త్యాగధనులు ఈ నైటింగేల్స్‌

May 12,2024 11:58 #Sneha, #trainee nurse

‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న!’ అనేది సూక్తి. అది ఎవరిని ఉద్దేశించి ప్రాచుర్యంలోకి వచ్చినా రోగుల పట్ల అంకిత భావంతో పనిచేసే ప్రతి నర్సుకూ తప్పక వర్తిస్తుంది. 1820 మే 12న బ్రిటన్‌లో జన్మించిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ ఈ నర్సింగ్‌ స్థాపకురాలు. టర్కీలో జరిగిన క్రిమియన్‌ యుద్ధంలో బ్రిటీష్‌, మిత్రరాజ్యాల సైనికులకు ఫ్లోరెన్స్‌ అసామాన్యమైన సహాయాన్ని అందించారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ 1965 నుండి జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆ సేవామూర్తుల గురించి ప్రత్యేక కథనం.
నర్సింగ్‌ అనేది వైద్య రంగంలో ఉన్నతమైన సేవా ప్రక్రియ. ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటంలో, అనారోగ్యంతో బాధపడే వారికి సాయం చేయటంలో అధికారిక నైపుణ్యాన్ని కలిగినవారే నర్సులు. 1854లో క్రిమియన్‌ యుద్ధం జరిగింది. అప్పుడు 38 మంది నర్సులతో కూడిన బృందం యుద్ధంలో గాయపడిన సైనికులకు విశిష్టసేవలు అందించింది. ఆ నర్సుల బృందానికి ఫ్లోరెన్స్‌ నాయకురాలు. ఆమె మార్గదర్శకురాలిగా సేవలందిస్తూ.. నిరంతరం ఆ క్షతగాత్రులకు గమనిస్తూ దీపం పట్టుకొని, ఆ శిబిరాల్లో తిరిగారు. అందుకే ఆమెను ‘లేడీ విత్‌ ది ల్యాంప్‌’ అని కూడా పిలిచేవారు.

కరోనాలో..
కరోనా సమయంలో తమ సేవానిరతి, త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా నర్సులు చాటిచెప్పారు. కుటుంబసభ్యులు సైతం అంటుకోవటానికి భయపడ్తున్న కరోనాలో ఈ నర్సులే ఎన్నో సేవలు అందించారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కరోనా బాధితులను గుర్తించడం.. వారికి వైద్య సేవలు అందించటం వారి త్యాగానికి ప్రతీక. అంతటితో ఊరుకోలేదు. ఆసుపత్రుల్లో ఖాళీ లేకపోతే నేల మీద, ఆసుపత్రి బయట, చెట్ల కింద ఒకటేమిటి.. ఎక్కడ వీలైతే అక్కడ వారి సేవలందించారు. కరోనా పడగ నీడలో ఎప్పుడు వైరస్‌ బారిన పడతామో తెలియని పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించారు.

సేవే పరమావధిగా…
ప్రజారోగ్య సంరక్షణలో నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక, రోగులకు సేవలను అందిస్తారు. మనకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రికి వెళ్ళినపుడు డాక్టర్‌ కన్నా ముందు వచ్చి మనకు సహాయం చేసేది నర్సులే. డాక్టర్‌ చికిత్స చేశాక, మనల్ని కంటికిరెప్పలా కాపాడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యే వరకు సేవలు చేసేది నర్సులే.
మన దేశంలోనూ ఈ రోజు, నర్సింగ్‌ విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారత రాష్ట్రపతి ‘నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు’లను అందిస్తారు. ఈ అవార్డులో భాగంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత, స్వచ్ఛంద సంస్థల్లో విశిష్ట సేవలందించిన నర్సులకు ఒక పతకం, ప్రశంసాపత్రం, జ్ఞాపికతోపాటు 50 వేల రూపాయల నగదు బహుమతిని బహుకరిస్తారు.
నర్సుల సేవల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసిస్తూ, నర్సింగ్‌ శ్రామిక శక్తిని అబివృద్ధి చేయడం ద్వారా, వారి దేశ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక వృద్ధికి మద్దతు వంటి మూడు ప్రభావాలను దేశాలు సాధించవచ్చని పేర్కొన్నది. ప్రపంచంలోని మొత్తం ఆరోగ్య కార్యకర్తలలో సగానికి పైగా నర్సులు ఉన్నారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నర్సుల కొరత ఉంది. ఇంకా దాదాపు 60 లక్షల మంది నర్సులు అవసరం ఉంది. ముఖ్యంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ కొరత ఎక్కువగా ఉంది. నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు లేకుండా, లక్ష్యాలను లేదా సార్వత్రిక ఆరోగ్యాన్ని ప్రపంచ దేశాలు సాధించలేవు. అన్ని దేశాలలో నర్సులు, ఆరోగ్య కార్యకర్తలందరూ వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, సురక్షితంగా సంరక్షణతో ఉండాలి. అప్పుడే వారు రోగులకు సేవలను అందించగలరు. దీనితో అంటువ్యాధులను తగ్గించవచ్చు. నర్సులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులందరికీ మానసిక ఆరోగ్య మద్దతు, సకాలంలో వేతనం, అనారోగ్య సెలవులు, బీమా వంటివి ఇవ్వాలి. అన్ని ఆరోగ్య అవసరాలకు ప్రతిస్పందించడానికి అవసరమైన శిక్షణ ఇవ్వడం అన్ని దేశాలు చేయాలి.
హోదాల్లో మార్పులు..
మన దేశంలో బీఎస్సీ నాలుగేళ్లు, ఎంఎస్సీ రెండేళ్లు , పీహెచ్‌డీ కొన్ని ఏళ్లపాటు చదివినా కూడా ప్రాథమికంగా స్టాఫ్‌ నర్సు అనే పిలుస్తున్నారు. దీనివల్ల ఉన్నతస్థాయిలోని నర్సింగ్‌ కోర్సు పూర్తిచేసిన వారు సరైన గౌరవం పొందలేక పోతున్నారని గమనించిన కేంద్రం ఇటీవల నర్సింగ్‌ పోస్టులలో పలు హోదాలను మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రైల్వే, ఎయిమ్స్‌ లాంటి ఆసుపత్రుల్లో స్టాఫ్‌ నర్సు హోదాను నర్సింగ్‌ ఆఫీసర్‌ అంటారు. నర్సింగ్‌ సిస్టర్‌ హోదాను సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ అని, సీనియర్‌ ట్యూటర్‌ హోదాను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అంటారు. లెక్చరర్‌ హోదాను అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అని, ప్రిన్సిపాల్‌ హోదాను ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపాల్‌ అంటారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ హోదాను ప్రొఫెసర్‌ కమ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ అని మార్పు చేశారు. కొత్త హోదాలను ప్రభుత్వం అమలు చేస్తే, ప్రైవేట్‌ ఆసుపత్రులూ అనుసరిస్తాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కూడా దీనిని అనుసరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా నర్సుల హోదాలు మార్పు చేయడం ద్వారా వారి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశముంది.

థీమ్‌
‘మన నర్సులు. వారే మన భవిష్యత్తు. వారే మనను సంరక్షించే ఆర్థికశక్తి’ అనే థీమ్‌తో ఈ సంవత్సరం నర్సుల దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. అమెరికన్‌ నర్సుల థీమ్‌ ‘నర్సెస్‌ మేక్‌ ది డిఫరెన్స్‌’ గా ప్రకటించారు.

➡️