YCP: సంక్షేమం కొనసాగిస్తాం -విశాఖ నుండి పాలన

Apr 28,2024 09:36 #ap cm jagan, #manifestos, #released, #YCP

వైసిపి మ్యానిఫెస్టో విడుదల చేసిన జగన్మోహన్‌రెడ్డి
ప్రత్యేక హోదా కోసం కృషి
వచ్చే ఐదేళ్లలో పోలవరం పూర్తి
వైఎస్‌ఆర్‌ చేయూత రూ.1.50 లక్షలకు పెంపు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రానున్న ఐదేళ్ల కాలంలోనూ సంక్షేమాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఆయన వైసిపి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఒక్కో పథకం, దాని లక్ష్యాలను వివరించారు. గత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని, రానున్న ఐదేళ్ల కాలంలోనూ అదే స్ఫూర్తితో పనిచేస్తామని ఎప్పారు. రానున్న ఐదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధానిగా అభివృద్ధి చేస్తామని అదే విధంగా అమరావతిని శాసన రాజధానిగానూ, కర్నూలును న్యాయ రాజధానులుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. భూముల రీసర్వే చేస్తామని వివరించారు. వైఎస్‌ఆర్‌ చేయూతను రూ.1.50 లక్షలకు, జగనన్న అమ్మఒడి రూ.17 వేలకు పెంచుతామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో పదిలక్షల ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఏటా ఇస్తున్న రూ.13,500 రైతు భరోసాను రూ.16 వేలకు పెంచుతామని, ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. 25 వేలు జీతం పొందే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా నవరత్నాలు అమలు చేస్తామని హామీనిచ్చారు. ప్రాధాన్యతాక్రమంలో జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజల కోసం గృహ నిర్మాణం కింద వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.1000 కోట్లు ఇస్తూ రూ.2000 కోట్లు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని వివరించారు. సున్నావడ్డీ పథకాన్ని, వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా ఇస్తామని, పెళ్లికి రాయితీలు పొందాలంటే పదోతగరతి ఖచ్చితంగా చదవాలని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ ఇబిసి నేస్తం కింద వచ్చే ఐదేళ్లలో ఏడు విడతల కింద రూ.1.05 లక్షల వరకూ రుణం అందిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లు పింఛన్లను వలంటీర్ల ద్వారా ఇంటివద్దే ఇస్తామని తెలిపారు.
క్రమ తప్పకుండా గ్రూపు పరీక్షలు
యువత కోసం క్రమం తప్పకుండా గ్రూప్‌ా1, 2 పరీక్షలు నిర్వహిస్తామని, యుపిఎస్‌సి తరహాలో నిర్థిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీ, విశాఖలో స్టార్టప్‌ హబ్‌, ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్‌ కాలేజ్‌ నిర్మించడంతోపాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం కృషి కొనసాగిస్తామన్నారు. యూనివర్శిటీల్లో పెండింగ్‌లో ఉన్న 3295 పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు. 2025లో ఒకటో తరగతికి ఐబి విద్యావిధానం ఉంటుందని, ప్రతి ఏటా ఈ విధానాన్ని తరగతుల వారీగా పెంచుకుంటూ పోతామని తెలిపారు. మత్స్యకార భరోసా ఇక నుండి లక్షకు పెంచుతామని, ఆటోటాక్సీ డ్రైవర్లకు ఐదేళ్లలో రూ.లక్ష లబ్ది కలిగిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లపాటు న్యాయవాదులకు నెలభృతి ఇచ్చే పథకాన్ని కొనసాగిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం కొనసాగిస్తామని, వచ్చే ఐదేళ్లలో ఐదు కొత్త మెడికల్‌ కళాశాలలు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.
కొత్త పంచాయతీలు…
వచ్చే ఐదేళ్లలో గ్రామంలో మొత్తం జనాభాలో 50 శాతం దళితులు ఉండి, 500కుపైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పాటు చేస్తామని, క్రిస్టియన్‌ మైనార్టీలకు సబ్‌ప్లాను పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు. ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కుల వృత్తులకు ఇప్పటి వరకూ ఇస్తున్న జగనన్న తోడు రుణ పరిమితిని రూ.10 వేల నుండి రూ.15 వేలకు పెంచుతున్నట్లు వివరించారు. రూ.20 వేల వరకూ వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పారు. నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు జగనన్న చేదోడు పథకం కొనసాగిస్తామని వివరించారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, రోడ్ల మరమ్మతు, జిల్లా కేంద్రాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు రూ.2000 కోట్లు నిధులు కేటాయిస్తామని వివరించారు. ప్రతి జిల్లాలో పిపిపి పద్ధతిలో ఇండిస్టియల్‌ పార్కు ఏర్పాటు చేస్తామని, ఎంఎస్‌ఎంఇలకు ప్రతి ఏటా ప్రోత్సాహకాలు ఇస్తామని వివరించారు.

➡️