నెత్తుటి సాల్లల్లో పూసేటి పువ్వులకై..

May 12,2024 11:13 #kavithalu, #Sneha

వాడు పట్టపగలే
రంగురంగుల పూలను తుంచి
గెలిచాననుకుంటున్న ప్రతిసారీ.. మేం
సింగిడి పూలమై సవాలు విసురుతున్నాం
వాడి చీకటి చెరువులో
విరిసే కమలాల చూసి
మురిసిపోతున్నపుడల్లా…
సువిశాల ఆకాశపు నదిలో
చుక్కల కలువలమై మెరిసి
వాడిని వెక్కిరిస్తూనే ఉన్నాం
వాడు ఎండమావులు చూపి
ఏలుదామనుకుంటే..
మేం సత్యవాక్కుల జల్లులమై కురిసి
వాడిని అడ్డుకుంటూనే ఉన్నాం
వాడికి వెర్రెత్తి
మత విల్లంబులు దూసిన ప్రతిసారీ
మేం రాజ్యంగపు రక్షణ కవచం తొడిగి
వాడిని ఎదురిస్తూనే ఉన్నాం
వాడెన్ని విద్వేషపు ముళ్ళైనా నాటనీ
అవి మా పాదాలను
చీల్చుతూ నెత్తురోడుతున్నా
ఈ మట్టి పొరల కిందున్న
త్యాగాల విత్తులు
మా నెత్తుటి సాళ్ళల్లో నాని
కొత్త ఆశలు మొలకలెత్తి
నేలనేలంతా రంగురంగుల
పూలవనమై విరిసేదాక
నెత్తురోడుతున్న మా పాదాలతో
నడుస్తూనే ఉంటాం
గాయమెంత వేధించనీగాక
లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగం
వర్ధిల్లాలని అరుస్తూనే ఉంటాం..!
ఎలుగెత్తి చాటుతూనే ఉంటాం…!!

  • దిలీప్‌.వి
➡️