రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోని మూడు మ్యానిఫెస్టోలు

May 4,2024 05:50 #Articles, #BJP, #edit page, #JanaSena, #TDP, #YCP

సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల నుంచి ఉద్భవించి, తమ రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పోటీ పడతాయి. తెలుగుదేశం పార్టీ 1982లో ‘ఆంధ్రుల ఆత్మగౌరవం’ నినాదంతో ఏర్పడింది. 1980వ దశకంలో శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వానగల కేంద్రప్రభుత్వ ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా ఎన్‌.టి.రామారావు, జ్యోతిబసు, రామకృష్ణ హెగ్డే, ఫరూక్‌ అబ్దుల్లా మొదలగు నాయకులు సమావేశాలు జరిపి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో మార్పు తెచ్చి, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇచ్చేలా సర్కారియా కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే.
18వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు కూడా రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న మూడవ ఎన్నికలకు…వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలను పరిశీలిస్తే…మూడు ప్రాంతీయ పార్టీల అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను విస్మరించాయి. గత పదేళ్లుగా ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీల అమలు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, పోలవరం నిర్మాణం మొదలగు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి, పోరాడి హక్కులను సాధించుకోవడానికి బదులు కేంద్రానికి సాగిలబడ్డాయి. భావితరాలకు అన్యాయం చేసేవిధంగా మూడు ప్రాంతీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలలో ఈ అంశాలు కనిపించలేదు.

అభివృద్ధి అవసరం లేదా?
సాధారణంగా సాంప్రదాయ అర్ధశాస్త్రంలో అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల, తలసరి ఆదాయం పెరుగుదల మొదలగు అంశాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ధితో పాటు ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి, మానవాభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పన మొదలగు అంశాలు కూడా అభివృద్ధిలో భాగంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం మిగిలిన అంశాలను విస్మరించి కేవలం రాజధాని భూముల సమీకరణ, సింగపూర్‌ నమూనా తదితర అంశాలకే పరిమితమైంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచనలు చేయలేదు. 2019-2024 మధ్య పాలించిన వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కేవలం ‘బటన్‌ నొక్కుడు’ (డిబిటి)కే పరిమితమై మిగిలిన అన్ని అంశాలను నిర్లక్ష్యం చేసింది. మౌలిక వసతులలో భాగంగా కనీసం రోడ్ల నిర్మాణం కూడ చేయలేదు.
టిడిపి-జనసేన కూటమి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో అభివృద్ధికి అవసరమైన అంశాలను తాము విస్మరించిన తీరును ప్రజలు గుర్తించకుండా ఉండటానికే ఎన్నికల ప్రచారంలో పరస్పర దూషణలు, వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నాయి. అభివృద్ధి అంశాలను ప్రస్తావించకుండా కేవలం సంక్షేమ అంశాలకే పరిమితమైనారు. అభివృద్ధి- సంక్షేమాన్ని సమతుల్యం చేయాలనే ఉద్దేశం మూడు ప్రాంతీయ పార్టీలకు లేకపోగా, మూడు పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి అంటకాగటం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విషాదకరమైన విషయం. మూడు ప్రాంతీయ పార్టీలు విస్మరించిన అంశాలపై వాటిని నిలదీయాల్సిన అవసరముంది.

ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా గురించి మూడు ప్రాంతీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలలో చేర్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్ట ఆమోద సమయంలో ఎ.పి కి ప్రత్యేక హోదా ఐదేళ్ల పాటు ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించారు. 2014 మేలో ఏర్పడిన మోడీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా 5 కోట్ల ఆంధ్రులను ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసింది. ప్రత్యేక హోదా వలన రాష్ట్రంలో పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు లభించి పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. 2014కు ముందు ప్రణాళికా సంఘం సిఫార్సులతో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లభించింది. కానీ, గత పదేళ్లుగా అధికారంలో ఉన్న రెండు పార్టీలు కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలం చెందాయి. ప్రత్యేక హోదా కోసం గత దశాబ్ద కాలంలో అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ వాటిని అణచివేయడానికే ప్రయత్నించారు. ఒక్కసారి కూడా ప్రత్యేక హోదాపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించటానికి ప్రయత్నించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరూ ప్రత్యేక హోదా కోరుతున్నప్పటికీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలలో ప్రత్యేక హోదాను విస్మరించటం శోచనీయమైన విషయం.

