మసిగుడ్డ

Mar 3,2024 11:42 #Sneha

పది నిమిషాల్నుండి బీరువా అంతా గాలించినా వో పాత గుడ్డముక్క దొరకలేదు. మసిగుడ్డ లేక వంటింట్లో పని చెయ్యాలంటే నానా అవస్థగా వుంది. పాత మసిగుడ్డ చినిగిపోయి పీలికలైపోయి పనికిరాకుండా పోయి నాలుగైదు రోజులవుతోంది. మరోటి వెతికి పెడదాం అనుకోవటమే కాని అశ్రద్ధతో కుదరక పాతదానితోనే వుదయం అన్నం వారుస్తుంటే అది సరిపోక చెయ్యి చురుక్కుమంటే కానీ కొత్త మసిగుడ్డ గురించి అన్వేషణ మొదలుకాలేదు.

చివరికి పాత బట్టలమూట విప్పాను. గట్టివి కొన్ని, రంగులు వెలిసిపోయినవి, పొట్టి అయినవి, బిగుతైపోయినవి, స్టీలు సామానువాడికి వేద్దామని వుంచినవి. వెతగ్గావెతగ్గా మసిగుడ్డకి పనికొచ్చే బట్ట కనిపించింది. రంగు తగ్గలేదు. కాని మెడ దగ్గర కాస్త పిగిలిపోయిన జాకెట్టు కనిపించింది.

అమ్మ జాకెట్టు. పోయినసారి అమ్మ వచ్చినప్పుడు మర్చిపోయిన జాకెట్టు. జాకెట్టు తీసుకొని వంటింట్లోకి వెళ్లి సౌకర్యవంతంగా పనులు చేసుకోవటం మొదలు పెట్టాను. ఆ జాకెట్‌ చూస్తుంటే అమ్మ గుర్తొస్తుంది. యే చీరమీద జాకెట్టో!

కాలింగ్‌బెల్‌ సవ్వడి.తలుపు తీశాను.జానకి!

యిదే కాలనీలో వుంటారు. మచిలీపట్నం వాళ్లు. ఆమె శ్రీవారు ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ వుద్యోగి. యిద్దరు పాపలు. వొక బాబు. యింటిపని, వంటపనితోనే జానకి యెప్పుడూ సతమతమౌతుంటుంది తప్ప యెప్పుడో కాని యిలా యెవరింటికీ రాదు. యేదైనా పనుంటే తప్ప. కుశల ప్రశ్నలు అయ్యాక, ‘నాక్కాస్త రోజూ యింగ్లీష్‌ నేర్పిస్తారా?’ అనడిగింది జానకి.

వైర్‌ బ్యాగ్‌ అల్లటం నేర్పిస్తారా? స్వెట్టర్‌ యెలా అల్లాలి, మ్యాంగో జ్యూస్‌ యెలా చెయ్యాలి? అనేవాళ్లనే యింతవరకు మా కాలనీలో చూడటం వలన జానకి కోరిక కొత్తగా తోచింది.

‘నేర్పిస్తాను. కాని మీకు తీరికేది?’ అన్నాను.’

వోపూట వండటమేనా మానెయ్యాలి. కాని యింగ్లీషు నేర్చుకోవటం మానకూడదు,’ అంది జానకి.

‘యేం’ కుతూహలంగా అడిగాను.’మా పిల్లలు నన్నసలు లక్ష్యపెట్టటం లేదండి. యేం అడిగినా పట్టించుకోరు. తండ్రి ధ్యాసే. వాళ్లు అడిగినవి చెప్పే వోపిక, తీరిక ఆయనకి లేవు. నాకా వాళ్ల సందేహాలు తీర్చేంత చదువులేదు. అందుకే బి.యే. కడదాం అనుకుంటున్నా.

కనీసం చిన్నపాప, బాబు చదువు విషయమైనా శ్రద్ధ తీసుకోవాలండి. యేంటో నిన్నటివరకు మన కొంగు పట్టుకు తిరిగిన పిల్లలు యీరోజు మనకేం తెలియదని నిర్లక్ష్యం చేస్తుంటే బాధగా వుందండి,’ అంది జానకి.

