంగా తలసరి ఆదాయంలో మన దేశం ఈ 189 దేశాల్లో 140వ స్థానంలో ఉంది. ఇది అత్యంత తీవ్రంగా పెరుగుతున్న ఆర్థిక అసమానతలను సూచిస్తోంది. ఈదేశపు బడా కార్పొరేట్లను ప్రపంచ కుబేరులుగానూ, ఈ దేశ పేద, మధ్య తరగతి ప్రజనీకాన్ని కటిక దారిద్య్రంలోకి నెట్టే విధంగానూ పాలకుల విధానాలున్నాయి అన్నమాట. ఆర్ధిక స్వాతంత్య్రంలో 178 దేశాల్లో 123వ స్థానం, మానవ వనరుల వినియోగ సూచీలో 152 దేశాలకు గాను 115వ స్థానంలో ఉండడం, ఉద్యోగ కల్పనలో 47 దేశాల్లో 42వ స్థానంలోను, ప్రజలపై ఉన్న అప్పుల భారంలో 189 దేశాలకుగాను 82వ స్థానంలోను, కనీస వేతనాల అమలులో 156 దేశాలలో 64వ స్థానంలోను, మరీ ముఖ్యంగా ఆధునిక బానిసత్వ సూచీలో 167 దేశాల్లో నాల్గవ స్థానంలో వుండడంపై విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి.
పాలకుల స్వభావం ఆ ప్రభుత్వ ప్రాధమ్యాలలో స్పష్టంగా కనిపిస్తుంది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో 107 దేశాలకుగాను 94వ స్థానంలోనూ, తలసరి ఆరోగ్య వ్యయంలో 190 దేశాలకు గాను 141వ స్థానంలోనూ, ఎడ్యుకేషన్‌ ఇండెక్స్‌లో 191 దేశాలకు గాను 145వ స్థానంలో ఉండగా మిలిటరీ వ్యయంలో 186 దేశాలకు గాను మూడవ స్థానంలో ఉండడం ఈ పాలకుల విధానాల్లో డొల్లతనాన్ని, సామ్రాజ్యవాద దేశాల ఆయుధ తయారీ కంపెనీలకు లొంగుబాటును, పొరుగు సరిహద్దు దేశాలతో చెడిపోతున్న సత్సంబంధాలను సూచిస్తోంది.
పాలకుల విధానాలే ప్రజల జీవన ప్రమాణాలను నిర్ధారిస్తాయి. ప్రపంచ ఆయుష్షు సూచీలో195 దేశాలకు గాను 125 వ స్థానంలో ఉండగా, ప్రపంచ మానవాభివృద్ధి సూచిలో 189 దేశాలకు గాను 131వ స్థానంలో ఉండడం, సాంఘికాభివృద్ధి సూచీలో 128 దేశాలకు గాను 117వ స్థానంలో ఉండడం, గ్లోబల్‌ యూత్‌ డెవలప్మెంట్‌ ఇండెక్స్‌లో 183 దేశాలకు గాను 134వ స్థానంలో ఉండడం, నవజాత శిశుమరణాల్లో 223 దేశాలకుగాను 113వ స్థానంలో ఉండడం, లింగ తారతమ్యంలో 144 దేశాలకు గాను 108వ స్థానంలో ఉండగా, లింగ వివక్షలో 188 దేశాలకు గాను 76వ స్థానంలో ఉండడం, ఇళ్ళు లేని వారి విషయంలో 52 దేశాలకు గాను 8వ స్థానంలో ఉండగా, పట్టణీకరణలో 199 దేశాలకు గాను 161వ స్థానంలో ఉండడం, క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ ఇండెక్స్‌లో 56 దేశాలకుగాను 43వ స్థానంలో ఉండడం, క్వాలిటీ ఆఫ్‌ ఎయిర్‌ ఇండెక్స్‌లో 92 దేశాలకు గాను 84వ స్థానంలో ఉండడం పాలకుల వినాశకర విధానాలను సూచిస్తోంది. 5జి యుగంలోకి తీసుకెళ్తున్నాము, అందరికీ ఇంటర్నెట్‌ విస్తరించాము అని బాజాలు కొట్టుకుంటున్న మన దేశంలో, జనాభాలో ఇంటర్నెట్‌ వాడే వారి శాతం ప్రకారం ప్రపంచంలోగల 228 దేశాల్లో 141వ స్థానం లోనూ, అలాగే ఇంటర్నెట్‌ స్పీడ్‌లో 149 దేశాలకుగాను 89వ స్థానంలో ఉండడం దయనీయమైన వాస్తవాన్ని తెలియజేస్తోంది.