విభజన హామీలు – అమలు
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయటంలో దశాబ్ద కాలంగా మోడీ ప్రభుత్వం ఆంధ్రులకు అన్యాయం చేసింది. ముఖ్యంగా 9,10 షెడ్యూళ్లలో వున్న ఉమ్మడి ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య విభజించలేదు. 13వ షెడ్యూల్‌లో వివరించిన 11 జాతీయ విద్యా సంస్థలకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ ఇప్పటికి రూ.4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. విభజన చట్టంలో చెప్పిన కడపలో ఉక్కు కర్మాగారం, దుగ్గరాజ పట్నం వద్ద భారీ ఓడరేవు, విశాఖపట్నంలో రైల్వేజోను ఏర్పాటు చేయాలి. వీటితో పాటు గ్రీన్‌ఫీల్డ్‌ ముడి చమురు శుద్ధి కర్మాగారం, వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పరచాలి. విశాఖపట్నం, విజయవాడలలో మెట్రో రైలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ఈ చట్టం గుర్తించిన 7 వెనుక బడిన జిల్లాలకు బుందేల్‌ఖÛండ్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. వీటితోపాటు రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలి. దశాబ్ద కాలంగా ఈ విభజన హామీలు ఏవీ అమలు జరగలేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలలో 3 ప్రాంతీయ పార్టీలూ వీటిని ప్రస్తావించలేదు.

రైతాంగం – నీటిపారుదల రంగం
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగం, రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో వున్నది. కౌలు రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటే స్వామినాథన్‌, జయతీ ఘోష్‌, రాధాకష్ణన్‌ కమిటీల సిఫార్సులు అమలు జరపాలి. రైతులందరికీ రుణాలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి. కౌలు రైతుల కోసం 2011లో చేసిన చట్టం గానీ, 2019లో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేసిన చట్టం గానీ ఉపయోగపడలేదు. కౌలురైతులకు భూయజమాని సంతకం వుండాలనే నిబంధన వలన రుణాలు అందటంలేదు. కౌలు రైతులందరికీ భూయజమాని తీసుకున్న రుణంతో సంబంధం లేకుండా బ్యాంకుల రుణాలు కల్పించాలి. నీటిపారుదల రంగాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండూ నిర్లక్ష్యం చేశాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార, వెలిగొండ, హంద్రి-నీవా, గాలేరు-నగరి మొదలైన ప్రాజెక్టులతో పాటు మధ్య-చిన్న తరహా నీటి ప్రాజెక్టులను కూడా తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. ఉదాహరణకు ఇరిగేషన్‌కు బడ్జెట్‌లో గత నాలుగేళ్లలో రూ.61,573 కోట్లు కేటాయించి, రూ.32,059 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం దారుణమైన విషయం. ప్రాజెక్టుల ద్వారా జలాలను వినియోగించకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అసాధ్యం.

పోలవరం ప్రాజెక్ట్‌- నిర్వాసితులు
విభజన చట్టంలో సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. పర్యావరణ, అటవీ, పునరావాస, పునర్నిర్మాణ అనుమతులకు కేంద్రానిదే బాధ్యత అని పేర్కొన్నారు. 2017-18 సవరించిన అంచనాల ప్రకారం మొత్తం వ్యయం రూ.55,606 కోట్లుగా అంచనా వేశారు. దీనిలో భూసేకరణకు, పునరావాసానికి రూ.33 వేల కోట్లు ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించటం అతి పెద్ద అంశం. 373 గ్రామాలలో 1,05,000 కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయి. ఇప్పటికి కేవలం 8,000 కుటుంబాలకు మాత్రమే పునరావాసం జరిగి 9 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పునరావాసం జరగకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదు. పునరావాసానికి కేంద్రప్రభుత్వం బాధ్యత వహించాలని విభజన చట్టం తెలుపగా, నిధులతో మాకు సంబంధంలేదని కేంద్రప్రభుత్వం వివరిస్తున్నది. ఈ వారంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ నిర్వాసితుల పునరావాసం కోసం రాష్ట్ర ప్రజలపై ”సెస్సు” విధిస్తామని ప్రతిపాదించడం దారుణమైన విషయం. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి న్యాయంగా రావలసిన హక్కులను సాధించుకోకుండా, ఈ రకమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రజల హక్కులను దెబ్బతీస్తాయి.

విశాఖ ఉక్కు – ప్రయివేటీకరణ
విశాఖపట్నం ఉక్కు కర్మగారాన్ని ”విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు” నినాదంతో అనేక త్యాగాల ద్వారా సాధించుకున్నాము. ఆనాటి ఉద్యమంలో 32 మంది మరణించి ప్రాణత్యాగం చేశారు. 64 గ్రామాలకు చెందిన రైతులు ఉక్కు కర్మాగారం కోసం 26 వేల ఎకరాలు ఇచ్చి త్యాగం చేసి, నిర్వాసితులుగా మారారు. ఇప్పుడు ఉక్కు కర్మాగారం ఆస్తుల విలువ రెండు లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఉక్కు కర్మాగారం వలన విశాఖ నగరం, గాజువాక వంటి ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఉక్కు కర్మాగారానికి స్వంత గనులు ఇవ్వకుండా, వివక్షత చూపటంతో ఉక్కు కర్మాగారం కొంత మేరకు నష్టాలు ఎదుర్కొన్నది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరిస్తామని, జిందాల్‌-అదానీ వంటి క్రోనీ పెట్టుబడిదారులకు అమ్మేస్తామని ప్రకటించడం దారుణమైన విషయం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత వెయ్యి రోజులకు పైగా పెద్ద ఉద్యమం జరుగుతున్నది. వామపక్షాలు ప్రధాన పాత్ర వహించాయి. మూడు ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో ”సన్నాయి నొక్కులు” తప్పితే నిర్దిష్టంగా ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనలేదు. మూడు పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ముఖ్యంగా ఎన్‌డిఎలో భాగస్వాములుగా మారిన టిడిపి, జనసేన పార్టీలు మోడీ ప్రభుత్వంపై, బిజెపిపై ఒత్తిడి తేవాలి.

