కాస్తవిరామం

May 5,2024 07:41 #kadha

వాట్సప్‌ రింగ్‌ అవుతుంటే చూశాను. ప్రొఫైల్‌ పిక్‌లో ఇష్టమైన ముఖం. జానకి.
‘హలో’ అన్నాను.
‘మనకు హలోలు బులోలు ఎందుక్కాని ఏం చేస్తున్నావ్‌?’
‘ఏదో చేస్తున్నాలే. ఏంటి సంగతి’
‘ఏం చెప్పమంటావే? నా పుత్రరత్నానికి నిన్నటి వరకూ చదువుకు తగ్గ ఉద్యోగం లేదని ఏదో చిన్నాచితకా ఉద్యోగాలు వెలగబెడుతున్నాడని బాధపడ్డానా.. ఇప్పుడేమో సిగ్గుతో చస్తున్నాను’
‘అంత పనేం చేశాడు. నీకుగాని చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడా ఏంటి’ నవ్వుతూ అడిగాను.
‘ఆ పని చేసినా సంతోషపడేదాన్ని. ఒక పనైపోయిందని. కానీ వీడు నా పరువు తీసి, గంగలో కలిపాడు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా, వీడు పోకపోక మనుషుల్ని తినే దేశం పోవాలా’
‘ఎవరు మనుషుల్ని తిన్నది?’
‘వాడే యూదీ అమీన్‌’
‘ఎప్పుడో చనిపోయాడు కదా! అయితే మీవాడు ఉగాండా వెళ్త్తున్నాడా?’ ఆలోచిస్తూ అడిగాను.
‘అందరూ మా అబ్బాయి అమెరికా యు.కె అంటుంటే మేం మాత్రం ఉగాండా అనాలా.’
‘నీ చాదస్తం ఆపు, వాడి కెరీర్‌ విషయంలో వాడినే నిర్ణయం తీసుకోనివ్వాలి. మీ వారితో మాట్లాడకపోయావా ఒకసారి’ సీరియస్‌గా చెప్పాను.
‘ఆ, అదీ అయింది’
తన బాధ అర్థమవుతున్నప్పటికీ వాడి వైపు నుంచే ఆలోచించాలనిపించింది నాకు.
‘ఎందుకే, మీ ఆలోచనలతో వాడిని కట్టేయాలనుకోవడం’ నెమ్మదిగా అడిగాను.
‘తల్లిదండ్రులుగా మాకూ ఏవో ఆలోచనలు ఉంటాయి కదే. జీవితమంటే పిల్లల చుట్టూ ఆరాటాలూ. ఆ పైన పిల్లలు తెచ్చే ఆరాటాలు. ఇదే సరిపోయింది. సర్లే, నువ్వెలా ఉన్నావ్‌?’
‘బాగానే ఉన్నాను’
‘ధ్రువ్‌ గాడు ఏం చేస్తున్నాడే’
‘ఏం చేస్తాడు ? టెన్‌ ్తక్లాస్‌ పాస్‌ అవటం కూడా కష్టమే’
‘అదేమిటే’
‘వాడితో నాకు కష్టంగానే ఉంది. బిహేవియరల్‌ ఇష్యూస్‌ హ్యాండిల్‌ చేయడానికి నా శక్తి చాలడం లేదు’
నా గొంతు ఎలా వినిపించిందో ఒక నిమిషం ఏం మాట్లాడలేదు.
‘ఓపిక తెచ్చుకో. ఏదో తెలిసీ తెలియని వయసు. సెట్‌ అవుతాడ్లే’ సపోర్టివ్‌గా అన్నది.
‘అలాగే’
ఫోన్‌ ముగిసింది. కూర్చున్న చోటే కళ్ళు మూసుకుని ఉండిపోయాను. ఎన్ని అనుభవిస్తే అలా మాట్లాడాను. గుర్తు చేసుకోవాలనిపించదు. అయినా సరే ఎప్పుడో ఒకసారైనా గతం గుర్తు రాక మానదు.
