డేటా గోప్యత… ప్రభుత్వాల బాధ్యత

Jan 28,2024 07:36 #Data Privacy, #Social Media, #Stories
Data privacy...is the responsibility of governments

ఓ సాయంత్రం వేళ ఇద్దరు స్నేహితులు కాఫీకేఫ్‌ ముందు కూర్చుని పొగలుకక్కుతున్న కాఫీ మెల్లగా సిప్‌ చేస్తున్నారు. చల్లటిగాలి శరీరాన్ని తాకుతూ.. వెచ్చని కాఫీ లోపలికి ప్రవహిస్తుంటే.. భలే వుంది కదా అన్నారు వారిలో ఒకరు. అవును.. నిజంగానే అదొక అనుభూతి. కానీ, చలి పెరుగుతోంది. మంచి స్వెట్టర్‌ కూడా తీసుకోవాలి. రేపు షాపింగ్‌ చేద్దామా.. అన్నారు ఇంకొకరు. ‘అలాగే కానీ.. ఇల్లు రిపేర్‌ చేయించాలి. ఏదైనా లోన్‌ అప్లరు చేయాలనుకుంటున్నా. ఎవరైనా తెలిసినవాళ్లు న్నారా..! చూద్దాం… నేనూ మా అమ్మాయిని ఎంబిఎలో చేర్పించాలి. మంచి కాలేజీ కోసం చూస్తున్నా… వారి సంభాషణ ఇలా దొర్లుతుండగా కాఫీ తాగడం పూర్తయింది. మరుసటి రోజున మొబైల్‌ ఓపెన్‌ చేయగానే… స్వెట్టర్ల యాడ్స్‌, రకరకాల కాఫీలు, కాఫీపొడికి సెలబ్రిటీలిచ్చే యాడ్స్‌ కనిపిస్తున్నాయి. ఇవాళేంటీ కొత్తగా ఈ యాడ్స్‌ కనిపిస్తున్నాయి అనుకుంటుండగానే, తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ కాల్‌. ‘మేము ఫలానా బ్యాంక్‌ నుంచి, మీకేమైనా లోన్‌ తీసుకునే ఆలోచన వుందా? మా బ్యాంక్‌ ఇప్పుడు తక్కువ వడ్డీకే లోన్స్‌ ఆఫర్‌ చేస్తోంది’ అంటూనే మీకు ఎంత రిక్వైర్‌మెంట్‌ వుంటుంది. మీరేం చేస్తుంటారు.. ఉద్యోగమా.. బిజినెసా.. మీ జీతం ఎంత.. వంటి ప్రశ్నలు ఒకటొకటిగా అడుగుతోంది కాల్‌ చేసినావిడ. సాయంత్రంలోపు మూడు బ్యాంక్‌ల నుంచి అలాంటి కాల్సే వచ్చాయి. ఆశ్యర్యమనిపించింది అతనికి. మరుసటిరోజు అదే కెఫే దగ్గర కాఫీ తాగుతూ ముగ్గురు మిత్రులు కలిశారు. తమకు ఆ రోజు వచ్చిన కాల్స్‌ గురించి ఇద్దరు మిత్రులు ప్రస్తావించారు. ఇదంతా వింటున్న మూడో ఫ్రెండ్‌… ‘అరే! ఇదంతా యాదృచ్ఛికం కాదురా బాబు. సాంకేతిక పరిజ్ఞానం మహిమ. నేటి డిజిటల్‌ యుగంలో దేనికీ ప్రైవసీ లేదు. మనం పిచ్చాపాటీ మాట్లాడుకునే మాటలు, ఫోన్‌ సంభాషణలు, సోషల్‌మీడియాలో మన యాక్టివిటీస్‌ అన్నీ కనిపెట్టే నిఘాయంత్రం మన మొబైల్‌, మనం వాడే ఇంటర్నెట్‌ వాడే ఇంటర్నెటర్‌’ అన్నాడు. దీంతో మిగతా ఇద్దరూ కంగుతిన్నారు. ‘ఔనా! ఇదెలా సాధ్యం’ అన్నారు ఒకింత ఆశ్చర్యంగా. నేటి డిజిటల్‌ యుగంలో దేనికీ ప్రైవసీ ఉండటం లేదు. అందుకే డేటా గోప్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేడు జరుపుకుంటున్న ‘డేటా ప్రైవసీ డే’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