వారంరోజుల క్రితం మా పాప సమ్మర్‌ కంప్యూటర్‌ క్లాసుకి వెళ్లొచ్చింది. ‘యేం చెప్పారే?’ అంటే, ‘నీకు కంప్యూటర్‌ రాదుగా,’ అంటూ తండ్రి కోసం ఆత్రంగా యెదురు చూసింది. తండ్రింటికి రాగానే చిలకలా యేంటేంటో చెప్పింది.

జానకి యింగ్లీషు నేర్చుకుంటానన్నట్టు నేనిప్పుడు కంప్యూటర్‌ గురించి తెలుసుకోవాలా? నేర్చుకోవాలా?

‘అలానే రండి. నేర్పుతాను,’ అన్నాను.జానకి వెళ్లిపోయాక వంటింట్లోకి వెళ్లి పనులుచేస్తున్నా జానకి మాటలే గుర్తొస్తున్నాయి.

అమ్మ! ప్రాణానికి ప్రాణమిచ్చి జన్మనిచ్చే అమ్మని లక్ష్యపెట్టటానికి అమ్మకి అర్హతలు కావాలా?

కావాలని కాదు కానీ అమ్మని, యెదిగే పిల్లలు నిర్లక్ష్యం చేయటం సర్వసాధారణం కదా!

నాకు బాగా గుర్తు యిప్పుడు అమ్మలు అవుతున్న వాళ్లకి డిగ్రీలుండి, కొద్దోగొప్పో ఆర్థిక స్వాతంత్య్రం వుంది కానీ, మా అమ్మల కాలంలో డిగ్రీలు వున్నవాళ్లు చాలా తక్కువ. యిప్పటి తల్లుల్లా అప్పట్లో అమ్మలకి పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకొని హౌమ్‌వర్క్‌ చేయించటం తెలిసేది కాదు. వోపిక వున్న తండ్రులో, ప్రైవేటు మాస్టర్లో, యింట్లో చదువొచ్చిన చిన్నాన్నలో, మామయ్యలో హౌమ్‌వర్క్‌ చేయించేవారు, సందేహాలు తీర్చేవారు.

వో సారి స్కూల్‌ ఫస్ట్‌ వస్తే వో కప్‌ బహుమతిగా యిచ్చారు. ఫంక్షన్‌ నుండి యింటికి వచ్చేసరికి వాకిట్లో అమ్మ యెదురై ‘యేమిచ్చారు?’ కుతూహలంగా అడుగుతుంటే ఆమె మాట వినిపించుకోకుండా యెక్కడో లోపల పడుకొని పేపర్‌ చదువుకుంటున్న నాన్నగారి దగ్గరికి పరిగెత్తుకెళ్లి కప్‌ చూపించాను. అలా చెయ్యటం అమ్మని నిర్లక్ష్యం చేయటమని కానీ, అమ్మ బాధపడుతుందని కానీ అప్పట్లో నాకు తెలియదు. పక్కలు తడిపినా, అర్థరాత్రి యేడిస్తే మంచి నిద్రలో వున్నాసరే లేచి యెత్తుకు తిప్పి నిద్రపుచ్చటం, వూరంతా తిప్పితిప్పి గోరుముద్దలు తినిపించటం, కారే ముక్కుని తుడవటం, వొళ్లు వెచ్చబడితే రేయింబగళ్లు సేవచేయటం అమ్మ పనులు.

సేవలు చేసిచేసి తమ శరీరాల రూపురేఖలే పోగొట్టుకునే అమ్మలు వొక్కరా, యిద్దరా? అసలు లెక్కించగలనా. పెద్దపాప పసితనంలోనే హాయినిచ్చే తలస్నానాన్ని మర్చిపోయాను. పిల్లని నిద్రపుచ్చి ‘హమ్మయ్యా’ అనుకుంటూ స్నానానికి యిలా వెళ్లేదాన్నో లేదో, యెవరో కొట్టి లేపినట్టు గుక్క పెట్టి యేడుపు. యింకేం స్నానం? రెండు చెంబులు అటూ యిటూ గుమ్మరించుకొని తడి శరీరానికే చీరని చుట్టుకొని యేడిచే పిల్లని చంకనేసుకొని వూరడించేసరికి జడ అల్లుకోవాలనే ధ్యాసే వుండేది కాదు.