ొొొ
పెళ్లి తర్వాత పసుపు బట్టలతో గుడికి వెళ్ళినప్పుడు ‘దేవుణ్ణి ఏం కోరుకున్నావు’ అని శరత్‌ నన్నడిగాడు.
‘మీకు మంచి భార్యగా ఉండేందుకు, మిమ్మల్ని అర్థం చేసుకునే వివేకాన్ని ఇమ్మని కోరుకున్నాను’ నవ వధువుగా జవాబిచ్చిన నావంక ఆశ్చర్యంగా చూస్తూ నవ్వి ఊరుకున్నాడు శరత్‌.
పెళ్లయిన రెండు వారాలకే లీవ్‌ అయిపోయిందని యు.ఎస్‌. వెళ్ళిన శరత్‌ తనకీ పెళ్లి ఇష్టం లేదని, అమ్మానాన్నల బలవంతం వలన చేసుకోవాల్సి వచ్చిందని ఫోన్‌ చేసి చెప్పి, మళ్ళీ తిరిగి చూడలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అలా మూన్నాళ్ళ ముచ్చటయ్యింది.
పెళ్లి ఇష్టం లేనిది శరత్‌కి అయితే నేనెందుకు బలి పశువుని అయ్యానో నాకెప్పటికీ అర్థం కాని ప్రశ్నే.
అయినా దిటవు చేసుకుని ధ్రువ్‌ను ప్రపంచంగా చేసుకుని బతకాలనుకున్నాను. ఒక్కగానొక్క కొడుకు. ఏ ఒక్క మంచి అలవాటు గాని, మాట కానీ నేర్చుకోకపోవడంతో, వీడి భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అని ఆలోచించిన ప్రతిసారి ఎన్ని పీడకలలో నాకు! స్థల మార్పిడి వలన ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దామని ట్రాన్సఫర్‌ చేయించుకుని వచ్చాను ఈ మధ్యే. వాడిలో పెద్దగా మార్పు ఏమీలేదు. కానీ నాకు మాత్రం ఆఫీసులో చాలా ఇబ్బందిగానే ఉంది. ఎదురుగా మేడం అంటారు.. కానీ నేను లేననుకొని వాళ్ళు మాట్లాడుకుంటుండగా కూడా కొన్నిసార్లు వినపడుతుంటాయి.
ఆఫీసులో చాలా బిజీగా ఉన్న సమయంలో ధ్రువ్‌ క్లాస్‌ టీచర్‌ నుండి ఫోన్‌.
‘మామ్‌ ప్రోగ్రెస్‌ రిపోర్టు సబ్మిట్‌ చేయాల్సిన ఆఖరి రోజు ఇవాళ, కనీసం రేపైనా పంపించండి’
‘సరే అలాగే’
సంభాషణ పొడిగిస్తే ఏం కంప్లైంట్స్‌ వినాల్సి వస్తుందోనని, నా ఏకాగ్రతను భగం చేసుకోవటం ఇష్టం లేక త్వరగా ముగించాను.
క్లోజింగ్‌ టైంకి పనులన్నీ ముగించుకుని, ఆఫీస్‌ నుండి బయటకు వచ్చాను. ఇంటికి వచ్చాక ధ్రువ్‌కి ఇష్టమైన టమాటా పప్పు చేసి, డిన్నర్‌కి టేబుల్‌ మీద అన్నీ సిద్ధంగా ఉంచి, చివరిగా ఆమ్లెట్‌ వేసి, స్టవ్‌ ఆపేసి, టైం చూశాను. సాయంత్రం ఏడు కావస్తుంది. స్టడీ అవర్స్‌ అయిపోయి, వచ్చే టైం అయిందని అనుకుంటుండగానే తలుపు తీస్తున్న చప్పుడు అయింది.
సంతోషంగా ఎదురెళ్లి, ‘ఏంట్రా కన్నా’ అన్నాను.
