పదేళ్లు అక్రమ నిర్భంధం

Mar 11,2024 08:37 #sahityam

చేయని తప్పు చేసాడని
కటకటాల వెనక్కి పంపిన రాజ్యం
అక్షరం హేతువును బోధిస్తుందని
హేతువు మార్కి ్సజానికి మూలమనే దడ రాజ్యంలో
అక్షరానికి సంకెళ్ళు వేసింది

వందశాతం ఫాసిజం కోరలు పీకి
తొంభై శాతం వైకల్యం సాధించిన గెలుపు
ఇంకా తరాజులో న్యాయం వుందని తేల్చింది

ఎన్ని ఉదయాలు
ఎన్ని అస్తమయాలు ఈ పదేళ్లలో
తూర్పు పడమరల మధ్య ఊగాయో
ఓ కొత్త పొడుపు కోసం నిరీక్షించిన కళ్ళు

నిజాన్ని బంధిస్తే
అబద్ధాల రాజ్యానికి వెసులుబాటు
మసి పూసి మారేడు కాయ చేయజూస్తే
మసి పూసుకోక తప్పదు ఎన్నాళ్ళైనా!!

కోల్పోయిన సామాజిక జీవనం
చీకటి రాత్రుల్లో కోల్పోయిన వెలుగు
అడుగడుగునా ఆంక్షల నాలుగు గోడల మధ్య
తల్లడిల్లిన మేను
సమాధానాలు లేవు
వెల కట్టగలిగే ధైర్యం లేదు

ఏది ఉగ్రవాదం!
ఏ ఇజం హ్యూమనిజం!
వాడికీ వీడికీ మధ్య రాజేసే నిప్పు వెనుక
దాగిందే ఉన్మాదం!
ప్రశ్నని నేర్పే గురువే
నేటి సమాజానికి కావాలిప్పుడు!

– గిరిప్రసాద్‌ చెలమల్లు
94933 88201

➡️