రెండు నిముషాల మౌనం

Dec 11,2023 09:11 #sahityam

ఒకందుకు అనుకుంటే

అందులో అనేక అర్థాలుంటాయి

ఉప్పునీటికి మంచుదిబ్బ కోసుకుపోతున్నంత నిశబ్దం

మూతబడిన రెప్పల బరువు లెక్కగట్టలేం !

 

టర్కీ నేల మీద సిస్మోగ్రాఫ్‌ హెచ్చుతగ్గుల బాధితుల కోసమో

ఆఫ్ఘన్‌ మత ఫిరంగులు చేసిన దాష్టీకానికో

సువిశాల తీరం పక్కన వాలిపోయిన

సిరియా శరణార్థుల మీద ప్రేమతోనో

ఏడుగురు అక్కా చెల్లెళ్ళ వీధుల మధ్యలో

నగ్నంగా రేగిన అల్లరి మూకల చిల్లర పనుల మీద కోపంతోనో

వేదన నిండిన ఆలోచనలు

లోపల్లోపల కలబడుతూ ఉంటాయి

 

అంతా కలిపి రెండే రెండు నిముషాలు !

 

అసలైన యుద్ధం ఎవరిదో అర్థం కాదు

నెత్తురు మాత్రం పాలస్తీనా పసిపాపలది

గాజా ఆసుపత్రిలో ఆర్తనాదాలలో భాష

అనువాదానికి అందదు

నిశబ్దానికి మౌనానికి మధ్యన తెలియని ఉద్వేగం

ఉక్రెయిన్‌ యుద్ధంలో తుపాకీ మన పక్కనే మోగుతుంది

పంట కాలువలో దొరికిన దళిత మృతదేహమే దోషి అని

నిందితుడే తీర్పు రాస్తుంటాడు

 

అంతా చేస్తే జీవితం క్షణ భంగురం !

 

ఇంకా సమయం సగం మిగిలే వుంది

బాహ్య ప్రపంచం చెవుల్లోకి దూరడానికి దూకుతూ ఉంది

రహదారి నిండా అంబులెన్స్‌ రొద

రహస్యంగా దొరికిన మత్తులోనుంచి

మాట్లాడుతున్న విద్యార్థి వాగుడు

హర్షాతిరేకాల మధ్యలో వికెట్‌

పడిందో లేదో తెలియని స్కోర్‌ వివరాలు

ఎవరెన్ని రంకెలేసినా

ఈ కాస్త ఏకాగ్రతా ఈదులాటలో మాత్రం

గడియారం చప్పుళ్ళు మినహా

మరే ఇబ్బంది కలగడం లేదు !

 

సరిగ్గా కళ్ళు తెరిచే సమయం

దగ్గరకి వచ్చేస్తుంది

దిశను మార్చుకుని చూస్తే

ఎటు చూసినా శిథిలాలే

నీడల మీద చెట్లు కూలుతున్న

కకావికల అబ్సట్రాక్ట్‌ పెయింటింగ్‌

వరద నీట్లో కూలబడిన చేతుల్లో

వరి కంకుల నిండా వడ్లగింజల్లాంటి ప్రశ్నలు

అంతా గందరగోళం చిందరవందర

 

ఆకుపచ్చని పండు నిండా

రసం పీల్చే పురుగుల లుకలుక

ప్రతి దేశం నుంచి ఒక చేయి గొంతెత్తి నిలబడుతుంది

జారిపోతున్న కలల్ని ఒడిసి పట్టుకోవడానికి

రెండు నిముషాల ఖర్చు చాలదు !

సమయం తీరిపోతుంటే బెంగ

అప్పటికే కళ్ళ నుంచి జల జల

జారిపోతున్న రెండు భూగోళాలు

తల పైకెత్తి చూశాక

మసక మసక చూపులోనుంచి

ఎదురుగా నవ్వుతున్న పిల్లలు !

– అనిల్‌ డ్యాని 97033 36688

➡️