‘రోజు కంటే ఒక పది నిమిషాలు ముందు వచ్చినట్టున్నావు ఈ రోజు’ దగ్గరకు తీసుకోబోతున్న నా చేతిని విసిరి కొట్టాడు బలంగా.
‘ఎన్నిసార్లు చెప్పాలి? నాకో పేరు ఏడ్చిందిగా, ఆ పేరుతోనే పిలవమని’
అర్థం కాని కోపం.
‘అలాగే ధ్రువ్‌’ నవ్వుతూ అన్నాను.
మరు నిమిషంలో స్కూల్‌ బ్యాగ్‌ ఓ మూలకి, దాని వ్యతిరేక దిశలో షూస్‌, సాక్స్‌ విసిరివేయబడ్డాయి.
‘స్నానం చెయ్యి నాన్నా.. ఇద్దరం కలిసి డిన్నర్‌ చేద్దాం’
‘నీ బోడి రూల్స్‌ నా దగ్గర పెట్టకు’ కోపంగా వచ్చి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్నాడు.
‘హ్యాండ్‌ వాష్‌ చేసుకుంటే బెటర్‌ ఏమో’ ఇవన్నీ నాకేమీ కొత్త కాకపోవడంతో నిదానంగా అడిగాను.
నిశబ్దంగా ప్లేట్లో తనంతట తనే వడ్డించుకోవటం చూసి, నేను వెళ్లి రూమ్‌లో వాడు విసిరేసిన వస్తువులన్నీ యథా స్థానాల్లో పెడుతుండగానే పళ్లెం విసిరేసిన పెద్ద చప్పుడు వినపడి, డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చి చూశాను.
వాడు సింక్‌ దగ్గర చెయ్యి కడుక్కుంటున్నాడు. చెల్లాచెదురుగా పడిన అన్నం, పప్పు, మరో మూలకు విసిరి వేయబడిన ఆమ్లెట్‌. ఓ క్షణం బాధగా చూశాను. పక్కనే నాప్కిన్‌ ఉన్నప్పటికీ, మూతి షర్టుకి, చెయ్యి ప్యాంటుకి రుద్దుకొంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళబోతుంటే-
‘కారణం చెప్పమ్మా, ఎందుకిలా చేశావు’ ప్రశాంతంగా అడిగాను.
‘నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను అన్నం తింటుండగా ఆమ్లెట్‌ వేయమని, చల్లారింది ఎవడిక్కావాలి?’
అప్పటికీ అది కొంచెం వేడిగానే ఉందని నాకు తెలిసీ ఊరుకున్నాను.
హాల్లోకి వెళ్లి సోఫాలో మెడిటేషన్‌ మూడ్‌లో కూర్చున్నాను.
మరో గంట తర్వాత వెళ్ళి, ‘కొంచెం పెరుగన్నం తిందువుగాని రామ్మా, లేకుంటే నాకు అన్నం తినబుద్ధి కాదురా బంగారం’ బతిమలాడుతూ అడిగినా, నిండా కప్పుకున్న ముసుగు కూడా ఎక్కడ ఏమాత్రం కదల్లేదు. ఇంక లేవడని అర్థం అయింది.
లేచివెళ్లి, డైనింగ్‌ టేబుల్‌ దగ్గర శుభ్రం చేసి, వంటిల్లు సర్దేసి మరో యుద్ధానికి సిద్ధమవుతూ వెళ్లాను. ప్రోగ్రెస్‌ రిపోర్టు అడగాలి. ఏ మాటల శరాఘాతాలు.. ఎలాంటి గాయాలు చేయబోతున్నాయో అని అనుకుంటూ పక్కనే కూర్చున్నాను.
ముసుగు తీసి చూశాను.. కళ్ళు మూసుకుని ఉన్నాడు. కౌమారంలో ఉన్న సుకుమారత్వంతో మెరుస్తున్న ముఖం, వస్తూన్న నూనూగు మీసాలు, ఒత్తుగా అందంగా పెరిగి, నుదుటి మీదికి పడే క్రాఫ్‌తో ఉన్న వాడిని చూస్తూ, ప్రేమగా ఎలాగోలా వీడిని దారికి తెచ్చుకోవాలి- అని గట్టిగా నిర్ణయించుకున్నాను.