పక్కింటి టీచరమ్మ పిల్లలు పుట్టకముందు గంజిపెట్టిన నేతచీరలు, వెంకటగిరి చీరల్ని కుచ్చిళ్లు వొద్దిగ్గా పెట్టి యెంచక్కా బుట్టబొమ్మలా ముస్తాబయ్యేది. యిప్పుడో పిల్ల పనులు, వంటపని, మొగుడికి వడ్డించి తను తినీ, తినకా, అతగాడికి టిఫిన్‌ బాక్స్‌ సర్ది, పిల్లకి తినిపించి, ఆ పిల్లకి కావాల్సినవి బుట్టలో సర్ది చీరకి జాకెట్టు సరిపోయిందో లేదోననే ఆలోచనే లేకుండా జారిపోయే నైలెక్స్‌ చీరని పిన్నులతో బంధించేస్తూ ఆ పిల్లని క్రచ్లో దింపి హడావుడిగా అటెండెన్స్‌ రిజిష్టర్లో సంతకం చేయటంతోనే రోజూ తెల్లారి పోతుంది.

‘యెక్కడికైనా వెళ్లినప్పుడో, పేరంటానికి పోయినప్పుడో కట్టుకుందామన్నా యెక్కడ కుదుర్తుంది? యీ పిల్లల్ని యెత్తుకోవాలిగా? నిమిషంలో నలిగిపోతాయి. నాకా నైలెక్స్‌ చీరలంటే చిరాకు. అయినా అవే కట్టుకోవాలి,’ అంటూ యెన్నోసార్లు వాపోయింది.

నాన్నలెందుకు యెత్తుకోరో?

ఆమధ్య ‘స్త్రీలహక్కుల’పై సభ జరుగుతుంటే వెళ్లాను. స్త్రీల హక్కుల గురించి యెంతో ఆర్తిగా వ్యాసాలు రాసే ఆయన భార్య, వుపన్యాసాలిచ్చే ఆయన భార్య, గుమస్తాగారి భార్య- వొకరనేంటి పిల్లల్ని తల్లులే మోస్తున్నారు.

కన్నతల్లి మాత్రమే అన్ని పనులూ చెయ్యాలని మగవాడు అనుకుంటాడు. పిల్లలూ అనుకుంటారు. యెందుకు చెయ్యాలని పాపమా అమాయకపు తల్లి మాత్రం అనుకోదు.

నే కావాలని నిన్ను నిర్లక్ష్యం చేయలేదని అమ్మకి యిప్పుడు చెపితే?

యేమంటుంది?

నవ్వుతుంది లాలనగా.

కాలింగ్‌ బెల్‌ మోగింది.

తలుపు తీశాను. యెదురింటి అరుణ.

‘మూడవుతోంది. మీరింకా రాలేదేంటాని నేనే వచ్చాను,’ అంది.

అప్పుడే మూడయిందా! రోజూ మేమిద్దరం స్కూల్కి పోయి నా చిన్న కూతుర్ని, తన కొడుకుని తీసుకొస్తాం. యీరోజు ఆలోచనలతో అసలా సంగతే మర్చిపోయాను.

‘వస్తున్నానొస్తున్నా,’

అంటూ చెప్పులేసుకొని తాళం పెట్టి వున్న పళంగా బయలు దేరాను. యిప్పుడైతే చీర బాగుందా, జుట్టు రేగిందా, ముఖానికి పౌడరుందా అని పట్టింపు లేదు కాని చదువుకునే రోజుల్లో యిలా యెప్పుడైనా బయటికి వెళ్లేదాన్నా. వొకటికి పదిసార్లైనా అద్దంలో ముఖం చూసుకొని కానీ వెళ్లేదాన్ని కాదు.

తన శరీరం గురించి పట్టించుకోకుండా నలిగిన చీరతో, రేగిన జుట్టుతో తిరిగే అమ్మని చూస్తుంటే బోల్డంత చికాకేసేది. యిప్పుడు నా అవతారాన్ని చూసి మా పెద్దమ్మాయి యెన్నిసార్లు విసుక్కోలేదు.