ఔను. ఇదే నిజం. ఎవరేం చేసేది.. ఎక్కడికి వెళ్ళేది.. ఎవరితో ఏం మాట్లాడేది.. తినేది.. కొనేది.. సమస్తం, చివరకు భార్యాభర్తల మధ్య ఆంతరంగిక విషయాలతో సహా బట్టబయలైపోతున్నాయి. ఇదంతా మిస్టరీగా… ఒక సైన్స్‌ ఫిక్షన్‌ నవల్లాగ అనిపించినా నిజంగానే నిజం. మనం సాంకేతికత అనే ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్నాం. మన ప్రతి కదలికనూ గమనించి, బహిరంగపరిచే అతిపెద్ద శత్రువు మన జేబులో వుండే స్మార్ట్‌ఫోనే. అది మన ప్రతి కదలికను గమనిస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. ఇది చాలా రహస్యంగా ఉంది.. నాకే పరిమితం అనుకోడానికి లేదు.

తెలుసుకో..

నేడు డేటా గోప్యత అనేది చాలా ముఖ్యమైన అంశం. వివిధ కంపెనీలు, సంస్థలు సేకరించిన మన వ్యక్తిగత సమాచారం వివిధ రూపాల్లో షేర్‌ చేయబడుతుంది. దీంతో మన డేటా ఎలా ఉపయోగించబడుతోంది.. గోప్యతకు అవసరమైన చర్యలేంటి.. మన వ్యక్తిగత సమాచారం బట్టబయలు కాకుండా నియంత్రించడానికి మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయి.. లాంటివి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగం అనేది కొత్త కాన్సెప్ట్‌ కాదు. దశాబ్దాలుగా అనేక కంపెనీలు మార్కెటింగ్‌, ప్రకటనల నిమిత్తం డేటాను సేకరిస్తూనే వున్నాయి. అయితే, సాంకేతికత అభివృద్ధి చెందడంతో, డేటా సేకరణ మరింత అధునాతన, విస్తృత ప్రక్రియగా మారింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ నుండి సోషల్‌ మీడియా యాక్టివిటీ వరకు, మన వ్యక్తిగత సమాచారం నిరంతరం ట్రాక్‌ చేయబడుతోంది… విశ్లేషించబడుతోంది.

డేటా వినియోగానికి సంబంధించిన ప్రధాన ఆందోళనల్లో ఒకటి.. సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నారు.. అది ఎలా ఉపయోగించబడుతోంది.. ఎవరితో షేర్‌ చేయబడుతుంది అన్న విషయాలు తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. డేటా మన సమ్మతి లేకుండానే దుర్వినియోగం లేదా యాక్సెస్‌ చేయబడే అవకాశం వుండటమే దీనికి కారణం . ఇటీవల కోట్లాది మంది ప్రొఫైల్‌ డేటాల ఉల్లంఘనలు, కుంభకోణాలు జరిగాయి. మిలియన్ల మంది వ్యక్తిగత సమాచారం బహిర్గతమై ఆయా వ్యక్తులను ప్రమాదంలో పడేసింది. డేటా గోప్యత మొత్తం సమాజంపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ల యుగంలో, వ్యక్తిగత డేటా లక్ష్యం ప్రకటనల కోసం మాత్రమే కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది.