‘నీ ప్రోగ్రెస్‌ కార్డు ఇవ్వమ్మా.. సంతకం పెడతాను’ తలని నిమురుతూ అడిగాను.
‘అయితే అది ఫోన్‌ చేసిందన్న మాట’ కళ్ళు పెద్దవి చేసి, తర్జని చూపిస్తూ,
‘అది నీకు ఇంకోసారి ఫోన్‌ చేసినట్టుగా నాకు తెలిసిందో దాన్నైనా పొడిచి చంపేస్తా లేదా నేనైనా పొడుచుకుని చచ్చిపోతా’
ఆ స్వరంలోని తీవ్రతకు వాడి తల మీద చెయ్యి అప్రయత్నంగానే తీసేశాను. నిశబ్దంగా అలాగే వాడి దగ్గరే కూర్చున్నాను. వీడు నన్ను ‘అమ్మా’ అని పిలిచి ఎన్నాళ్ళై ఉంటుందో అని గుర్తు చేసుకుంటుంటే సంవత్సరాలు దాటిపోయిందనిపించింది. మింగుడు పడని బాధ మనసుని మెలి తిప్పింది.
అసలు వీడి ప్రవర్తనకు మూల కారణం ఏమై ఉంటుందో ఆలోచిస్తున్నాను.
ధ్రువ్‌ మూడవ తరగతిలో ఉన్నప్పుడు తన నాన్న గురించి అడిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాను. అప్పటి నుండే వాడిలో మార్పు మొదలై ఉండొచ్చు. తను పెద్దవాడవుతున్న క్రమంలో తండ్రి ప్రేమకు దూరం అవడానికి కారణం నేనని మనసులో అనుకుంటూండవచ్చు. అందుకే ఈ కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తిస్తున్నాడనుకుంటాను.
ఐదు నిమిషాల తర్వాత ముసుగు తీసిన ధ్రువ్‌ స్కూల్‌ బ్యాగ్‌ తెచ్చినా ముందే ప్రోగ్రెస్‌ రిపోర్టు బయటికి తీసి, బ్యాగ్‌కి రెండోవైపున వున్న జిప్‌ తెరిచి లైటర్‌ పట్టుకొని ‘చూడకుండా సంతకం పెడతానంటే చేతికి ఇస్తా లేదా ఈ లైటర్‌తో కాల్చేస్తా చెప్పు’ తలెగరేసి అడిగాడు.
నేను లేచి టేబుల్‌ దగ్గరికి వెళ్లి పెన్‌ తీసి, సంతకం పెట్టేందుకు సిద్ధమవటంతో ప్రోగ్రెస్‌ కార్డు టేబుల్‌ మీద పెట్టాడు.
సంతకం పెట్టాను. సంతకం పెట్టాల్సిన చోటు తప్ప మరేది నా కళ్లకు కనిపించకుండా జాగ్రత్తపడ్డాను.
ఎందుకో రెండు రోజులు ఆఫీస్‌కి సెలవు పెట్టాలనిపించింది. ఆ మరుసటి రోజు ఆదివారం కావడంతో ఈ మూడురోజులు నా కోసమంటూ కొంత రిలాక్స్‌ అవ్వాలనుకున్నాను. చాలా గంటలు పుస్తక పఠనంలో గడిపాను. ఆ రోజు ఒక కథ రాసి, పూర్తి చేస్తూ ఉండగా ఫోన్‌ రింగ్‌ అయింది. జానకి.
‘ఏంటే, ఏం చేస్తున్నావు’ ఉల్లాసంగా అడిగింది.
‘ఇప్పుడే ఒక కథ రాశానే. ఫైనల్‌గా చూస్తున్నాను’
‘ఏం కథ రాసావే’ అడిగింది .