త్వరత్వరగా నడుస్తున్న నేను అరుణ వెనకబడటంతో ఆగి వెనక్కి తిరిగి, ‘యేంటంత మెల్లగా నడుస్తున్నారు?’ అడిగాను.

‘కాలు బెణికింది,’ అందామె.

‘యెప్పుడు? యెలా? యేమైనా రాశారా?’ అడిగాను.

‘సైకిల్‌?’ అయోమయంగా అడిగాను.

‘ఆ వచ్చే యేడాది పిల్లల్ని సెంటాన్స్‌లో చేర్పిద్దాం అనుకుంటున్నాం. చాలా దూరంగా. రెండు పూటలా రిక్షా అంటే చాలా ఖర్చు. అదీకాక పెద్దది సంగీతంలో చేరింది. రోజూ క్లాసుకి వెళ్లి రావాలంటే కష్టంగా వుంది. యేదైనా చిన్న బండి కొనుక్కుంటే పిల్లల్ని స్కూల్లో దింపొచ్చు. పాపని సంగీతం క్లాసుకి తీసుకువెళ్లొచ్చు. నాకా సైకిలే రాదు. సైకిలొస్తే బండిని తేలిగ్గా బ్యాలెన్స్‌ చేయవచ్చంట. అందుకే తెల్లారే గ్రౌండ్కి పోయి సైకిల్‌ నేర్చుకుంటున్నాను. యీవేళ వుదయం కిందపడ్డాను,’ అని అరుణ చెపుతుండగా స్కూలొచ్చింది. పిల్లల్ని తీసుకొని యింటికొచ్చాం.

సాయంత్రం బడి గురించి యింటికొచ్చినప్పట్నుంచి పెద్దాడి ముఖంలో కళే లేదు. ‘యేమ్మా అలా వున్నావ్‌,’ అంటే ‘బానే వున్నానే,’ పేలవంగా అంటాడు తప్ప విషయం చెప్పడు. పెద్దమ్మాయి మాత్రం కాలింగ్‌ బెల్‌ మోగిన ప్రతీసారి వొక్క గెంతు గెంతి మరీ తలుపు తీసి వచ్చినవాళ్లని చూసి ఆరిపోయిన నవ్వు ముఖంతో వెనక్కొస్తుంది. వీధిలోకి, యింట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంటే, ‘యేంటమ్మా? హుషారుగున్నావ్‌,’ అంటే ‘యేం లేనే,’ అంటుంది తప్ప తనూ యే సంగతీ చెప్పలేదు.

యేడవుతుంటే కాలింగ్‌ బెల్‌ మోగగానే తలుపు తీసిన పెద్దమ్మాయి గుమ్మంలో తండ్రిని చూసీ చూడగానే ముఖమింత చేసుకొని తండ్రి యింట్లో కాలు పెట్టకముందే, ‘ప్రోగ్రెస్‌ కార్డిచ్చారు,’ అంది ఆనందంగా.

తండ్రి జవాబు చెప్పకముందే, ‘క్లాస్‌ ఫస్టొస్తే యెక్స్కర్షన్కి పంపిస్తానన్నారుగా?’ అడుగుతోంది.

‘వో తప్పకుండా. నీకో మంచి ఫ్రాక్‌ కూడా కొనిస్తాను,’ అంటుండగానే ఆయన చేతుల్లో కార్డు పెట్టేసింది. యెన్ని మార్కులొచ్చాయో కూడా సరిగ్గా చూడకుండా సంతకం చేసేసాడా తండ్రి.

పరీక్షలు పిల్లలకా? పరీక్షలంటే తల్లులకేగా. నిద్ర జోగే పిల్లలు జారి పోయి నేలమీదే నిద్రపోకుండా వాళ్ల వీపుకి వీపు ఆన్చి కూర్చుని వాలిపోతున్న కనురెప్పలని టీ నీళ్లతో యెత్తి నిలబెట్టి మరీ పరీక్షలు రాయించేది తల్లులేగా. ప్రోగ్రెస్‌ కార్డుపై సంతకాలు మాత్రం తండ్రివి. ఆ ఆనందం, ఆ వైభవం, ఆ సంబరం తండ్రిదేనా?

