మన నేలకు మనం కృతజ్ఞతగా నిలబడాలి

Apr 29,2024 05:05 #sahityam

-ప్రముఖ రచయిత మల్లిపురం జగదీశ్‌తో ముఖాముఖి
అడవి నుంచి అతడిని ‘అక్షరం’ బయటకు తీసుకొచ్చింది. ‘ఫలం’ దొరికాక ముందుకు వెళ్ళిపోలేదు. తానొచ్చిన జాడల్ని దారులుగా మారాలని కోరుకుంటున్నాడు. కొండ దిగిన కాలుకి అంటుకొన్న బురదను జ్ఞాపకంగా, గుచ్చుకొన్న ముళ్ళను అనుభవంగా తలుస్తూ సాహిత్య సృజన చేస్తున్న రచయిత మల్లిపురం జగదీశ్‌ ఇటీవల తన గిరిజన జీవితాన్ని స్వగతంగా చేస్తూ అడవి పూలదారిలో ‘మన్నెం ముచ్చట్లు’గా తీసుకొచ్చిన సందర్భంగా ఆయనతో జరిపిన ముఖాముఖి.
‘మన్నెం ముచ్చట్లు’ ఎంతమేరకు ఆదివాసీ జీవితాలను
ప్రతిబింబింప చేసిందనుకొంటున్నారు?
ఇది మా వూరు పి.ఆమిటి (పార్వతీపురం మన్యం) చుట్టూ అల్లుకున్న నా అనుభవాల దొంతర. ఆదివాసీ జీవితాల్లోని కొన్ని పార్శ్వాలు మాత్రమే ఈ పుస్తకం తడిమింది. ఇంకా స్పశించాల్సిన అంశాలు చాలా మిగిలే వున్నాయి.
మీ ఇతర రచనలకి, ‘మన్నెం ముచ్చట్లు’కి ఉన్న ప్రత్యేకత?
ఇతర రచనలు కథారూపంలోనో, కవితా రూపంలోనో ఇమిడి వుంటాయి. మన్నెం ముచ్చట్లలా కాదు. ఏ ఫార్మెట్‌కీ ఇమడనివి. ఒక జ్ఞాపకాల దొంతర. అంతే! అక్కడక్కడా చైతన్యస్రవంతి పద్ధతిలా అనిపిస్తూ సాగుతుంది. మరికొన్ని చోట్ల ఒక అస్థిరమైన నెరేషన్‌లా అనిపిస్తుంది. మరోచోట కలలో మాట్లాడుతున్నట్టుంటుంది. ఇలా చెప్పడంలో నా ఉద్దేశ్యం ఏమిటంటే… ఆదివాసీ జీవితం ఏ ఒక్క నిర్వచనానికో అందనిది అని చెప్పడం.
‘తుపాన్‌ గాడు’, ‘నేను’ ఇద్దరు వేరువేరా? లేక మీలోని
పార్శ్వాలా?
ఈ పుస్తకం ముందుమాటలో సంపాదకుడు ఎ.కె. ప్రభాకర్‌ తుపాన్‌ని ”రచయిత ఆల్టర్‌ ఇగో” అన్నారు. అది నిజమే. వాడి గొంతులో నేను మాట్లాడుతుంటానిందులో. తుపాన్‌ గాడు నా బాల్య స్నేహితుడు. వాడొక వలసపిట్ట. ఎప్పుడో మా వూరొదిలి పెట్టి బతుకు పోరులో నలుగుతున్నవాడు. నా కథల్లో ఒక పాత్రగా చాలా చోట్ల కనీ కనిపించనట్లు మాట్లాడుతూ వుంటాడు. ‘మన్నెం ముచ్చట్ల’లో మాత్రం పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా మాట్లాడుతుంటాడు. ‘నేను’, ‘తుపాన్‌ గాడు’ రెండూ రెండు పాత్రలు.
మీ బాల్యం, మీ పిల్లల బాల్యానికి మధ్యన గిరిజన ప్రాంతాల్లో చోటు చేసుకొన్న మార్పులు?