‘ప్రేమ కథ’ అన్నాను.
‘నీ వయసు ఏమిటి? నువ్వు రాసే కథలేమిటి? రాస్తే గీస్తే కాస్త వయనంగా ఆధ్యాత్మిక కథలు రాసుకుని చావు. ముక్తి, మోక్షం ప్రాప్తిస్తాయి. ఇంతకీ ఈరోజు వంటచేశావా లేదా’ అనుమానంగా అడిగింది.
‘ఆ… చేశాను’ నేనేదో చెప్పబోతుంటే మళ్ళీ తనే అందుకున్నది.
‘ఏమిటోనే ఈ మధ్య నాకు చిరాకు ఎక్కువవుతుందని మా వారు కూడా అంటున్నారే. అయినా అవక చస్తుందా ఏమిటి? నెల నెలన్నర వరకు ఒకటి చొప్పున అయిదు తద్దినాలు సంవత్సరం తిరిగేసరికి చెల్లించాలా? నా ఒంట్లో ఓపికతో వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఈ మధ్యలో పండగలు వచ్చి, పని పెడతాయా? వచ్చిపోయే చుట్టాలు మాత్రం తక్కువా? దినవారాలు గుర్తించే తీరికన్నా ఉండదు’ వేసట నిండిన గొంతుతో చెప్తున్న దాని మీద కలిగిన జాలి కలిగింది.
‘నిజమే’ అని మాత్రమే అనగలిగాను.
‘ఏమో లేవే, ఎన్ననుకున్నా తృప్తిగా జీవించటంలోని పరమార్థం అర్థంచేసుకున్న వాళ్ళు అందరికంటే అదృష్టవంతులు’
‘కరెక్ట్‌, ఎంత బాగా చెప్పావే’ అన్నాను.
‘ఉంటానే, డోర్‌ బెల్‌ మోగుతుంది’ పెట్టేసింది.
మార్చి వచ్చేసరికి ధ్రువ్‌ పదో తరగతి పరీక్షలు అయిపోయాయి. వాడు రాశాడు అదే పదివేలు అనుకున్నాను. పాసా ఫెయిలా అనే బెంగ నాకు లేదు. ఎగ్జామ్స్‌ అయిపోయిన సాయంత్రం ధ్రువ్‌ పక్కనే సోఫాలో నేను కూర్చోగానే వాడు లేచి వెళ్ళిపోబోయాడు. చేయి గట్టిగా పట్టుకుని ‘కూర్చోమ్మా’, అనగానే ఏ గుణాన ఉన్నాడో కూర్చున్నాడు .
‘నేను ఒక సంవత్సరం పాటు ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను రా కన్నా’ అన్నాను. నోరు తెరిచి అమితాశ్చర్యంతో ఓ క్షణం అలానే ఉండిపోయాడు.
‘నీకు జీతం ఎంత వస్తుంది?’ ఆ అడగటంలో మొదటిసారి వాడి ముఖంలోను, మాటలోను భయం స్పష్టంగా తెలిసింది.
‘నేను లీవ్‌ పెట్టినంత మాత్రాన జీతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా’ స్థిరంగా చెప్పాను.
‘ఎందుకు లీవు’ అడిగాడు.
‘ఊరికే. నీతో టైమ్‌ గడపాలని. మనం ఎక్కడికైనా తిరుగుదాం. మరో విషయం. టెన్త్‌ పూర్తయిన సందర్భంగా నీకో ల్యాప్‌టాప్‌ ప్రెజెంట్‌ చేయాలనుకుంటున్నా’
చాలారోజుల తర్వాత వాడు నా వైపు కుతూహలంగా చూశాడు.