‘నీదేదిరా?’ అడిగాను పెద్దాడిని. యివ్వలేదన్నాడు. యివ్వలేదా? అని తండ్రి అనుమానంగా రెట్టించి అడగ్గానే మరింత బిగుసుకుపోయాడు. బుజ్జగించి, బ్రతిమాలగా మెల్లగా యిచ్చారంటూ పుస్తకాల సంచి నుంచి కార్డు తీసిచ్చాడు. యింతకుముందు తొంభై, తొంభై ఐదులు వచ్చిన మార్కులు యీసారి డెభ్బై ఐదున్నాయి. అదీ సంగతి! మావాడి కళాహీనమైన కన్నుల వెనకున్న కారణం.

‘యింతున్నాడో లేదో అప్పుడే అబద్ధాలు. కాస్త జాగ్రత్తగా చూడు. అసలు నువ్వేం చేస్తున్నావ్‌? పిల్లల్ని సరిగ్గా చూడొద్దా. యీ అబద్ధాలు అలవాటైతే యెంత కష్టం. నీ పెంపకం అఘోరించినట్టే వుంది,’ యింతెత్తున నాపై విరుచుకుపడ్డారాయన.

పెంపకం!

నా పెద్దక్క అందం, నమ్రత చూసి కాస్త తక్కువ కట్నానికి పెళ్లికొడుకు దొరగ్గానే, ‘నా కూతురే,’ అంటూ గుండెలు చరుచుకున్న నాన్న. చెల్లాయి ప్రేమించిన కుర్రాడిని పెళ్లి చేసుకుంటానని కరాఖండిగా చెప్పినప్పుడు, ‘ఆడపిల్లల్ని యిలాగేనా పెంచటం? యెల్ల వేళలా కనిపెట్టుకొని వుండొద్దు. నీ పెంపకం,’ అంటూ అమ్మపై చేయి చేసుకున్నంత పనిచేశాడు నాన్న.

‘యేంటలా కూర్చున్నచోటే కూర్చుండిపోయావ్‌. యీపూట తిండేం లేదా?’ ఆయన అరుస్తుంటే వంటింట్లోకి వెళ్లాను.

వెచ్చపెట్టిన చారుగిన్నె పొయి మీద నుంచి కిందికి దించుతుంటే నా చూపు మసిగుడ్డపై నిలిచిపోయింది.

అన్నం వార్చాలన్నా, పొయ్యిమీద గిన్నె దింపాలన్నా, కూర కలుపుతూ, గిన్నె కదలకుండా పట్టుకోడానికి, చేతులు తుడుచుకోడానికి యిలా యెన్నో యెన్నెన్నో వాటికి మసిగుడ్డ కావాలి.

కాని యెవరైనా, యెప్పుడైనా దాన్నో విలువైన వస్తువుగా పరిగణిస్తారా?

వారంరోజులుగా వంటింట్లో పనులుచేసి తన రంగుని, రూపాన్ని పూర్తిగా కోల్పోయిన యీ మా అమ్మ జాకెట్‌ అమ్మని గుర్తు చేస్తుంది.

అహర్నిశలు పిల్లల అవసరాలకి శ్రమించి, వొంట్లో సత్తువని పిల్లలకి ధారపోసే అమ్మకి యీ మసిగుడ్డకి తేడా వుందా?

ఆనాడు నేను మా అమ్మని నిర్లక్ష్యం చేసినట్టు, యీరోజు నా పిల్లలు నన్ను లక్ష్యపెట్టటం లేదు. యిదే జానకికి జరిగింది. రేపు జానకి పిల్లలకి, నా పిల్లలకి యిదే పరిస్థితి యెదు రవుతుంది.

కాలం మారి యెన్నో ఆధునిక గృహ పరికరాలు యింటిని అలంకరించినా వంటింట్లోంచి మాయం కాని మసిగుడ్డలానే యెంత నాగరిక ప్రపంచం మనచుట్టూ ఆవరిస్తున్నా అమ్మ కష్టాలు యెప్పుడూ అమ్మవే!

కుప్పిలి పద్మ

9866316174

(ముక్త కథా సంకలనం నుంచి)

 

 

➡️