ఆ రెంటి మధ్య తేడా దాదాపు మూడు దశాబ్దాల కాలం. ఈ కాలంలో మార్పులు లేవంటే ఎలా? చాలా మార్పులొచ్చాయి. ముఖ్యమైనవి విద్య, వ్యాపారం, మతం, రాజకీయం. విద్య ఇప్పుడు చాలా వరకు అందుబాటులోకి వచ్చింది. నాణ్యతలో తేడాలుండొచ్చు కానీ విప్లవాత్మకమైన తేడా అయితే స్పష్టంగా ఉంది. అప్పటి బాల్యపు అవసరాలు వేరు. ఇప్పటి బాల్యపు అవసరాలు వేరు. సౌకర్యాల విషయమూ అంతే. ఆనాటి మా వూళ్ళు ఈనాటి మా వూళ్ళు ఒక్కటి కాదు.
వ్యాపారం అయితే ఆ రోజు వారపొడ్డీవాళ్ళు, సొండీలు, షావుకార్లు మాత్రమే ఇక్కడికొచ్చి వ్యాపారమని చెప్పి ఆదివాసీ పంటల్నీ, భూముల్నీ కొల్లగొట్టి తిరుగుబాటుకి కారణమయ్యేరు. ఈ రోజు వాళ్ళ సంఖ్య రెట్టింపయ్యింది. మైదాన ప్రాంత గిరిజనేతరులు కొత్త కొత్త దారుల్లో అడవుల్లోకి అడుగుపెడుతున్నారు. వ్యాపార రూపం మారిపోయింది. దోపిడీ స్వరూపమూ మారిపోయింది. అడవి మార్కెట్‌కి మరింత దగ్గరయ్యింది. ఇంకోలా చెప్పాలంటే అడవీ మార్కెట్‌గా మారిపోయింది. గిరిజన సంక్షేమ పథకాల్ని గిరిజనేతర కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తూ తిరుగుబాటుని అందంగా అణిచివేస్తోంది రాజ్యం.
మతమైతే… ఈ రోజూ రేపు రాజకీయ నిర్ణయాధికారం చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అంతలా ఆదివాసీ సంస్కతిని మాపేసి ఆదివాసుల్ని వశం చేసుకున్నది.
ఈరోజు మా వూళ్ళకు రోడ్లొచ్చాయి. టీవీలొచ్చాయి. సెల్‌ ఫోన్లొచ్చాయి. పబ్జీ గేములొచ్చాయి. ఇంటర్నెట్‌ వచ్చింది. కొత్త నాయకులొచ్చారు. కొత్త కొత్త పథకాలొచ్చాయి. సంక్షేమ కార్యక్రమాలొచ్చాయి. వాటికోసం ఎదురుచూసే ఒక కొత్తతరం తయారయ్యింది గ్రామాల్లో. చదువు పూర్తి చేసిన ఆదివాసీ తరం ఆఫీసుల ముందు అప్లికేషన్ల దొంతరలా నిలబడి వుంది. కొత్త ఉపాధిని అర్థం చేసుకోడానికి వలసబాట పట్టింది. చదువుకు తగ్గ ఉద్యోగం లేక సర్టిఫికేట్లు చేత బట్టుకుని పథకాల కోసం ఎదురు చూస్తోంది.
మరోవైపు… ఆ రోజుల్ని తలపించే గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. డోలీల్లో ప్రాణాలొదులుతున్న మా అక్కచెల్లెళ్లు, ప్రాణాలొదిలితే పదుల కిలోమీటర్ల మేర శవాన్ని మోసుకుపోయే దారులు, ఒక్క మాత్ర కోసం సెల్‌ ఫోన్‌ వెలుగుల్లో గెడ్డ దాటాల్సిన వూళ్ళూ ఉన్నాయి. ఇదొక పారడాక్సికల్‌ వాస్తవం.
