పథకాలు కాదు..భారాలు ఎంత వేస్తారో చెప్పండి

Apr 29,2024 08:38 #cpm v srinivasarao, #press meet
CPM State Secretary direct question to YCP, TDP, Janasena

-ప్రజలపై ధరలు, పన్నుల భారాలు మోపబోమని హామీ ఇవ్వాలి
-రాజకీయాలను శాసిస్తున్న కార్పొరేట్లను సాగనంపండి
-ఇండియా వేదిక అభ్యర్ధులను గెలిపించాలి
సిపిఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాస రావు
అమరావతి: సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఇచ్చే వాటిని పోటీలు పడి ప్రకటిస్తున్నారని అవి కాకుండా ప్రజల నుంచి పన్నులు, ధరలు పెంచి ఎంత వసూలు చేస్తారో చెప్పాలని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు వైసిపి, టిడిపి, బిజెపిలను ప్రశ్నించారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ధరలు పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మానిఫెస్టోల పేరుతో ప్రజలకు పంచే పథకాలు గురించే చెబుతున్నాయని పన్నులు, భారాలు గురించి ప్రస్తావించడం లేదని తెలిపారు. ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావుతో కలిసి విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మూడు హామీలు ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఆస్తి, చెత్త, జిఎస్టీ తదితర పన్నులు, కరెంటు చార్జీలు, ఇసుక, పెట్రోలు, గ్యాసు సహా నిత్యావసర సరకుల ధరలు పెంచబోమని, కొత్త భారాలు ప్రజలపై మోపబోమని, ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టబోమని హామీలు ఇవ్వాలని నిలదీశారు. భూమి, సాగు నీటి హక్కు రైతులకే ఉండాలని చెప్పారు. అడవులపై ఆదివాసీలకు హక్కులు ఉండాలని, ఉపాధి హామీ వ్యవసాయ కార్మికుల హక్కుగా కనీస వేతనాలు పొందడం కార్మికుల హక్కుగా ఉండాలని చెప్పారు. ఈ హక్కులను కాపాడతాయో లేదో ఈ పార్టీలు చెప్పడం లేదన్నారు. రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ బిజెపి పల్లకిని మోస్తున్న మూడు పార్టీలు మోస్తున్నాయని ఎద్దేవా చేశారు. సిఎఎ గురించి వైసిపి, టిడిపి మాట్లాడడం లేదని, విశాఖ ఉక్కు, పోలవరం నిర్వాసితులపై మౌనం పాటిస్తున్నాయని విమర్శించారు.
పదేళ్లల్లో అభివృద్ధి శూన్యం
వైసిపి ఎన్నికల ప్రణాళిక విడుదల్కెన నేపధ్యంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన పదేళ్లల్లో రాష్ట్రంలో అభివృద్ధి సాధించామని వైసిపి, టిడిపి డబ్బాలు కొట్టుకుంటున్నాయని, వాస్తవం మాత్రం శూన్యమని విమర్శించారు. పిల్లల చదువు, పౌష్టికాహారం వంటి 12 సూచికల్లో ఒక్కదానిలో కూడా మొదటి స్థానం సాధించలేదని, కనీసం ఆ దారిదాపుల్లో కూడా లేదన్నారు. కేరళ రాష్ట్రం మాత్రం ఐదు అంశాల్లో చోటు దక్కించుకుందన్నారు. చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించకుండా, పిల్లలకు చదువు అందించకుండా ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత రైతులు 13లక్షల వ్యవసాయ సాగుభూమిని కోల్పోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, ఇది ఆందోళనకర అంశమని చెప్పారు. భూ కేంద్రీకరణ పెరిగిందని,చిన్న రైతుల వద్ద ఉండే భూమి శాతం కూడా తగ్గిందన్నారు. ఈ భూములు మొత్తం కార్పొరేట్‌, రియట్‌ ఎస్టేట్‌ చేతుల్లోకి వెళ్లిందన్నారు. కార్పొరేట్లకు అప్పగించిన కాకినాడ సెజ్‌, సౌత్‌, నార్త్‌, ఈస్ట్‌ వంటి కారిడార్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. ఈ భూముల్లో వ్యవసాయం చేసి పంటలు పండిరచినట్లయితే అభివఅద్ధి చెందేదని చెప్పారు. సాగునీరు 40వేల హెక్టార్లలో తగ్గిందని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని చెబుతున్న వైసిపి, టిడిపి దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. గత టిడిపి ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో 1,29,528 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, సూపర్‌ సిక్స్‌లో మాత్రం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. వీటిని ఎక్కడి నుంచి తెస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ కల్పనపై వైసిపి మాట్లాడటం లేదన్నారు. ఆ పార్టీ ప్రకటించిన మానిఫెస్టోలో ఈ అంశంపై ప్రస్తావనే లేదని చెప్పారు.