‘డిజిటల్‌ లిటరసీ’పై అవగాహన

వ్యక్తిగత సమాచారంతో పెద్దపెద్ద స్కామ్‌లు జరుగుతున్నాయి. కనిపించే శత్రువుతో యుద్ధం చేయగలం గానీ, కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయాలి.. కానీ, మనం కాస్త శ్రద్ధగా గమనించగలిగితే… చాలా విషయాలు మన ముదుంటాయి. మన పిల్లలు పదోతరగతి పరీక్షలింకా రాయక మునుపే ప్రైవేట్‌ కాలేజీల నుంచి ఫోన్లు వస్తాయి. తాము అందించే కోర్సుల గురించి, ల్యాబ్‌ల గురించి గడగడా చెప్పేస్తారు. అంతేకాదు… ప్రెగెన్సీ దగ్గర నుంచి కాలేజీ సీట్ల వరకూ, ఇన్సూరెన్స్‌ల నుంచి ఆసుపత్రుల సౌకర్యాల వరకూ అనేక ఆఫర్లతో మనకు ఫోన్లు వస్తుంటాయి. వీటన్నింటిలోనూ మనం ఎక్కడకు వెళ్లినా వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిందే. చివరికి పేషెంట్లకు సంబంధించిన మెడికల్‌ హిస్టరీకి కూడా గోప్యత లేదు. కొంతకాలంగా ఏఐ రాజ్యమేలుతోంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు డేటా ప్రైవసీని ఎలా కాపాడుకోవాలన్నది ప్రశ్నగా మారింది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ‘డిజిటల్‌ లిటరసీ’పై అవగాహన కల్పించేదిశగా అడుగులు వేస్తున్నాయి. కంప్యూటర్‌ అక్షరాస్యతను పెంచుకోవడం ద్వారా డేటా ప్రైవసీపట్ల అవగాహనం పెంచుకోవచ్చని, తద్వారా వ్యక్తిగత సమాచారాన్ని చాలావరకూ కాపాడుకోగలుగుతామని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాదేదీ అమ్మకానికనర్హం…

‘ఈ కాలపు దొంగకి ఇంటి తాళాలు అక్కర్లేదు. చిన్న సమాచారం చాలు. ఇది ఇన్‌ఫర్మేషన్‌ ఏజ్‌… ఇక్కడ ఒక్కో ఇన్‌ఫర్మేషన్‌కు ఒక్కో రేటు వుంటుంది’ అని ఓ సినిమా డైలాగ్‌. అలాగే ఓ నిందితుడు గతేడాది దేశంలోని 135 కేటాగిరీలకు చెందిన సుమారు 66.9 కోట్లమంది వ్యక్తిగత డేటాను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. దీనిలో హైదరాబాద్‌కు చెందిన 56 లక్షల మంది, ఎపీకి చెందిన 2.10కోట్ల మంది వ్యక్తిగత సమాచారం వున్నట్లు గుర్తించారు. బైజుస్‌, వేదాంతు సంస్థలకు చెందిన విద్యార్థుల డేటా, 8 మెట్రో సిటీస్‌లోని 1.84 లక్షల మంది క్యాబ్‌ వినియోగదారులు, గుజరాత్‌ రాష్ట్రంతో పాటు మరో 6 సిటీస్‌లోని 4.5 లక్షల మంది ఉద్యోగుల జీతభత్యాల డేటాను అమ్మకానికి పెట్టారు. జీఎస్‌టీ, ఆర్టీఏ, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, పేటీఎం, ఫోన్‌పే, బిగ్‌ బాస్కెట్‌, బుక్‌మై షో, ఇన్‌స్టాగ్రామ్‌, జొమాటో, పాలసీ బజార్‌, అప్‌స్టాక్స్‌, పాన్‌కార్డ్‌ హౌల్డర్స్‌, 9వ తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థుల డేటా కూడా అమ్మేస్తున్నారు. నీట్‌ విద్యార్థులు, వారి పేరెంట్స్‌ అడ్రస్‌లు, ఉద్యోగులు, ఇన్సూరెన్స్‌ పాలసీదారుల డేటాతో పాటు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన డేటాను సైతం మార్కెటింగ్‌ చేస్తున్నారు. వీటితోపాటు నేషనల్‌, ఇంటర్నేషనల్‌ బ్యాంకులకు సంబంధించిన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, డాక్టర్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్స్‌, ట్రూ కాలర్‌, టెలికమ్‌, ట్రేడింగ్‌, స్టాక్‌ బ్రోకింగ్‌, కన్సల్టెన్సీ సర్వీసుల డేటా కూడా కోట్ల సంఖ్యలో ఉంది.

ఇది నిజం!