జీవన ప్రమాణాలు పెరగకపోవడంలో మొత్తం యంత్రాంగం
లోపమే ఉంటుందా? ఆదివాసుల వైపు నుంచి ఏమీ
ఉండదంటారా?
నా ‘తాండ్రచుట్ట’ కథలో ప్రధాన పాత్ర ‘బూగన్న’ ఒక మాటంటాడు. ”నాకేది సుకమో నువ్వు సెప్పకూడదు. నా సుకం గురిండి నీనే మాట్లాడాల”ని. ఇదెందుకు ఉదహరించేనంటే… యంత్రాంగం పథకాలు రచన చేసినపుడు ఈ మాటని గుర్తుంచుకోవాలని.
ఆదివాసుల కోసం ఇది చేసాం, అది చేసాం అని పాలకులు అభివృద్ధి సూచీల్ని వారే రాసుకుని వారే మురిసిపోతుంటారు. కానీ ఆదివాసులకేమి కావాలో ఒక్క ప్రశ్నైనా అడగరు. ఒక బేంక్‌ మేనేజర్‌ ఇచ్చే ‘లోను’ కన్నా షావుకారిచ్చే చేబదులుకే ఆకర్షితుడవుతున్నాడు ఆదివాసీ ఇప్పటికీ. తేడా ఎక్కడుందో తెలుసా? నేస్తరికం! అవసర సమయానికి అందుబాటు! ఈ పేరుతోనే ఆస్తుల్నీ, శ్రమనీ, సంపదనీ వదులుకున్నాడేమోగాని, ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోలేదు ఆదివాసీ. అలాగని పథకాల దుర్వినియోగం జరగడం లేదని చెప్పను. అటు యంత్రాంగమూ, ఇటు ఆదివాసీ సమన్వయంతో పని చేస్తే ఫలితం వుంటుంది.
గిరిజన ఫలాలు అనుభవిస్తూ తిరిగి ఆ సమాజానికి అండగా నిలబడకుండా పోతున్న ‘అస్మదీయుల’ విధానంపై మీ స్పందన?
ఇది బాధ్యతకి సంబంధించిన ప్రశ్న. ఏ నేల నిన్నిలా నిలబెట్టిందో, ఏ శ్రమ ఫలితం మనల్నిలా బతకనిస్తున్నదో దానిపట్ల కృతజ్ఞతతో లేకపోతే ఎట్లా? ఇది ఆదివాసీ సమాజానికి మాత్రమే సంబంధించినది కాదు. ఇది అందరికీ వర్తిస్తుంది.
గిరిజనేతరులు చేసిన రచనలకి గిరిజనుడిగా మీరు చేస్తున్న రచనలకి మధ్య సారూప్య – వ్యత్యాసాలు ఉంటాయా?
సహానుభూతికి, స్వీయానుభూతికి మధ్య ఉన్న తేడా అది. ఇతరులు రాసిన ఆదివాసీ రచనకీ నా రచనకి సారూప్యత ఉండొచ్చు కానీ వ్యత్యాసం కూడా స్పష్టంగా కనిపెట్టగలడు పాఠకుడు. అనుభవించి రాసిన రాతకి, సమాచార సేకరణ రచనకీ తేడా వుంటుంది. నేనూ కొన్నిచోట్ల అవుట్‌ సైడర్‌ గానే కనపడతాను. జీలుగు కల్లు తాగి, కంకపట్టి కొండ తువ్విన చేతుల్తో రాసిన రాత ఖచ్చితంగా ప్రత్యేకంగానే వుంటుంది.
×ుణA, +జజ వంటి సంస్థలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయి. ఓ గిరిజనుడిగా వారి శ్రమ ఎంతవరకు ప్రతిఫలిస్తుంది?