లాంగ్‌ లీవ్‌ కోసం అప్లై చేస్తే కష్టమైంది. చైల్డ్‌ కేర్‌ లీవ్‌ గురించి కూడా ఆలోచించాను కానీ, అలా అప్లై చేయాలనిపించలేదు. హిస్టరెక్టమీ ఆపరేషన్‌ చేయించుకుని ఎబార్షన్‌ లీవ్‌ వాడుకున్న వాళ్లు గుర్తొచ్చారు. ఫైనల్‌గా నా లీవ్‌ కి అనుమతి వచ్చింది.
ఓ రోజు సాయంత్రం ధ్రువ్‌ బయట నుండి వచ్చేసరికి లాప్‌టాప్‌తో పాటు ఇండియా మ్యాప్‌, రైల్వే టైం టేబుల్‌ ముందు రూమ్‌ లో టీపారు మీద ఉంచాను. వాడు లోపలికి వచ్చాడని తెలియగానే ‘కన్నా టీపారు మీద ఏమున్నాయో చూడమ్మా’, చెప్పాను.
వాడి రియాక్షన్‌ చూడాలనుకోలేదు.
మూడు నెల్లయ్యేసరికి ముంబైతో పాటు దక్షిణభారత సందర్శన చాలా వరకు పూర్తయింది. మధ్యలో టెన్త్‌ రిజల్ట్స్‌ తర్వాత ఫెయిల్‌ అయిన రెండు సబ్జెక్టులు పూర్తి చేయించడానికి కొంత గ్యాప్‌ తీసుకున్నాం.
ఈ మధ్య ధ్రువ్‌ నాతో కోపంగా మాట్లాడడం తగ్గించాడు. వాడు నాతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీ చూశాడు. చిరపుంజి, మాసిన్రామ్‌, అస్సాం, డార్జిలింగ్‌ చూశాడు. లోతట్టు ప్రాంతాల్ని చూశాడు. కొన్ని ఏరియాల్లో డ్రైనేజీ కాలువలు మీద తడికల ఇల్లు కట్టుకొని జీవించే వాళ్ళని చూశాడు. ఒక్క బిందెడు నీళ్ల కోసం ఎంతెంత దూరం నడుస్తారో చూశాడు. దుర్భర పరిస్థితుల్లో జీవిస్తూ కూడా నవ్వుతూ బతికే వారిని, నవ్వంటే ఏంటో తెలియకుండా బతుకీడ్చేవాళ్లనూ చూశాడు. అలాంటి వాళ్ల కోసం నిస్వార్ధంగా పనిచేసే ఎన్నో సంస్థలు, ఆర్ఫనేజస్‌ కూడా చూశాడు. ఫుట్‌పాత్‌ జీవితాల్ని చూసినప్పుడు మాత్రం ధ్రువ్‌ కదిలిపోయాడు.
‘ఈ ఫుట్‌పాత్‌ల మీద వయసొచ్చిన అమ్మాయిలు ఎలా జీవిస్తున్నారమ్మా’ అని అడిగాడు.
కోల్‌కతా ట్రిప్‌లో మార్కెట్‌ ఏరియా దగ్గరలో ఉన్న హోటల్లో ఉన్నాం. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌ లేటుగా చేయటం వలన మా ఇద్దరికీ లంచ్‌ టైంకి తినాలనిపించలేదు. ఆ మధ్యాహ్నం అప్పుడే వర్షం పడి, ఆగింది.
‘కొద్దిసేపు బయట వాకింగ్‌కి వెళ్దామా కన్నా’
‘సరే’ అంటూ చెప్పులేసుకున్నాడు. బయటికి వెళ్ళాము.
కొద్దిదూరం వెళ్లేసరికి గుంపుగా జనం కనిపించారు. ఏంటో చూద్దామని వెళ్ళాము.