‘ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌.. తన సొంతగా అక్షరం ముక్క కూడా కంటెంట్‌ తయారుచేయదనే విషయం ఎంత మందికి తెలుసు? అత్యంత ప్రాచుర్యంలో వున్న అతి పెద్ద ట్యాక్సీ కంపెనీ ఊబర్‌కి సొంతంగా ఒక్క వాహనం కూడా లేదంటే నమ్మశక్యం కాదు కదా! అంతేకాదు… ప్రముఖ రిటైలర్‌ సంస్థ అలీబాబా దగ్గర వస్తువులేమీ వుండవు. టూరింగ్‌ వసతులు అందించే ఎయిర్‌బీఎన్‌బీకి సొంతగా ఎటువంటి హౌటల్స్‌ లేవు. కానీ, మన ఇష్టాలేమిటి? మన స్నేహితులెవరు? మన అభిరుచులేమిటి వంటి అనేక విషయాలు ఫేస్‌బుక్‌కి తెలుసు! మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం.. ఏ టైమ్‌కి వెళతాం.. ఏ టైమ్‌కి వస్తాం.. అనేది ఊబర్‌కి తెలుసు! మన షాపింగ్‌ అలవాట్లు.. మన ఆర్థిక స్థోమత.. అలీబాబా, అమెజాన్‌, ఫ్లిక్‌కార్ట్‌ వంటి సంస్థలకు తెలుసు! ఏ దూర ప్రాంతాలకు వెళ్తున్నామనేది ఎయిర్‌బీఎన్‌బీకి తెలుసు!’ అంటూ 2017లో సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీన్నిబట్టి మనందరికీ అర్థమవ్వాల్సింది ఏమిటంటే… వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఆధారంగానే ఈ సంస్థలన్నీ వ్యాపారం చేస్తున్నాయని. అంటే, గోప్యత అనేది ఇప్పుడెంత పెద్ద సమస్యగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

డేటా అంటే..

నేటి డిజిటల్‌ యుగంలో, డేటా విలువైన వస్తువుగా మారింది. వ్యాపారాలు, సంస్థలు వ్యక్తిగతీకరించిన సేవలను నిర్వహించడానికి, అందించడానికి డేటా సేకరణ అవసరం. అయినప్పటికీ, మన పేరు, చిరునామా, ఆర్థిక వివరాలు, ఆన్‌లైన్‌ కార్యకలాపాలు వంటి వ్యక్తిగత సమాచారం వివిధ సంస్థలచే నిరంతరం సేకరించబడుతుంది, నిల్వ చేయబడుతుంది. వ్యక్తిగతమైన, కుటుంబపరమైన సమాచారాన్నంతా ‘డేటా’ అని అనొచ్చు. మాటల నుంచి పాటల వరకూ, ఫోన్‌ నెంబర్స్‌ నుంచి రేడియో సిగల్స్‌ వరకూ.. టెక్స్ట్‌, ఆడియో, వీడియో, ఇమేజ్‌ వంటి వివిధ రూపాల్లోని ఏ సమాచారమైనా డేటానే. పుస్తకాలు, ప్రభుత్వ రికార్డుల్లో ఉండే సమాచారమంతా ఫిజికల్‌ డేటా కిందకు వస్తే, ఆన్‌లైన్‌లో నమోదు చేయబడుతున్న డేటా అంతా డిజిటల్‌ డేటా కిందకు వస్తుంది. భూములు, పరిశ్రమలు లాగానే డేటా కూడా ముఖ్యమైన ఆస్తిగా మారింది. అందుకనే డేటా సెంటర్లకు ప్రాముఖ్యత పెరిగింది. డేటాపై ఎవరికి ఆధిపత్యం ఉంటే వారి పైనే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఈ డేటా సెంటర్ల ద్వారా నడుస్తున్నది. ఇంతటి విలువైన డేటాను మన రాష్ట్ర ప్రభుత్వం అదానీ చేతిలో పెట్టింది. ఇంటర్నెట్‌ అభివృద్ధి క్రమంలో డేటాకు ప్రాముఖ్యత పెరిగింది. సోషల్‌ మీడియా ద్వారా అప్‌లోడ్‌ అయ్యే ప్రతి సమాచారం డేటా సెంటర్‌లో నిక్షిప్తమవుతుంది. ప్రభుత్వ సంస్థలు సేకరించే సమాచారం, సర్వే రిపోర్టులు, బ్యాంకులు, ఫైనాన్స్‌, ఆధార్‌ సమాచారం, ఓటరు కార్డుల వివరాలు, ఈ-కామర్స్‌, రేషన్‌, హెల్త్‌, పాన్‌కార్డులు, విద్య, వైద్య రికార్డుల సమాచారం… ఇలా అనేక రకాల సమాచారం డేటా రూపంలో నిక్షిప్తం అవుతుంది. డేటా సెంటర్లంటే అన్ని రకాల డేటాను భద్రపరిచే గోడౌన్ల వంటివి. ఇంటర్నెట్‌ ద్వారా అనుసంధానమయ్యే ఈ డేటా సెంటర్లు అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంటాయి.