సామాన్యులకు, సంపన్నుల మధ్య పోటీ
రానున్న ఎన్నికలు సామాన్యులకు సంపన్నుల్కెన బడా కార్పొరేట్ల మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పారు. అభ్యర్ధుల 175 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి, వైసిపి, బిజెపిల నుంచి అత్యంత సంపన్నులు పోటీలో ఉన్నారని వారి జాబితాను విడుదల చేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 కోట్లు నుండి 6వేల కోట్లు వరకు ఉన్నాయని వివరించారు. 175 నియోజకవర్గాలకు గాను 124 (71శాతం) మంది నయా ధనికులు ఉ ఉన్నారని చెప్పారు. పారిశ్రామిక వేత్తలు, ఎన్‌ఆర్‌ఐ, రియల్‌ ఎస్టేట్‌, మైనింగ్‌, మద్యం సిండికేట్‌, విద్యాసంస్థలు, ఆస్పత్రులు వంటి వ్యాపారాల్లో ఉన్నారని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని హైజాక్‌ చేసి రాజకీయాలను శాసించే స్థాయికి కార్పొరేట్లు వచ్చారని చెప్పారు. రూ.100కోట్లు పెట్టుబడి పెట్టి రూ.1000కోట్లు సంపాదించే లాభసాటి వ్యాపారంగా రాజకీయాలను మార్చేశారని తెలిపారు. దీనివల్ల సామాన్యులకు ఎలాంటి మేలు జరుగుతుందని ప్రశ్నించారు. పోటీలో ఉన్న సంపన్నులు, పోటీ చేస్తున్న శతకోటేశ్వరులు ఒక్కపైసా కూడా ఓటర్లకు పంచకుండా గెలిస్తే ప్రజల విశ్వాసం ఉన్నట్లే అని చెప్పారు. సిపిఎం అభ్యర్ధులు 8 అసెంబ్లీ, 1 పార్లమెంటులో పోటీలో ఉన్నారని, వీరి ఆస్తుల మొత్తం రూ.5.90కోట్లు మాత్రమే అని చెప్పారు. మరో 8 చోట్ల పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్ధుల ఆస్తులు మొత్తం రూ.9.84కోట్లు మాత్రమేనని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఇటువంటి బడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిందంటే సామాన్యుల గొంతు ఉండదన్నారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, దళిత, ఆదివాసీ, మహిళలు గురించి మాట్లాడే వామపక్షాలు పదేళ్ల నుంచి అసెంబ్లీలో లేరని తెలిపారు. అసెంబ్లీ మొత్తాన్ని బూతులు ప్రాంగణంగా మారుస్తూ మహిళలను అవమానిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు ప్రస్తుతం గులకరాయి రాజకీయం తోడ్కెందన్నారు. ప్రజలకు కావాల్సినవి ఇవి కాదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ను ఎంటర్‌ట్కెన్‌మెంట్‌ గా మార్చారని పేర్కొన్నారు. ఈ స్వభావం మార్చాలంటే ప్రజల కోసం అంకితభావంతో పోరాడుతున్న వామపక్ష అభ్యర్ధులను గెలిపించుకోవాలని కోరారు.

