దాతృత్వం.. మానవత్వం..

Apr 11,2024 05:30 #Festivals, #Sneha, #Stories

పండుగ అది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్‌ త్యాగం, శాంతి, సహనం, నిబద్ధతతో ఉండాలని సందేశం ఇస్తుంది. రంజాన్‌ పండుగ అనగానే అందరి మనసుల్లో మెదిలేది ముస్లిం సోదరుల ఉపవాసాలు, ఘుమఘుమలాడే బిర్యానీ, హలీమ్‌, షీర్‌ కుర్మా. ఇవన్నీ పోషకాహారమే. పండుగ దగ్గరపడుతున్న కొద్దీ దూరంగా ఉన్న బంధువులు ఇళ్లకు వస్తారు. ఒకరికొకరం అన్నట్లు కలిసి పండుగ చేసుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగ విశిష్టత గురించి ప్రత్యేక కథనం…

పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయి. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్‌లో తొమ్మిదవ నెల అయిన ‘రమదాన్‌’లో ముస్లింల పవిత్ర గ్రంథం ఖురానును అల్లాV్‌ా ముహమ్మద్‌ ప్రవక్త రచించారు. ముస్లింలు చంద్రమాన కేలండర్‌ను అనుసరిస్తారు. రంజాన్‌ మాసంలోనే జరుపుకునే ఈ పండుగకు మరో పేరు ‘ఈద్‌ ఉల్‌ ఫిత్ర’. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘రంజాన్‌’ మాసం విశిష్టత.
ఈ నెలంతా ముస్లింలు విధిగా ఉపవాసాలు ఆచరిస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందు నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకూ ఈ దీక్ష ఉంటుంది. ఈ సమయంలో పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా నిష్టగా ఉంటారు. ఉపవాసకాలంలో వారు రెండు సార్లు ఆహారాన్ని స్వీకరిస్తారు. వాటిని సుహూర్‌, ఇఫ్తార్‌గా పిలుస్తారు. ఇఫ్తార్‌ అనేది సూర్యాస్తమయం తర్వాత తీసుకునే ఆహారం. సుహూర్‌ అంటే తెల్లవారుజామున తీసుకునే ఆహారం.
ప్రపంచవ్యాప్తంగా ఉపవాస సమయాల్లో వ్యత్యాసం ఉంటుంది. దక్షిణార్థ గోళంలో సూర్యుని వంపు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటంలో ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ సమయం ఉపవాసం పాటించాల్సి ఉంటుంది. రంజాన్‌ నెల ముగుస్తూనే ‘షవ్వాల్‌’ నెలవంక ప్రత్యక్షమవుతుంది. దాంతో ముస్లిం సోదరులు ఉపవాస వ్రతాన్ని విరమించి, మరుసటి రోజు ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పండుగను భక్తిశ్రద్ధలతో సంతోషానందాలతో జరుపుకుంటారు. ఆ రోజు సాయంత్రం తమ కుటుంబ సభ్యులను,బంధువులను పిలుచుకుని ఇఫ్తార్‌ విందు ఆరగిస్తారు. అంతేగాదు ఈ మాసంలో దాన ధర్మాలు, పేదలకు ఆహారం అందించడం వంటివి తప్పక చేస్తారు.

ఇఫ్తార్‌ విందు
కుల, మత భేదాలు లేకుండా పేద, ధనిక అనే తారతమ్యాలు చూడకుండా అందరూ కలిసిమెలసి ఉండాలని కోరుకుంటూ రంజాన్‌ రోజు ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారు. ఈద్గాలో బారులు తీరి, నమాజు చేస్తారు. కొత్త వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలతో ఆ ప్రాంతం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇతర మతస్తులు ఎదురైనా ఒకరినొకరు సహృదయాలతో, సద్భావనలతో ఆలింగనం చేసుకుంటారు. ప్రత్యేకంగా సేమ్యాతో చేసిన ఖీర్‌ ఒకరికొకరు తినిపించుకుంటారు. ఆ రోజు ముస్లింలే కాక ముస్లిమేతర సోదరులు కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మతంతో సంబంధం లేకుండా ఇంటికి పిలిచి బిర్యానీ, మటన్‌, చికెన్‌ చేసి ఇఫ్తార్‌ విందు ఇస్తారు. మానవుల మధ్య నెలకొన్న వైషమ్యాలు తొలగి, అందరూ సమానమనే భావన వాతావరణం కనిపిస్తుంది. ఒకరికొకరు ‘ఈద్‌ ముబారక్‌’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

హిందువుల భాగస్వామ్యం..
పండుగ సందర్భంగా ముస్లిం మహిళలు ఉదయాన్నే లేచి ప్రార్థనలు చేసి చికెన్‌, బిర్యానీ, మటన్‌ హలీమ్‌, ఖీర్‌ వండుతారు. తోటి హిందూ సోదరులకు పంచిపెడతారు. బాగా పరిచయం ఏర్పడిన కుటుంబాలైతే కొత్త బట్టలు కూడా పెట్టుకుంటారు. ఒక తల్లీబిడ్డల్లా కలిసి ఉండే హిందూ-ముస్లింల మధ్య మతతత్వ రాజకీయాలు ఈ మధ్యకాలంలో చిచ్చుపెడుతున్నాయి. భారత దేశం లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర దేశం. ఈ ప్రయాణంలో ఎందరో హిందూ-ముస్లిం సోదరులు, మహిళలు వీరోచితంగా పోరాడారు. వారికీ ఈ దేశంలో ఉండే హక్కు ఉంది. కానీ కొంతమంది రాజకీయనాయకులు హిందూ అనే ముసుగులో ముస్లిం చరిత్రను ప్రశ్నిస్తూ, నగరాలు, వీధులకు ముస్లిం పేర్లు లేకుండా చేశారు. పాఠాలను తిరిగి రాసేలా విద్యా వ్యవస్థ్థలను మార్చేస్తున్నారు. వీటన్నిటినీ తిప్పికొట్టే బాధ్యత భారతీయులందరిదీ. ‘హిందూ-ముస్లిం భాయి భాయి’ అంటూ నినదించిన స్వాతంత్య్ర ఉద్యమరోజులు గుర్తు చేసుకుంటూ రంజాన్‌ పండుగను ఆహ్వానిద్దాం. ఆస్వాదిద్దాం.

అందరూ రుచి చూసే..
రంజాన్‌ మాసం ఉపవాసదీక్షలతో పాటుగా కమ్మని పసందైన రుచులను తీసుకొస్తుంది. ఈ పండగ సందర్భంగా నగరాల్లో ప్రత్యేకంగా హలీమ్‌ దుకాణాలు ఏర్పాటు చేస్తారు. వీటిని రుచి చూసేందుకు ముస్లిములే కాకుండా మిగిలిన మతాల వారూ ఆసక్తి కనబరుస్తారు. సాయంత్రం వేళల్లోనే లభించే ఈ హలీమ్‌ రుచులను ఆస్వాదించడానికి దుకాణాల ముందు బారులు తీరతారు.

➡️