జన జాగృతికి జేజేలు

Jun 10,2024 05:10 #kavithalu, #sahityam

ఆకాశంలో విహరించే వాని
అహంకారానికి ముక్కుతాడేసి
నేల మీదికి కుదేసి గుంజకు కట్టినట్టు
రంకెలేసే ఆంబోతుకు
లెంకె పీట లేసి ఆపినట్టు
అదుపు తప్పి ఆడకుండా
పగ్గాలేసి గుంజినట్టు …
పూట పూటకో మాటకు
పేట పేటకో వేషానికి
పాబందీలేని ఆటకి ప్రతిపక్షాల వేటకి
చదరంగంలో చెక్కుపెట్టినట్టు …

జనం నాడి ఇదంటూ జర్నలిజం పేరుతో
వ్యాపారం చేసేటోని
మా మనసు మర్మం నీకేమీ ఎరుకని
జాడిచ్చి తన్నినట్టు
పాలకులంటే పరమాత్ములు కాదని
ప్రజాసేవకులని గుర్తెరిగేటట్టు
ప్రజాస్వామ్య దేశంలో
వ్యక్తి పూజ సరికాదన్నట్టు
పగలకు పంతాల సాధనకు
పాలకుల అవసరం లేదని
ప్రజా సమస్యలే ప్రధానం కావాలంటూ
ప్రజలంతా గుర్తించినట్టు
ప్రజా వజ్రాయుధం ఓటును
అదును చూసి పదునుగా గుద్దిన
భళి భళిరా జన జాగృతి
మన గణ జన జాగృతికి జేజేలు!

– డా.ఎడ్ల కల్లేశ్‌
98667 65126

➡️