ప్రైవసీ అంటే…

డేటా గోప్యత అనేది సున్నితమైన లేదా వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్‌ చేయకుండా, షేర్‌ చేయకుండా లేదా సమ్మతి లేకుండా ఉపయోగించకుండా రక్షించడాన్ని సూచిస్తుంది. ఇది మానవ ప్రాథమిక హక్కు. ఆ సమాచారాన్ని షేర్‌ చేయాలా? అక్కరలేదా? ఒకవేళ షేర్‌ చేయాలనుకుంటే… ఎవరికి చేయాలి అనేది వాళ్ల ఇష్టం. ప్రైవసీ అంటే ఇదే. ఎవరి వ్యక్తిగత విషయాలపై వాళ్లకు మాత్రమే హక్కు ఉండడం. అనుమతి లేకుండా వేరొకరి వ్యక్తిగత వివరాలు మరొకరికి షేర్‌ చేసినా, దొంగిలించినా అది ప్రైవసీని ఉల్లంఘించినట్లు అవుతుంది. డిజిటల్‌ ప్రైవసీ కూడా ఇలాంటిదే. ఆన్‌లైన్‌లో ఉండే పర్సనల్‌ డేటాపై ఆయా వినియోగదార్లకు మాత్రమే పూర్తి హక్కు ఉంటుంది. వాళ్ల అనుమతి లేకుండా ఎవరూ వాటిని యాక్సెస్‌ చేయకూడదు.

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు తమ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి డేటా గోప్యతా చట్టాలు రూపొందించాయి. ఉదాహరణకు, యూరోపియన్‌ యూనియన్‌లోని జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ (GDPR). యునైటెడ్‌ స్టేట్స్‌లోని కాలిఫోర్నియా కన్స్యూమర్‌ ప్రైవసీ యాక్ట్‌ (CCPA)… సంస్థలు వ్యక్తిగత డేటాను సేకరించడం, భద్రపరచడం, షేర్‌ చేయడం వంటివాటిపై ఖచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాయి. ఈ చట్టాల ప్రకారం సంస్థలు గాని, వ్యక్తులు గాని సేకరిస్తున్న డేటా ఎలాంటిది, అది ఎలా ఉపయోగించబడుతుందనేది సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలి. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే భారీ జరిమానాలు వుంటాయి.

ప్రైవసీ ఎందుకు..?

