జీవితంలోనూ స్ట్రాంగే..

Jan 28,2024 07:06 #Actress, #Film Industry, #Profiles, #Sneha
celabrity actress pragathi

నటి ప్రగతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చాలా సినిమాల్లో అమ్మగా, అత్తగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పుడు ఆమె సౌత్‌ ఇండియా పవర్‌ లిఫ్టింగ్‌ కాంపిటీషన్స్‌ – 2024లో పాల్గొన్నారు. సిల్వర్‌ పథకాన్ని సాధించి రెండో స్థానంలో నిలిచారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 48 ఏళ్ళ వయసులోనూ కష్టపడి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొని, సౌత్‌ ఇండియన్‌ ఛాంపియన్‌గా నిలవడంతో.. ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు అభిమానులు. మనిషికి సాధించాలనే కోరికుంటే.. దానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారామె. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

‘మా చిన్నతనంలో కుటుంబంతో నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వచ్చాం. పదో తరగతి వరకూ ఇక్కడే ఉన్నాం. ఆ తర్వాత చెన్నైకు షిఫ్ట్‌ అయ్యాం. హైస్కూల్లో ఉన్నప్పుడు తండ్రిని కోల్పోయాను. దాంతో అమ్మా, నేనూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆర్థికంగా అమ్మకు సాయం చేయడం కోసం కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు కొంతకాలం పాటు కార్టూన్‌ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పా. తర్వాత డిగ్రీ ప్రయివేటుగా చదివాను. చెన్నైలోని ‘మైసూర్‌ సిల్క్‌ ప్యాలెస్‌’ షోరూమ్‌ కోసం మోడల్‌గానూ వర్క్‌ చేశా. ఆ రోజుల్లో తెలిసిన వారి ద్వారా నా ఫొటోలు ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా వద్దకు వెళ్లాయి. ఆడిషన్స్‌ అనంతరం ఆయన తన సినిమాలో నన్ను సెలెక్ట్‌ చేశారు. సహాయనటి పాత్ర కోసం నన్ను ఎంచుకున్నారనుకుని ఓకే చెప్పా. తీరా చూస్తే.. ఆ సినిమాలో హీరోయిన్‌గా నన్ను తీసుకున్నట్లు చెప్పారు. ఆయన మాటలకు ఆశ్చర్యపోయా. మా అమ్మ ధైర్యం చెప్పడంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశా. అలా భాగ్యరాజా తెరకెక్కించిన ‘వీట్ల విశేషంగా’ తమిళంలో వచ్చిన నా తొలి చిత్రం. అదే చిత్రం ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మా’ అనే పేరుతో తెలుగులో విడుదలైంది. హీరోయిన్‌గా నేను దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటించాను.

హీరోయిన్‌గా నటించిన ఓ చిత్రానికి హీరోగా వర్క్‌ చేసిన వ్యక్తే నిర్మాతగానూ వ్యవహరించారు. సినిమాలోని వాన పాట కాస్ట్యూమ్‌ విషయంలో ఆ టీమ్‌తో గొడవ జరిగింది. కోపంతో నేను సెట్‌ నుంచి వెళ్లిపోయా. చివరకు రాజీ పడి, పెండింగ్‌ షూట్‌ పూర్తిచేశాను. ఆ సమయంలో సెట్‌లో వాళ్ల చూపులు నన్నెంతో బాధించాయి. ఇకపై సినిమాలు చేయకూడదని అప్పుడు నిర్ణయించుకున్నా. 20 ఏళ్ల వయసులోనే పెళ్లి అయ్యింది. ఆ తర్వాత నాకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. వెంటనే బాబు పుట్టాడు. ఆ తర్వాత పాప పుట్టింది. సీరియల్స్‌లోకి అడుగుపెట్టా. తమిళంలో పలు ధారావాహికల్లో నటించాను. నా యాక్టింగ్‌ నచ్చడంతో సినిమాల్లో మళ్లీ అవకాశాలు వచ్చాయి. పిల్లల్ని చూసుకుంటూనే సినిమాల్లో నటించాను. అలా ‘నువ్వు లేక నేను లేను’ లో హీరోయిన్‌ తల్లిగా నటించా. అప్పుడు నా వయసు 24 ఏళ్లు. మేకప్‌ రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేశా. చిన్న వయస్సులోనే తల్లి పాత్రల్లో నటిస్తున్నందుకు. కానీ ఆ తర్వాత ఎప్పుడూ బాధపడలేదు. తల్లిగా పొందే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. సింగిల్‌ పేరెంట్‌గా ఉంటే వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో అమ్మ వల్ల తెలుసుకున్నా. దాంతో ఇబ్బందులు వచ్చిన ప్రతిసారీ సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నా. కాకపోతే కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. పిల్లల్ని చూస్తూ, సినిమాల్లో నటిస్తూ సమస్యలను మరిచిపోయేదాన్ని. ప్రస్తుతం ఉన్న రోజుల్లో హీరోహీరోయిన్స్‌ అందరూ ఫిట్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. వాళ్లకు తల్లి పాత్రల్లో నటించినప్పుడు మనం కూడా ఫిట్‌గా కనిపించాలనేది నా ఉద్దేశం. అందుకే క్రమం తప్పకుండా జిమ్‌, ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటా. కరోనా లాక్‌డౌన్‌ నాకు మంచి అవకాశంగా అనిపించింది. ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెట్టా. అలాగే, నేనొక క్లాసికల్‌ డ్యాన్సర్‌ని. చిన్నప్పుడే క్లాసికల్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నా. వెండితెరపై తల్లి పాత్రల్లో నటించినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం నాకు నచ్చిన విధంగా ఉంటాను. డ్యాన్సులు.. వర్కౌట్లు.. నా ఇష్టాయిష్టాలను తెలియజేస్తూ అప్పుడప్పుడు ఇన్‌స్టాలో పోస్టులు పెడుతుంటా’ అని ఆమె చెప్పారు.

ఆమె శారీరకంగానే కాదు.. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఆమె వర్కౌట్స్‌ గురించి, వ్యక్తిగత విషయాలపై నెటిజెన్స్‌, మీడియా ఎన్నో రకాలుగా ట్రోల్స్‌ చేశారు. ”ఈ వయసులో నీకు అవసరమా?” అంటూ విమర్శలు గుప్పించారు. అయినా అవేమీ పట్టించుకోకుండా తాను అనుకున్నది సాధించే విధంగా ముందుకు వెళుతున్నారు ప్రగతి. పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని, బహుమతులు సాధిస్తున్నారు. జీవితంలో సగంపైగా వయస్సు అయ్యాక ఇంకా ఏమీ సాధించలేము అనుకునేవారికి ఆమె స్ఫూర్తివంతంగా నిలుస్తారు.

 

పేరు : ప్రగతి

పుట్టిన తేది : 1975, ఏప్రిల్‌ 17

చదువు : బిఎ పొలిటికల్‌ సైన్స్‌

వృత్తి : నటి

అవార్డు : ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం (ఏమైంది ఈవేళ)

➡️