భగత్‌సింగ్‌ బయోపిక్‌లో చేయాలని ఉంది…

Mar 24,2024 08:10 #Actors, #celebrity, #Film Industry, #Sneha

హీరోగానైనా, విలన్‌గానైనా ఒదిగిపోయి నటించే వాళ్లల్లో నటుడు గోపీచంద్‌ ఒకరు. ఎన్నో సినిమాల్లో పరాజయాన్ని అందుకున్నారు. అయినా వెనుతిరగకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. హర్ష దర్శకత్వంలో ఆయన నటించిన కొత్త చిత్రం ‘భీమా’. ఫాంటసీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలైంది. ఈ సందర్భంగా అభిమానులతో పలు విశేషాలు పంచుకున్నారు.

గోపీచంద్‌ ప్రకాశం జిల్లా, టంగుటూరు దగ్గర్లో ఉన్న కాకుటూరువారి పాలెంలో జన్మించారు. బాల్యమంతా ఒంగోలు, హైదరాబాదులో గడిచింది. ఇతనికి ఒక అన్నయ్య, చెల్లి ఉన్నారు. గోపీచంద్‌ తాతయ్య పొగాకు వ్యాపారం చేసేవారు. తండ్రి టి. కృష్ణ కూడా అదే వ్యాపారాన్ని కొనసాగించారు. తర్వాత సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్ళారు. పిల్లలను చదివించడానికి చెన్నైలో ఆయనకు నచ్చిన పాఠశాల దొరక్కపోవడంతో చెన్నై నుంచి ప్రిన్సిపల్‌ను రప్పించి, ఒంగోలులోనే ‘నిల్‌ డెస్పరాండం’ (ఫ్రెంచి భాషలో నిరాశ పడొద్దు అని అర్థం) పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాల ఇప్పటికీ ఒంగోలులో టి. కృష్ణ స్నేహితులు నిర్వహిస్తున్నారు. గోపీచంద్‌ ఈ పాఠశాలలోనే మూడో తరగతి వరకు చదువుకున్నారు. తండ్రి తీసిన ‘నేటి భారతం’ సినిమా భారీ విజయం అందుకోవడంతో కుటుంబాన్ని చెన్నైకి మార్చారు. దాంతో గోపీచంద్‌ రామకృష్ణ మిషన్‌ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. రష్యాలో ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించారు. అక్కడ మరో నటుడు మాదాల రంగారావు పిల్లలు వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించుకునేవారు.

 


అడవిలో అలా…
‘నాకు యజ్ఞం సినిమాతో సక్సెస్‌ వచ్చిందని, అప్పటి నుంచి సినిమా టైటిల్స్‌ చివర్లో సున్నాలు (లక్ష్యం, లౌక్యం, రణం, పంతం) కావాలని పెట్టిస్తున్నానని అనుకుంటారు. అదేమైనా సెంటిమెంటా? అని చాలామంది అడిగారు కూడా. అలాంటిదేమీ లేదు. ఆ టైటిల్స్‌ అన్నీ అలా అనుకోకుండా కుదిరాయి. ఇప్పుడు ‘భీమా’ లో నటించాను. పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 16 రోజులపాటు రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగింది. అడవిలో రాత్రిపూట షూట్‌ చేసిన అనుభవం ఎప్పుడూ లేదు. మొదటిరోజు భారీ వర్షం. నల్ల తేళ్లు, పాములు.. బిక్కుబిక్కుమంటూ ఆ సీక్వెన్స్‌ పూర్తి చేశాం. ఆ ఎపిసోడ్‌ ఆడియన్స్‌కు తప్పక నచ్చుతుంది. ఇప్పుడు శ్రీనువైట్లతో కొత్త సినిమా చేస్తున్నా. 30 శాతం షూట్‌ పూర్తయ్యింది. టైటిల్‌ ఇంకా ఫిక్స్‌ చేయలేదు. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలగలిపి ఆ సినిమా ఉంటుంది. బయోపిక్‌లో నటించాల్సి వస్తే భగత్‌సింగ్‌ చేయాలని ఉంది. అదొక పవర్‌ఫుల్‌ పాత్ర. అవకాశం వస్తే చేస్తాను. హీరో పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌లో ఉండే రోల్స్‌ కూడా చేయాలని ఉంది.


తండ్రి వారసత్వంగా..
గోపీచంద్‌ చదువు పూర్తవగానే వ్యాపారం చేసుకోవాలనుకున్నారు. అంతకు మునుపే అన్నయ్య ప్రేమ్‌చంద్‌ దర్శకుడు కావాలనే ఉద్దేశ్యంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. కానీ కొద్దికాలానికే ఒక ప్రమాదంలో మరణించారు. తండ్రి వారసత్వాన్ని కుటుంబంలో ఎవరో ఒకరు కొనసాగిస్తే బాగుంటుందని గోపీచంద్‌ సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. డైలాగ్‌ మాడ్యులేషన్‌ కోర్స్‌ సంవత్సరం పాటు నేర్చుకున్నారు. తండ్రి స్నేహితులైన నాగేశ్వరరావు, తిరుపతిరావు, హనుమంతరావు కలిసి గోపీచంద్‌ కథానాయకుడిగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘తొలివలపు’ అనే చిత్రం తీశారు. అలా గోపీచంద్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి అడుగులో పరాజయాన్ని అందుకున్నా.. ఆయన ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ తో విలన్‌గా మారి, వెండితెరపై సత్తా చూపించారు. ‘యజ్ఞం’తో హీరోగా సక్సెస్‌ అందుకున్నారు. గోపీచంద్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

చదివే వాళ్లకు సాయం

‘ఒక వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడటానికి చదువు చాలా ఉపయోగపడుతుంది. అందుకే చదువులో ప్రతిభ ఉండి స్థోమత లేని విద్యార్థులను చదివిస్తున్నా. అందులో కొందరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారికి నా పేరు కూడా తెలియదు. మనం ఇష్టంతో చేస్తున్న పని బయటకు చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ విషయం ఎవరికీ తెలియదు. మా నాన్న మంచి స్కూల్‌ పెట్టాలని ఎప్పుడూ అంటుండేవారు. మా చిన్నప్పుడు ఒంగోలులో స్కూల్‌ పెట్టారు. ఆయన మరణం తర్వాత మేము దాన్ని కొనసాగించలేకపోయాం’ అని చెప్పుకొచ్చారు గోపీచంద్‌.

పేరు : తొట్టెంపూడి గోపీచంద్‌
పుట్టినతేది : 1975, జూన్‌ 12
నివాసం : హైదరాబాద్‌
జీవిత భాగస్వామి : రేష్మా (హీరో శ్రీకాంత్‌ మేనకోడలు)
పిల్లలు : విరాట్‌ కృష్ణ, వియాన్‌

➡️