పారిశ్రామికాభివృద్ధి-ఉపాధి
గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరగలేదు. మూడు ప్రాంతీయ పార్టీలకు పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై స్పష్టమైన దృక్పథం లేదు. రాష్ట్రంలో ఐ.టి రంగం, ఫార్మా రంగం, టెక్స్‌టైల్స్‌, వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోలేదు. విశాఖపట్నంతో పాటు తిరుపతి, అనంతపురం, ప్రకాశం జిల్లాలో దొనకొండ, గన్నవరం తదితర ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. నిరుద్యోగులకు ప్రభుత్వ శాఖలలో ఖాళీగా వున్న ఉద్యోగాలతో పాటు, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయటం ద్వారా ఉపాధి కల్పించాలి. పెద్ద సంఖ్యలో ఉన్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్‌తో ఉద్యోగ భద్రత కల్పించాలి. అనేక రాష్ట్రాలలో సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేశారు. మన రాష్ట్రంలో సిపిఎస్‌ రద్దు గురించి 2014-19 మధ్య తెలుగుదేశం, 2019-2024 మధ్య వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం మాట తప్పాయి. ఇప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టోలలో సిపిఎస్‌ గురించి చర్చిస్తామని చెప్పారు తప్పితే రద్దు చేస్తామని మూడు పార్టీలూ పేర్కొనలేదు.

మైనారిటీల హక్కులు-రక్షణ
గత దశాబ్ద కాలంగా దేశంలో మోడీ ప్రభుత్వం మైనారిటీలను ముఖ్యంగా ముస్లిం మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నది. జమ్ము – కాశ్మీర్‌ రాష్ట్రానికి ఆర్టికల్‌ 370 రద్దు చేసింది. గోరక్షక దళాల పేరుతో మైనారిటీలపై అనేక భౌతిక దాడులు జరిగాయి. ఎన్నికలలో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, లౌకికవాదాన్ని రద్దు చేస్తామని బిజెపి పార్లమెంట్‌ సభ్యులు ప్రకటిస్తున్నారు. 2019లో చేసిన ”పౌరసత్వ సవరణ చట్టం” (సిఎఎ) అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి 11న నోటిఫికేషన్‌ విడుదల చేసినది. దీనివలన పౌరసత్వం ఇవ్వడం మతం ఆధారంగా జరుగుతుంది. ప్రజలను మతపరంగా విభజించటానికే ఈ చట్టం చేశారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలు ఈ చట్టం గురించి ఇంతవరకు వ్యాఖ్యానించటంగాని, ఖండించటంగాని చేయలేదు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అనేక సభలలో మాట్లాడుతూ ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేస్తామని పదే, పదే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యాలయాలలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఈ అంశంపై కూడా ఈ పార్టీలు ఇంతవరకు ఖండించలేదు.

స్పష్టమైన వైఖరి ఎవరిది?
ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ పట్ల, అభివృద్ధి పట్ల మూడు ప్రాంతీయ పార్టీలు స్పష్టంగా లేవు. ‘సంక్షేమమే’ మొత్తం అభివృద్ధి అన్న విధంగా వ్యవహరిస్తున్నాయి. వ్యక్తిగత దూషణలు, నిందలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. కులతత్వాన్ని రెచ్చగొడుతున్నాయి. అదే సమయంలో ‘ఇండియా’ వేదికలో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా’ కల్పించే ఫైల్‌పై సంతకం చేస్తామని ప్రకటించింది. విభజన హామీలు అమలు చేస్తామని ప్రకటించింది. సిపిఎం రాష్ట్ర అభివృద్ధిపై అనేక వర్క్‌షాప్‌లు నిర్వహించి ‘రాష్ట్ర సమగ్ర అభివృద్ధి’ ప్రణాళికను ప్రకటించింది. సిపిఐ రాష్ట్ర అభివృద్ధి కోసం స్పష్టమైన విధానాలను ప్రకటించింది.
ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అన్నిటికంటే శక్తివంతమైనది. ప్రజలు, ప్రజాసంఘాలు, వామపక్ష సంఘాలు, దళిత-బహుజన సంఘాలు, అభ్యుదయ వాదులు, మేధావులు అందరూ కలసి ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధి కోసం జరిగే కృషిలో భాగస్వాములై, రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలి. పౌర సమాజం నుండి కృషి కొనసాగుతూ ఉండాలి.

– వ్యాసకర్త శాసనమండలి సభ్యులు కె.యస్‌.లక్ష్మణరావు
సెల్‌ : 8309965083 /

➡️