ప్రపంచ సంతోష సూచీలో 156 దేశాలకు గాను 137వ స్థానంలో ఉన్న మన దేశం, ప్రపంచ శాంతి సూచీలో 163 దేశాలకు గాను 139వ స్థానంలో ఉండగా, ఉద్దేశపూర్వక జనహనన కేసుల్లో 219 దేశాలకుగాను రెండవ స్థానంలో ఉండడం, ట్రాఫిక్‌ ప్రమాదాల వలన జరిగే మరణాల్లో 180 దేశాలకు గాను రెండవ స్థానంలో ఉండడం, ఆత్మహత్యల రేటులో 176 దేశాలకు గాను 19వ స్థానంలో ఉండడం ఆందోళనకరం. ”ఎక్కడ పుడితే బావుంటుంది” అనే అంశం మీద 80 దేశాల పౌరులపై చేసిన విశ్లేషణలో మన దేశానికీ 72వ ప్రాధాన్యత లభించింది.
ప్రజా శ్రేయస్సు సూచికలో 149 దేశాలకు గాను 101వ స్థానంలో ఉండడం, ప్రజాస్వామ్య సూచికలో 112 దేశాలకు గాను 65వ స్థానంలో ఉండడం, చట్టబద్ద పాలన సూచీలో 113 దేశాలకు గాను 68వ స్థానంలో ఉండడం, పత్రికా స్వేచ్ఛలో 180 దేశాలకు గాను 148వ స్థానంలో ఉండడం, పాలకుల ఫాసిస్టు పోకడలను, నిరంకుశ విధానాలను ప్రతిబింబిస్తోంది.
పై గణాంకాలన్నీ ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు, వరల్డ్‌ బ్యాంక్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఎంతో శాస్త్రీయంగా తయారు చేసినవే.
వ్యవస్థీకృత సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌, వాట్సాప్‌ యూనివర్సిటీ సహాయంతో ఫేక్‌ పోస్టుల ద్వారా, తమ లోప భూయిష్ట పాలనను అద్భుతమైన పాలనగా చిత్రీకరించు కుంటున్నారు కేంద్ర బిజెపి పాలకులు. తమకి తామే విశ్వగురు, 56 అంగుళాల ఛాతీ వంటి ప్రశంసలు ఇచ్చేసుకుంటున్నారు. దేశం వెలిగిపోతోందని నమ్మబలుకుతూ, ప్రజలకు వాస్తవాలు అర్ధం కానివ్వకుండా వారిలో కులమతాల విద్వేషాలు నింపుతున్నారు. మరోసారి మందిరం ముసుగుతో అధికార పీఠం ఎక్కేస్తే, ఇక రానున్న ఐదేళ్లలో రాజ్యాంగ మౌళిక అంశాలను కూడా మార్చేసి, ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే మతం, ఒకడే రాజు-అన్న చందంలో అఖండ హిందూ సామ్రాజ్య స్థాపన వైపు దేశాన్ని తీసుకెళ్లే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిద్దామనుకుంటున్న వీరు ఒక్క విషయం మర్చి పోతున్నారు.
నిప్పుని పొట్లం కట్టి జేబులో దాచే ప్రయత్నం చేస్తే, అది జేబుని దహించుకుంటూ బయటికొచ్చి తన ఉనికిని చాటుతుంది. అలాగే మెజారిటీ ప్రజల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంటే, ఈ విషయాన్ని మరుగుపరిచి అంతా ఘనంగా ఉందంటూ నమ్మబలికే ప్రయత్నం ఎంత తీవ్రంగా చేసినా…పై గణాంకాలు వాస్తవాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరిస్తున్నాయి. వివిధ కీలక అంశాల్లో మన పాలకుల వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని, తప్పుడు ప్రాధాన్యతలను ఎత్తి చూపుతున్నాయి.
ఈ గణాంకాలు సోషల్‌ మీడియా, ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా వంటి సాధానాల ద్వారా విస్తృత జన బాహుళ్యానికి తక్షణం చేరాల్సిన అవసరం ఉంది.
ప్రజలు నిన్ను నీ మాటలను బట్టి కాక, నీ చేతలను బట్టి అంచనా వేస్తారనే స్పృహ లేని ఈ పాలకులకు…పై గణాంకాలను బట్టి జరుగుతున్న ఎన్నికల్లో తగిన శాస్తి తప్పకుండా జరుగుతుంది.
– భగత్‌

➡️