ఈ రెండు సంస్థలూ ఉద్యమాల ఫలితంగా ఏర్పడ్డాయి. ఇవి చాలావరకు ఆదివాసుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యేయి. ఆశ్రమ పాఠశాలలు, జీసీసీ చౌక దుకాణాలు… చెక్‌ డాములు, జీడి తోటలూ… రహదారులూ, రవాణా సౌకర్యాలూ… ఇవన్నీ ఆదివాసీ జీవితాల్లో మార్పులకు కారణమయినవే. కానీ, ఈ రోజు వాటి లక్ష్యాలు మార్చుకోవాల్సి ఉంది. వాటిని బలోపేతం చెయ్యాలనే నేటి ఉద్యమ నినాదమే రుజువు అవి నిధుల సమస్యతో కొట్టిమిట్టాడుతున్నాయనడానికి. అవి స్వతంత్రంగా నిలబడగలిగి మునుపటిలా ఉద్యోగ ఉపాధి కల్పన చేపట్టగలిగితే వాటి శ్రమ ఫలించినట్టవుతుంది.
కొన్ని తెగలు కొండ దిగి రాలేదు. కొన్ని సేవలు ‘కొండ’ను ఎక్కలేదు. మీరు గమనించిన కారణాలు?
అన్ని సేవలూ అందరికీ సమానంగా అందాలి. అది ప్రజాస్వామ్యం. స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న ఈ రోజుల్లో… డోలీ మోతలు కానరావడం దురదృష్టకరం. కొండ చూపుడు వేలి మీద ఇండెలిబుల్‌ ముద్రతో కుర్చీ ఎక్కిన నువ్వు సేవలందించడానికి కొండెక్కనంటే ఎలా?
అక్షరాస్యత వేరు. విద్యా సాధికారత వేరు. గిరిజన యువత సాధికారత వైపు అనుకొన్న స్థాయిలో రాణించకపోవడానికి ఓ ఉపాధ్యాయుడిగా మీరు గుర్తించిన కారణాలు?
విద్య సగటు మానవ జీవితావసరాల్ని తీర్చగలిగేదై ఉండాలి. మానవ జీవితావసరాల్లో ఆదివాసీ జీవితావసరాలు వేరు. ఆదివాసీ ప్రజల కోసం ప్రత్యేక ప్రణాళికలున్నట్టే ఆదివాసీ పిల్లల కోసం ప్రత్యేక పాఠ్య పుస్తకాలు, సిలబస్‌ వుండాలి. ఉదాహరణకు సగటు మామూలు విద్యార్థికి తెలుగు మాతృభాష కాబట్టి అది ఫస్ట్‌ లాంగ్వేజ్‌ అవుతుంది. అదే ఆదివాసీ విద్యార్థికి తెలుగు సెకెండ్‌ లాంగ్వేజ్‌. తన స్థానిక మాతృభాష వేరు కాబట్టి. పాఠశాలలోకి చేరేసరికి వాడు తెలుగు నేర్చుకోవడానికి సాధారణ సమయం కంటే ఎక్కువ పడుతుంది. అంటే మామూలు విద్యార్థి కంటే వెనకబడిపోతాడు. స్కూలింగ్‌ పూర్తయ్యే సమయానికి ఆదివాసీ విద్యార్థి అక్షరాస్యత వద్దకు చేరుకుంటే సాధారణ విద్యార్థి సాధికారత వైపు దూసుకుపోతాడు.
కొన్ని తెగల్లో ‘తొలి ప్రభుత్వ ఉద్యోగి’ అన్న ఖాతా తెరవలేదు. గిరిజనుల్లో కూడా వర్గీకరణ వాదన రాబోతుందా?
రావాలి. ఆదివాసీ తెగల్లో కూడా ఆర్థిక అసమానతలకు అసలు కారణం హయరార్కీయే. ఈ వర్గీకరణవాదం లేకపోవడం వల్లనే ఇతర కులాల్ని గిరిజన కులాల్లో కలిపి అందాల్సిన వారికి అందకుండా, ఉన్నవాటిని పలచన చేసే కుట్రలూ జరుగుతున్నాయి.


సంభాషణ : సారిపల్లి నాగరాజు, మదన మోహన్‌ రెడ్డి,
పరిశోధక విద్యార్థులు,
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం, 80083 70326.

➡️