కవిని నేను..

Mar 24,2024 09:00 #Poetry, #Sneha

తిమిరం కురిసిన రాతిరిని కరిగించే
లేలేత రవి కిరణాల నులివెచ్చని స్పర్శను నేను
అమాయకపు బాలల పొత్తములో ఒదిగిన
సుతి మెత్తని నెమలీకను నేను
విరిసిన అరవిందాల ఆకు పొత్తిళ్ల జారే
అంబువునే నేను
శరత్‌ జ్యోత్స్నా ధారలు గ్రోలిన
ధవళ వర్ణ చలువ రాతిని నేను
వడివడిగ దూకే జలపాతాల
సొగసైన నీటి తుంపరను నేను
ఎండా వానా ఏకమైన ఆకసాన
విరిసిన హరివిల్లునే నేను
పచ్చని పచ్చికబయళ్లలో అందగించిన
మెత్తని ఆరుద్ర పురుగునే నేను
విరితోటను గుభాళించే
పూబాలల తావినే నేను
మానవాళి మనుగడకై
బిరబిర సాగే మేఘ శకలాన్ని నేను
నెర్రెలు విచ్చిన ఇల గొంతును తడిపే
తొలకరి చినుకునే నేను
శిశిరానికి వీడ్కోలు పలికే ఎండుటాకునే నేను
వసంతాన్ని స్వాగతించే నవ పల్లవమే నేను
వికృతిని దర్శించని ప్రకృతినే నేను
అభ్యుదయం సిరాను అక్షరాల్లో గుమ్మరిస్తూ
కరుడు కట్టిన ఛాందసభావాలు వీడని
కవిని నేను!
కలాలను ఖండించే బలాన్ని నేను
పవిని నేను.. అలుపెరుగని కవిని నేను!

– లలితా వర్మ, 9949672671

➡️