సృజనాత్మకంగా తీర్చిదిద్దాలి..

May 19,2024 08:18 #Parenting, #Sneha, #Stories

సృజన అనేది స్వయంసిద్ధంగానే రావాలి. కానీ బాల్యంలో అందుకు కొంత పునాది ఏర్పడాలి. అందుకు పేరెంటింగ్‌ చాలా కీలకమైందనేది నిపుణులు చెప్తున్న మాట. ప్రకాశవంతమైన మనస్సుతో సృజనాత్మక పిల్లలను పెంచడం అనేది తల్లిదండ్రులు ఓర్పు, అంకితభావంపై ఆధారపడి ఉంటుంది. వాళ్లు ఎలా నేర్చుకుంటున్నారు.. ఎలా అభివృద్ధి చెందుతున్నారు.. వారికి పరిస్థితులపై ఎలాంటి అవగాహన వస్తోందని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. చాలా మంది పిల్లల్లో సహజమైన సృజనాత్మకత ఉంటుంది. దానిని గుర్తించి ప్రోత్సహించగలిగితే వాళ్లు అద్భుతాలు చేస్తారు. అందుకే పిల్లలను ఎలా పెంచాలనేది తల్లిదండ్రులకు తెలిసి ఉండాలని అంటారు నిపుణులు. సృజనాత్మక పిల్లలను ఎలా పెంచాలి, ఎలా పెంచితే వారు సృజనాత్మకంగా ఎదుగుతారులో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలకు పుట్టినప్పటి నుంచి బోలెడంత ఆసక్తి, ఆతృత ఉంటాయి. ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని.. లేచి కూర్చోవాలని.. అడుగులు వేయాలని.. పరుగులు తీయాలని.. అన్నీ గమనిస్తూ ఉంటారు. అలానే బిడ్డ ఆసక్తిని, ఆతృతని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. అందువల్లే పిల్లలు మాటలు నేర్వడం, నడక నేర్చడం అబ్బురంగా అనిపిస్తుంది కదూ.. అలాంటివే వారిలో సృజనకు మెరుగులు దిద్దడం కూడా అనేది నిపుణులు చెప్తున్న విషయం.

అన్వేషణను ప్రోత్సహించాలి..
పిల్లలు ప్రయోగాత్మక కార్యకలాపాలు, అన్వేషణ ద్వారా చాలా నేర్చుకుంటారు. అందుకే కొత్త విషయాలను ప్రయత్నించడానికి, ప్రయోగాలు చేయడానికి, ప్రశ్నలు అడగడానికి పిల్లలను ప్రోత్సహించాలి. ఇది వారి విమర్శనాత్మక ఆలోచన, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందనేది నిపుణులు చెప్తున్న మాట.

అనుభవాలు చెప్పాలి..
పిల్లలు వారి సృజనాత్మక మేధస్సును అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి వివిధ అనుభవాలను అందించాలి. ఇది పఠనం, కళ, సంగీతం, క్రీడలు ఇలా ప్రతిదీ వారికి అనుభవపూర్వకంగా తెలియాలి. పిల్లలను మ్యూజియంలు, ప్రకృతి సంరక్షణ విహారయాత్రలకు తీసుకువెళ్లాలి. విభిన్న సంస్కృతులు, జీవన విధానాలు వారికి తెలిసేలా చేయాలని నిపుణులు చెప్తున్నారు.

ఆలోచనలను ఆహ్వానించాలి..
సృజనాత్మక పిల్లలు తరచుగా ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌గా ఆలోచిస్తారు. మీ పిల్లలను సొంతగా ఆలోచనలు చేయాలని వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. వారికి ఎప్పుడూ సమాధానాలు ఇవ్వొద్దు. దానికి బదులుగా వారినే జవాబులు కనుక్కోమని చెప్పాలి. అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో వారికి సహాయం చేయాలని నిపుణుల మాట.

ఇష్టానికి మద్దతివ్వాలి..
పిల్లలకు తరచుగా సహజంగానే కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లల అభిరుచులకు మద్దతు
ఇవ్వాలి. వాటిని కొనసాగించడానికి అవసరమైన వనరులు కల్పించాలి. ఇది వారి నైపుణ్యాలు, ప్రతిభను అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
అర్థం చేసుకోవాలి..
పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారు.. వారి అవసరాలు ఏమిటి.. ఇలా వారి గురించి ప్రతి రోజూ తెలుసుకుంటూ ఉండాలి. అలాగే వారికి అధ్యయనం చేయడం అలవాటు చేయాలి. వారిని క్లాసు పుస్తకాలే కాకుండా ఇతర సాహిత్యాన్నీ చదవమని ప్రోత్సహించాలి. చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, గ్రహణశక్తి మెరుగుపడుతుందని అర్థమయ్యేలా వారికి చెప్పాల్సింది పేరెంట్సే.

సంభాషించాలి..
పిల్లల సృజనాత్మకత, తెలివితేటలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో కమ్యూనికేషన్‌ చాలా కీలకం. తల్లిదండ్రులు పిల్లలతో క్రమం తప్పకుండా మాట్లాడాలి. అంతేకాదు వారు చెప్పేది వినడమనేది అత్యంత కీలకమైనదంటున్నారు నిపుణులు. అలాగే వారిని ప్రశ్నలు అడగాలి. వారి ఆలోచనలు, భావాలను వ్యక్తీకరించడానికి వారిని ప్రోత్సహించాలి.

విలువలు నేర్పాలి..
సృజనాత్మక పిల్లలు పెద్దలను మెప్పించడానికి అన్ని నియమాలనూ విధేయతతో పాటించరు. పిల్లలకు ఆరోగ్యకరమైన విలువలను నేర్పడం ద్వారా వారు సరైన ఆలోచనతో ఉంటారు. నియమాలు ఉన్నప్పటికీ, వాటి గురించి పారదర్శకంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి. తద్వారా అవి ఎందుకు ఉన్నాయో పిల్లలు అర్థం చేసుకుంటారు. సృజనాత్మకత అనేది జీవన విధానం. ఆడటానికో, పెయింటింగ్‌ వేయడానికో దానిని పరిమితం చేయకూడదు. పిల్లలు వారి సొంత ప్రత్యేక రంగంలో సృజనాత్మకంగా ఉండేలా చూసుకోవాలి. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదని, కష్టాలు వస్తాయని తెలియజేయాలి. కానీ వాటిని ఎదురించి, నిలబడటానికి అవకాశాలు ఉంటాయనేదీ వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వారికి సమాజం పట్ల అవగాహన కలిగించడం అన్నింటిలోకీ అత్యంత కీలకమైనది. అది లేకపోతే మనమే లేము. ఈ వాస్తవాన్నీ పిల్లలకు అవగాహన కలిగించాలి.

➡️