పాలీసెట్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

May 8,2024 12:34 #ap polycet, #Result Released
  • 2024 ప్రవేశ పరీక్షలో 87.61 శాతం విద్యార్థులకు అర్హత
  •  సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి
  •  వెబ్‌ సైట్‌ లో డౌన్‌ లోడ్‌ కు సిద్దంగా ర్యాంకు కార్డులు

ప్రజాశక్తి-అమరావతి : పాలీసెట్‌ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. అమరావతిలోని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ కార్యాలయంలో బుధవారం ఈ ఫలితాలను సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలీసెట్‌ 2024 ప్రవేశ పరీక్షలో 87.61 శాతం మంది విద్యార్దులు అర్హత సాధించినట్లు తెలిపారు. మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరుకాగా, 1,24,430 మంది అర్హత పొందారని తెలిపారు. బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా, 89.81 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 85,561 మంది హాజరుకాగా 86.16శాతం అర్హత సాధించారని తెలిపారు. ఆరుగురు అభ్యర్ధులు 120 కి 120 సాధించి అగ్రశ్రేణిలో నిలిచారని వారందరికీ మొదటి ర్యాంకును కేటాయించామని నాగరాణి పేర్కొన్నారు. విశాఖ పట్నం జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో 87.17 శాతం అర్హత పొందగా, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి 70.46 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారు. ర్యాంకుల కేటాయింపు గురించి వివరిస్తూ సమాన మార్కులు సాధిస్తే లెక్కలులో ఎక్కువ మార్కులు పొందిన విద్యార్ధికి మెరుగైన ర్యాంకు కేటాయిస్తామన్నారు. లెక్కలలో కూడా ఒకేలా ఉంటే రసాయన శాస్త్రం, తదుపరి బౌతిక శాస్ర్రం మార్కులు పరిగణనలోకి తీసకుంటామని, మూడు సబ్జెక్టులలో సమాన మార్కులు పొందితే వారికి ఒకే ర్యాంకు ఇచ్చి, అడ్మిషన్ల సమయంలో పదవతరగతి మార్కులు అధారంగా సీటు కేటాయిస్తామని నాగరాణి వివరించారు. ఆ మార్కులు సైతం ఒకేలా ఉంటే వారి పుట్టిన తేదీ అధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ర్యాంకు కార్డులను వెబ్‌ సైట్‌ నుండి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని, ప్రవేశాల కౌన్సిలింగ్‌ తేదీలను త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. 2024 2025 విద్యా సంవత్సరం జూన్‌ పదవ తేదీ నుండి ప్రారంభం అవుతుందని, పత్రికలలో వచ్చే కౌన్సిలింగ్‌ ప్రకటన పట్ల అప్రమత్తంగా ఉండాలని కమీషనర్‌ తెలిపారు. 88 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లలో 18,141 సీట్లు, 179 ప్రవేటు పాలిటెక్నిక్‌ లలో 64,729 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మొత్తంగా 267 కళాశాలల్లో 32 విభాగాలలో 82,870 సీట్లలో 2, 3, 3.5 సంవత్సరాల డిప్లమో కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సాంకేతిక విద్య శాఖ సంయిక్త సంచాలకులు వెలగా పద్మారావు, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి రమణబాబు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ డి. జానకి రామ్‌, ఉపసంచాలకులు కళ్యాణ్‌, విజయ బాస్కర్‌, నాగేశ్వరావు, సంయిక్త కార్యదర్శి జివివిఎస్‌ ఎన్‌ మూర్తి , ఉప కార్యదర్శి ఎ రవికుమార్‌ , కెవి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

https://polycetap.nic.in/apssprc.aspx లింక్‌పై క్లిక్‌ చేసి.. కనిపించే విండోలో హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి సులభంగా ఫలితాలు చూసుకోవచ్చు.

పాలిసెట్‌ ర్యాంకర్లు వీరే

గరిష్ట మార్కులు 120 కి 120 సాధించిన చల్ల నాగ వెంకట సత్య శ్రీ వర్దిని, పులబంధం మోహిత్‌ కృష్ణ సాయి, జొన్నలగడ్డ యశ్వంత్‌ సాయి, శీలం శ్రీరామ్‌ భావదీప్‌, పోతుల జ్ణాన హర్షిత, కుమ్మరపురుగు లోకేష్‌ శ్రీహర్షలకు మొదటి ర్యాంకు సాధించారు. 119 మార్కులు సాధించిన శీలం ఐశ్వర్య, దేవా శ్రీవేద్‌, గొల్ల ప్రభాస్‌ తేజ, కాకర్ల శ్రీ సాయినాగ్‌, సిరిమల్ల లక్ష్మి తనుష్క, రెడ్డి జీవన్‌, గుడ్డ సాహితిలకు ఏడవ ర్యాంకును కేటాయించారు.

గత విద్యా సంవత్సరంలోనే 11,000 మందికి ఉద్యోగాలు
డిప్లమా పూర్తి చేసిన మరుక్షణం పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉపాధిని చూపగలుగుతున్నామని. ఈ క్రమంలో గత విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తి చేసిన వారిలో 11 వేల మందికి ఉద్యోగాలు కల్పించగలిగామని నాగరాణి తెలిపారు. ఇందుకోసం స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టటంతో పాటు, నిరంతరం పరిశ్రమల యాజమాన్యాలతో సాంకేతిక విద్యా శాఖ కలిసి పనిచేస్తుందన్నారు. 36 ప్రభుత్వ పాలిటెక్నక్‌లు నేషనల్‌ బోర్డ్‌ ఆప్‌ అక్రిడిటేషన్‌ పొందాయని, 84 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లలో వర్చువల్‌, డిజిటల్‌ తరగతి గదులు అందుబాటులో ఉన్నాయన్నారు. లెర్నింగ్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టమ్‌, మేనేజ్‌ మెంట్‌ ఇన్‌ ఫర్‌ మేషన్‌ సిస్టమ్‌ విధానాలలో మెరుగైన విద్యా బోధన సాగుతుందన్నారు. మరోవైపు ఏడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సాంకేతిక నైపుణ్యాభివృద్ధి సంస్ధలు ఏర్పాటు కాగా, మరో 33 ఎస్‌ డిసి కేంద్రాలు వివిధ పాలిటెక్నిక్‌ లలో నెలకొల్పబడ్డాయని నాగరాణి వివరించారు. అర్హత కలిగిన విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీఎంర్స్‌ మెంట్‌ తో పాటు, ఎఐసిటిఇ బాలికలలకు ప్రగతి ఉపకార వేతనాల రూపేణా రూ.50వేలు, శారీరక వికలాంగులకు సాక్ష్యం ఉపకారవేతనాలుగా రూ.50వేలు అందిస్తుందని వివరించారు.

➡️