రాష్ట్ర హక్కులపై నోరు మెదపని జగన్‌, చంద్రబాబు
రాష్ట్రం హక్కులకు సంబంధించిన కీలకమైన సమస్యల గురించి జగన్‌, చంద్రబాబు నోరుమెదపడం లేదని విమర్శించారు. ప్రత్యేక హౌదా పోరాడి సాధిస్తామని చెప్పకుండా జగన్‌ సాగదీస్తున్నారని విమర్శించారు. ఈ ఐదేళ్లల్లో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఊకదంపుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ప్రణాళికలు ప్రజలను ముంచేస్తాయే తప్ప ఉద్దరించేవి కాదన్నారు. అధికారంలోకి వస్తే హౌదా ఇస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసిందన్నారు. హౌదా ఇవ్వబోమని బిజెపి చెప్పిందన్నారు. జగన్‌, చంద్రబాబు ప్రణాళికలను, వారి మాయ మాటలను తిరస్కరించి ఇండియా బ్లాక్‌లో ఉన్న సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ అభ్యర్ధులను గెలిపిస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హౌదా వస్తుందన్నారు. విశాఖ ఉక్కుపై రాష్ట్రమంతా ఆందోళన జరుగుతున్నా దీనిని కాపాడతామనే మాట రెండు పార్టీలు చెప్పడం లేదని చెప్పారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు రెండు పార్టీలు కూడా ఆమోదం తెలుపుతూ కార్మికులకు అండగా ఉంటామని ఓట్లు అడుగుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ప్రాజెక్టులపై వైసిపి తన మానిఫెస్టోలో పొందుపరచనేలేదన్నారు. రానున్న ఐదేళ్లల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తానని చెబుతున్న వైసిపి నిర్వాసితుల సంగతేంటని నిలదీశారు. పరిహారం ఇవ్వకుండా నిర్వాసితులను ఇద్దరూ గోదావరిలో ముంచేస్తారా అని ప్రశ్నించారు. దేవీపట్నం మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలను గత టిడిపి ప్రభుత్వం నీళ్లు వదిలేసి తరిమేస్తే, వైసిపి వరదల్లో ముంచేసిందన్నారు. రాజధాని వాసులను టిడిపి త్రిశంక స్వర్గంలోకి తీసుకెళ్తే రాజధానే లేకుండా చేసిన ఘనత వైసిపిదని విమర్శించారు. రాజధానికి 33వేల ఎకరాలు అవసరం లేదని, తక్షణమే 5%-%6 వేల ఎకరాల్లో శాశ్వత భవనాలు నిర్మించాలని తాము గతంలో చెప్పామన్నారు. ఇది జరిగి ఉంటే రాజధాని మార్చే అవకాశం ఉండేది కాదన్నారు. రష్యా, చ్కెనా, సింగపూర్‌, జర్మనీ నమూనాలు అంటూ ఐదేళ్ల పాటు తిరిగి చివరకు సినీ దర్శకుడు రాజమౌళితో ప్రజలకు టిడిపి త్రిడి సెట్టింగులు చూపించిందన్నారు. విశాఖపట్నం రాజధాని అంటున్న వైసిపి రిషికొండకు బోడిగుండు కొట్టి రూ.500కోట్లతో గెస్ట్‌హౌస్‌ నిర్మించింది, తప్ప ఎలాంటి అభివఅద్ధి సాధించలేదన్నారు. ఇద్దరు కలిసి రాజధాని వాసులను నాశనం చేసి రైతులను వీధిపాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పారు. ల్యాండ్‌ పూలింగ్‌తో చంద్రబాబు రైతులను అన్యాయం చేస్తున్నారని తాము ఆనాడే చెప్పామని తెలిపారు. ప్రస్తుతం రైతులు భూములు కోల్పోయారని, అక్కడ పంటలు లేవని, వారికి ప్లాట్లు రాలేదన్నారు.

➡️