చితచితలాడుతున్న బురద మీదే ఒక పెద్ద బేసిన్‌ నిండా అన్నం, పక్కనే చేపల పులుసు దబరా గిన్నె పెట్టుకొని, ఒక చిన్న స్టూల్‌ మీద ఓ పెద్దావిడ కూర్చుని ఉంది. చుట్టూ నిలబడిన బక్క పల్చటి మనుషులు, చిన్న చిన్న పనులు చేసుకునే కూలీలు, అలాంటి మరికొందరు కనిపించారు. ఆమె బేసిన్‌లోని అన్నం మధ్యలో గుంటలా చేసి చేపల పులుసు పోసి చేతితో కలుపుతూంది. ఐదు రూపాయల కాయిన్‌ ఆమె చేతిలో పెట్టిన వాళ్ళకి, దోసిలి పట్టి నిలబడ్డ వారి చేతిలో అన్నం ముద్దలుగా ఒకటి తిన్న తర్వాత ఒకటి ఆమె పెడుతూ ఉంటే ఆవురావురుమంటూ తింటున్నారు వాళ్ళు. ఆ ఐదు రూపాయలకి కేవలం మూడు ముద్దలే లెక్కగా పెడుతుంది ఆమె. ఆ దగ్గరలోనే ఒక పక్కగా మంచినీళ్ల బిందె, నీళ్ళబకెట్టు పెట్టి ఉన్నాయి. తినటం పూర్తయిన వాళ్లు, చేతులు కడుక్కుని మంచినీళ్లు తాగి వెళ్ళిపోతున్నారు.
ఓ పది నిమిషాలు అక్కడే నిలబడి చూశాం.
‘వెళ్లిపోదాం హోటల్‌కి’ అన్నాడు ధ్రువ్‌.
‘సరే’ అని రూమ్‌కి వచ్చేశాం.
డోరు పెడుతూనే ధ్రువ్‌ ‘అమ్మా’ అంటూ నన్ను గట్టిగా హగ్‌ చేసుకుని ‘నేను నా ఇష్టం వచ్చినట్టు నీతో మాట్లాడినా కూడా ఎప్పుడూ ఏమి అనకుండా, ఇంత ప్రేమగా ఉంటావ్‌ ఎందుకమ్మా. నువ్వు ప్రేమగా అన్నం పెడితే విసిరి కొట్టాను. మనల్ని ప్రేమగా చూసుకునేవారు లేకపోతే ఎంత కష్టమో నాకు తెలిసిందమ్మా. సారీ అమ్మా’ అంటూ ఏడ్చాడు.
‘నువ్వు నా కన్నయ్యవు కదరా బంగారం’
తల ఊపుతూ గుండెల నిండా గాలి పీల్చుకొని, కొంచెం రిలాక్స్‌ అయ్యాడు.
ఆ సాయంత్రం జానకి ఫోన్‌ చేసింది.
‘ఎక్కడున్నావ్‌?’
‘కోల్‌కతాలో’
‘నీ పని బాగుందే. నీలాగా నాకూ బ్రేక్‌ తీసుకోవాలనుకుంది. నన్నెవరైనా ఏ హిమాలయాలకో ఎత్తుకుపోయి పడేస్తే బాగుండనిపిస్తోంది’
‘ఎవరూ పడేయరు. నువ్వే నిర్ణయం అనే లేపనాన్ని పాదాలకు రాసుకోవాలి’
‘అంతేనంటావా’
‘అంతే?’
‘నీ సంగతేంటి? ఎలా ఉన్నావ్‌?’
‘ఎలా ఉంటాను. ఇప్పుడే నా కొడుకును నిజమైన ప్రేమతో పొందాను. కాస్త విరామం. మరో సవాలు ఎదురయ్యేదాకా ఈ విరామంలో సేద తీరుతాను.’
‘అంతేలే. అంతకు మించి ఏం చేయగలం. ఉత్త ఆడవాళ్లం’
‘కాదు.. గట్టి ఆడవాళ్లం’ ఫోన్‌ పెట్టేసి, ధ్రువ్‌తో విద్యుత్‌దీపాల వెలుగులో పారే గంగా ప్రవాహాన్ని చూడటానికి హోటల్‌ రూమ్‌ నుంచి బయటపడ్డాను.

శారద కావూరి
77803 57378

➡️