స్మార్ట్‌ఫోన్‌ జీవితంలో భాగమయ్యాక ప్రతి విషయానికీ దానిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యమైన డేటా అంతా మొబైల్‌లో సేవ్‌ చేయక తప్పట్లేదు. బ్యాంక్‌ వివరాలు, కాంటాక్ట్స్‌ లిస్ట్‌, ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన మెయిల్స్‌ అందులోనే ఉంటాయి. అయితే మొబైల్‌.. ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయ్యి పనిచేయడం వల్ల ఆ డేటా అంతా పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నట్టే. కాబట్టి ఎవరి డేటాను వాళ్లు సేఫ్‌గా ఉంచుకోవడం ముఖ్యం. సోషల్‌ మీడియా పోస్టులు, విజిట్‌ చేసిన వెబ్‌సైట్లు, ఐపీ అడ్రస్‌, కీవర్డ్‌ సెర్చ్‌, బ్రౌజర్లలోని కుకీలు, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌లు, మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ అయ్యే లొకేషన్‌ వంటి పలు యాక్టివిటీస్‌ను ట్రాక్‌ చేయడం ద్వారా ఆ వ్యక్తి అలవాట్లు, ఇష్టాలు, ఆలోచనా తీరు, లైఫ్‌స్టైల్‌, ఆదాయం, ఖర్చులు వంటి వివరాలన్నీ అంచనా వేయొచ్చు. మొబైల్‌ ఫోన్స్‌, యాప్స్‌ చేస్తున్న పని ఇదే. అయితే.. ఈ డేటాను తమ నుంచి సేకరిస్తున్నారన్న విషయం చాలామందికి తెలియదు. ఈ సమాచారాన్ని ఎవరు తీసుకుంటున్నారు? దేనికి ఉపయోగిస్తున్నారు? ఎందుకు ఉపయో గిస్తున్నారు? అనే విషయాలు అసలే తెలియదు. వ్యక్తుల డేటాను దొంగిలించే వాళ్లు ఆ డేటాతో ఏమైనా చేయొచ్చు. కాబట్టి వ్యక్తిగత గోప్యత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యం.

డేటా చోరీ..

వినియోగదారులు సెర్చ్‌ చేసే విషయాలు, షాపింగ్‌ చేసే వస్తువులు ఇలా ప్రతి యాక్టివిటీని ట్రాక్‌ చేయడం ద్వారా ముందుగా లాభపడేది అడ్వర్టైజ్‌మెంట్‌ కంపెనీలు. ఆన్‌లైన్‌ యాక్టివిటీస్‌ను ట్రాక్‌ చేయడం ద్వారా ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. టార్గెట్‌ కస్టమర్స్‌ ఎవరో ఈజీగా తెలిసిపోతుంది. అవసరం ఉన్నవాళ్లకు మాత్రమే అడ్వర్టైజ్‌మెంట్లు పంపే వీలుంటుంది. అయితే ఇది ఇక్కడితో ఆగదు. అడ్వర్టైజ్‌మెంట్‌ కంపెనీలకు చేరిన డేటా అక్కడి నుంచి మరొక కంపెనీకి చేరుతుంది. వాళ్లు ఉపయోగించుకున్నాక మరొకరికి. అలా ఒకరి వ్యక్తిగత డేటా ప్రపంచమంతా తిరుగుతుంది. పెద్ద పెద్ద సైబర్‌ స్కామ్‌లకు మోసాలకు ఈ డేటాయే ఆధారం. సైబర్‌ నేరగాళ్లు డేటాను కేటగిరీలుగా డివైడ్‌ చేసి రకరకాల స్కామ్‌కు పాల్పడుతుంటారు. లోన్‌ల కోసం వెదికేవారు, విదేశాల్లో జాబ్‌ ఆఫర్ల కోసం చూసేవారు, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేవారు ఎక్కువగా సైబర్‌ నేరగాళ్ల బారిన పడతారు. అంతేకాదు… తెలిసీ తెలియకుండా రకరకాల యాప్‌లను వాడటం కూడా ప్రమాదానికి దారితీస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ కంటే కూడా అందులోని యాప్‌లు మరింత ప్రమాదకారిగా వుంటాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో 4.2 కోట్ల మొబైల్‌ యాప్‌లుంటే అందులో కేవలం నాలుగైదు శాతం మాత్రమే సేఫ్‌ యాప్స్‌ అని గూగుల్‌ చెప్తోంది. ఈ యాప్‌ల వల్ల కూడా మన డేటా దొంగిలించబడుతుంది. కనుక, ఎవరి డేటాను వాళ్లు గోప్యంగా ఉంచుకుంటే సైబర్‌ మోసాల బారినుంచి బయటపడొచ్చు.

డేటా అతి పెద్ద వ్యాపారం..

