ఆమె + నేను = ఓ కవిత

Mar 18,2024 05:50 #Kavitha, #sahityam

రెండు సర్పాల పెనుగులాట తర్వాత
తెల్లారుతుంది
పక్షులెగిరి పోతారు
చెట్టు మేల్కొంటుంది
కవిత
ప్రారంభ సమయం!

ఆమె
అంట్లు తోముతుంది
నేను ప్రశ్నల్లాంటి
ఆశ్చర్యార్థకాలాంటి గరెటలను
గిన్నెల స్టాండులో పెడతాను
వాక్యాలు వాక్యాలు సాగుతూ ఉంటారు

ఆమె
ఎసరు పొయ్యి మీద పెడుతుంది
అక్షరాల లాంటి బియ్యాన్ని కడిగి
నేను ఎసెట్లో పోస్తాను
మెతుకు ఉడుకుతున్న శబ్దం
వాక్యాల్లో ప్రవేశిస్తుంది

ఆమె పోపు పెట్టే లోపు
నేను కూరగాయలు తరుగుతాను
మసలుతున్న పులుసు పరిమళం
పదాల వెంట సాగుతూ ఉంటుంది

ఆమె
బట్టలుతుకుతుంది
నేను శీర్షికలాంటి
క్లిప్పులు పెడతాను
కవిత పూర్తి అవుతుంది!

– డాక్టర్‌ గోపాల్‌ సుంకర
94926 38547

➡️