జీబ్రాలూ.. జర భద్రం..

Jan 28,2024 07:20 #environmental study, #Sneha
about zebra

ఎ ఫర్‌ యాపిల్‌.. బి ఫర్‌ బాల్‌.. చివరిగా జెడ్‌ ఫర్‌ జీబ్రా.. అని చిన్నప్పుడే విన్నాం కదా! మరికాస్త ఊహ తెలిసిన తర్వాత రోడ్డును దాటేటప్పుడు నలుపు, తెలుపు చారలను జీబ్రా క్రాసింగ్‌ అనటం విన్నాం! ఇప్పుడు ఆ జీబ్రాల మనుగడకు ముప్పు వాటిల్లిన కారణÛంగా ‘అంతర్జాతీయ జీబ్రా డే’ జరుపుకుంటున్నాం. అవును అన్ని జీవ జాతుల వలెనే జీబ్రాలకూ అంతరించిపోయే ప్రమాదం వాటిల్లింది. దానికి పర్యావరణ అసమతుల్యత ముఖ్యకారణం. అయితే వాటి అందమైన చర్మం, మాంసం కోసం వేటకు గురవుతున్నాయి. వీటిని సంరక్షించుకోవలసిన అవసరం ఉందనే విషయంపై ప్రజలకు అవగాహన తెలిపేందుకు ‘అంతర్జాతీయ జీబ్రా దినోత్సవం’ ప్రతి జనవరి 31న జరుగుతుంది. ఉక్రెయిన్‌లోని నికోలెవ్‌ జూ, స్మిత్‌సోనియన్స్‌ నేషనల్‌ జూ, కన్జర్వేషన్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌, మరికొన్ని పరిరక్షణ సంస్థలు ఈ నిర్వహణా చర్యలు చేపట్టాయి.

జీవ జాతుల్లో ప్రతి జీవికీ ప్రత్యేకతలు ఉంటాయి. కానీ కొన్ని జంతువులు ఎన్నింటిలో ఉన్నా, ఎక్కడున్నా వాటి ప్రత్యేకతను అవి చాటుకుంటాయి. అలాంటి కోవకు చెందినదే జీబ్రా. శరీరం మీద ఉండే నలుపు తెలుపు చారలే దాని ప్రత్యేకత. ఇది ఈక్విడే కుటుంబానికి చెందినది. జీబ్రాకి, గుర్రం, గాడిదలకి కొన్ని జన్యుపరమైన సారూప్యతలు ఉంటాయి. జీబ్రాలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. సూడాన్‌, దక్షిణాఫ్రికా, ఇథియోపియా, నమీబియా, కెన్యా, అంగోలా వంటి దేశాల్లో వీటి మనుగడ ఉంది. ‘సంస్కారం లేని మనిషి.. చారలు లేని జీబ్రాతో సమానం’ అనే సామెత ఆఫ్రికా దేశస్థులు వాడుతుంటారు.

రకాలు..

జీబ్రాల్లో గ్రేవీ జీబ్రా, మౌంటెన్‌ జీబ్రా, ప్లెయిన్‌ జీబ్రా అని మూడు రకాలున్నాయి. గ్రేవీ, మౌంటెన్‌ జీబ్రాలు చాలా ఎత్తుగా ఉండి, వెయ్యి పౌన్ల పైనే బరువుంటాయి. ప్లెయిన్‌ జీబ్రాలు మాత్రం గుర్రాల సైజులో ఉంటాయి. గ్రేవీ జీబ్రాలకు పెద్ద కళ్ళుంటాయి. అవి చాలా చురుకైన దృష్టితో.. చాలా దూరంలో ఉన్న శత్రువు కదలికలను గుర్తిస్తాయి. ఆహారం, నీటి ఉనికినీ గ్రహిస్తాయి. జీబ్రాలు గంటకు 65 కి.మీ వేగంతో పరిగెత్తగలవు. ఆశ్చర్యంగా ఇవి పుట్టిన ఆరు నిమిషాలకే నిలబడతాయి. మరో విశేషం ఏమంటే.. 20 నిమిషాలకు నడిచేస్తాయి.. 40 నిమిషాలకు పరిగెత్తేస్తాయి.. భలే.. భలే..

చారలు..

మన వేలిముద్రలు ఎలా అయితే వేరుగా ఉంటాయో.. జీబ్రా చారలు కూడా ఏ రెండూ ఒకేలా ఉండవు. గ్రేవీ జీబ్రాలకు ఉండే చారలు చాలా సన్నగా, నిలువుగా, శరీరమంతా ఉంటాయి. మౌంటెన్‌ జీబ్రాకు మెడ, మొండెం మీద నిలువు చారలు, తుంటిపై అడ్డచారలు ఉంటాయి. ఇవి డార్క్‌ బ్రౌన్‌లో చాలా దగ్గరదగ్గరగా ఉంటాయి. పొట్టమీద అసలు చారలే ఉండవు. ప్లెయిన్‌ జీబ్రా రకాల్లో మాత్రం చారలు శరీరమంతా ఉంటాయి. కొన్ని నిలువుగా, వి ఆకారంలో, ఖాళీని భర్తీ చేసే విధంగా ఉంటాయి. జీబ్రాలు ఎక్కడికి వెళ్ళినా గుంపుగా వెళ్తాయి. అన్నీ ఆ చారలతో ఒక్కసారిగా కదులుతూంటే మన కళ్ళకు డాజిలింగ్‌గా అనిపిస్తుంది. అదే వాటికి రక్షణ కవచం. ఎందుకంటే దోమలు, ఈగలు లాంటి కీటకాలు వాటి దరికి చేరలేవు. మౌంటెన్‌, గ్రేవీ జీబ్రాలు ఎంత ఎత్తుకైనా ప్రయాణిస్తాయి. ప్లెయిన్‌ జీబ్రాలు మాత్రం రెండువేల అడుగుల ఎత్తు మాత్రమే ఎక్కగలవు. గ్రేవీ జీబ్రాలకు పెద్దపెద్ద కళ్ళుండి, చురుకైన దృష్టిని కలిగి ఉంటాయి.

గుంపులుగా..

జీబ్రాలు కూడా సామాజిక జంతువులుగా చెప్పవచ్చు. ఇవి గుంపులుగా జీవిస్తాయి. స్టాలియన్‌ అని పిలువబడే ఒక మగ, ఆరు ఆడ జీబ్రాలు, వాటి పిల్లలు కలిసి నివసిస్తాయి. ఈ సమూహాన్ని అంతఃపురం అని పిలుస్తారు. వీటిని స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు ప్రతీకగా చెబుతారు. అయితే వ్యాపారరీత్యా వీటి మనుగడకే ప్రమాదం వస్తుంది. జీబ్రాల మాంసం, చర్మం కోసం వీటిని వేటాడుతున్నారు. దీనికి తోడు పర్యావరణ ప్రతికూలతలు వీటి మనుగడకు ఎదురు నిలుస్తున్నాయి.పర్యావరణ పరిరక్షణకు.. జీవ జాతుల సంరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరం గుర్తించాలి. అందుకనుగుణంగా అందరం ఆ అవగాహనతో నడుచుకుందాం.. జీబ్రాలను సంరక్షించుకుందాం..

➡️