డేటాను అమ్ముకోవడం, కొనుక్కోవడం అతి పెద్ద వ్యాపారంగా మారింది. మార్కెట్‌ అంచనాలు, ఎన్నికలలో ఓటింగ్‌ సరళి వంటి అంశాలు డేటా ద్వారానే గ్రహించి వ్యూహాలు రూపొందించు కుంటారు. 2014 ఎన్నికలకు ముందు కేంబ్రిడ్జి అనలిటికా ఫేస్‌బుక్‌ ద్వారా సేకరించిన సమాచారాన్ని మోడీ కొనుక్కొని ఎన్నికలకు ఉపయోగిం చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు భారతదేశంలో 138 కేంద్రాలలో 637 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన డేటా సెంటర్లున్నాయి. అందులో పశ్చిమ సుముద్ర తీరాల్లో ముంబయిలో 289 మెగావాట్ల సామర్ధ్యంతో (44 శాతం) డేటా సెంటర్లున్నాయి. తర్వాత బెంగళూరు, ఢిల్లీ, చెన్నై లలో ఉన్నాయి. కాగా, ప్రపంచంలో మనం 13వ స్థానంలో ఉన్నాం. అమెరికా మొదటి స్థానంలో, చైనా నాల్గవ స్థానంలో ఉన్నాయి. ప్రధానమైన చైనా డేటా సెంటర్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. మోడీ ఆప్తమిత్రుడైన ఇప్పుడు డేటాపైన కూడా అదానీ ఆధిపత్యం సాధిస్తే భారతదేశం భవిష్యత్తు అతని చేతుల్లోకి వెళ్ళిపోయినట్లే.

భారతదేశంలో డేటా రక్షణ చట్టం..

మన దేశంలో ఉన్న ఏకైక డేటా రక్షణ చట్టం.. ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం 2000 (ఐటీ చట్టం)’. దీని ప్రకారం- డేటా చౌర్యం జరిగితే రక్షణ కోసం ఉపయోగించే కొన్ని సెక్షన్లు… ఎ). సెక్షన్‌ 69 బి). సెక్షన్‌ 69ఎ సి). సెక్షన్‌ 69బి ఉన్నాయి. అయితే, ముందస్తుగా డేటా గోప్యతను రక్షించడానికి ఏ చట్టమూ లేదు.

థీమ్‌..

ఈ సంవత్సరం డేటా గోప్యతా వారం ‘మీ డేటాను నియంత్రించండి’ అనే థీమ్‌ను పురస్కరించుకుని అవగాహనా కార్యక్రమాలుంటాయి. ఆన్‌లైన్‌ ఉనికి -ఆసక్తులు, కొనుగోళ్లు -ప్రవర్తనల వివరాలతో సహా ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్‌లు, యాప్‌లు, కంపెనీలు సేకరించిన గణనీయమైన డేటాను ఉత్పత్తి చేస్తుంది.

ముగింపు

డేటా గోప్యత అనేది మన డిజిటల్‌ జీవితాల్లో కీలకమైన అంశం. ఇది మన వ్యక్తిగత సమాచారాన్ని తప్పుడు చేతుల్లోకి పోకుండా కాపాడుతుంది. మా డేటా సేకరణ, వినియోగంపై నియంత్రణ వుండాలి. నేడు సమాజానికి డేటా అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటివరకూ వ్యక్తిగత డేటాను హార్డ్‌డిస్కుల్లో భద్రపరచుకునే స్థితి నుండి క్లౌడ్‌లో నిక్షిప్తపరచుకునే వరకు గత పాతికేళ్ళలో పరిణామం చెందింది. క్లౌడ్‌ నిర్వహణకు అనేక డేటా సెంటర్ల మధ్య అనుసంధానం కీలకంగా మారింది. ఇది సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం. అందులోనూ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, దాని ఆధారంగా చాట్‌ జిపిటి లాంటి ప్రోగ్రాములు వచ్చిన తర్వాత డేటా మీదనే భవిష్యత్తు ఆధారపడిఉందని అర్ధమవుతుంది. డేటా ప్రజా సంక్షేమానికి, దేశాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. పేదరికాన్ని, అసమానతలను గుర్తించి సరిదిద్దవచ్చు. అత్యంత విలువైన ఈ డేటా దుర్వినియోగం కాకుండా కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ప్రపంచ అనుభవాన్ని బట్టి చూసినా… డేటాను నిక్షిప్తం చేసే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవడమే సురక్షితం.

 

  • రాజాబాబు కంచర్ల, 9490099231
➡️