నప్పే సినిమాలే చేస్తా..!

May 19,2024 08:31 #celebrities, #Sneha

హాస్యనటుడిగా నటించిన వ్యక్తి హీరోగా, అందులోనూ కథలో కీలకంగా చేసే పాత్రలో నటించడం అంటే సాహసంతో కూడుకున్నది. అంతేకాదు.. అన్ని కథలూ అందరికీ నప్పవు. అలాంటిది ధైర్యంగా తన పాత్రల విషయంలో జాగ్రత్త వహిస్తూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు సత్యం రాజేష్‌. ఇండిస్టీలో మంచి హాస్యనటులుగా గుర్తింపు పొందారు. ఇప్పుడు హీరోగా చేస్తూ తమ ప్రతిభ నిరూపించుకుంటున్నారు. హీరోలకు స్నేహితుడిగా, హాస్యనటుడిగా వందల సినిమాలు చేసిన తను ఇప్పుడు రెండు సినిమాల్లో హీరోగా నటించి, ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. ప్రేక్షకులు అదే విధంగా ఆదరించి, సినిమాలను విజయపథంలో నడిపించారు. ఈ సందర్భంగా రాజేష్‌ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

రాజేష్‌ అసలు పేరు రాజేష్‌బాబు. అతని స్వస్థలం విశాఖపట్నం. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రాజేంద్రప్రసాద్‌ టెలికాం ఉద్యోగి. అమ్మ మణికుమారి గృహిణి. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. నటుడు చిరంజీవి స్ఫూర్తితో సినిమాల్లో నటించాలనుకున్నారు. ఎంబీయే చదువుకున్నారు. వైజాగ్‌ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, అతనికి హైదరాబాదుకు బదిలీ అయ్యింది. దాంతో ఇండిస్టీలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. తరువాత సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్నారు.
సుమారు 350కి పైగా సినిమాల్లో నటించారు రాజేష్‌. ఉదరుకిరణ్‌ హీరోగా నటించిన ‘నీ స్నేహం’ రాజేష్‌ మొదటి సినిమా. ఈ సినిమాలో రాజేష్‌ హీరో స్నేహితుడిగా నటించాడు. రాజేష్‌ రెండో సినిమా నూతన దర్శకుడు సూర్యకిరణ్‌ దర్శకత్వంలో సుమంత్‌ నటించిన ‘సత్యం’. ఆ సినిమాలో తనది ప్రాముఖ్యమున్న హీరో స్నేహితుడి పాత్ర. మంచి విజయం సాధించడంతో ఆ సినిమా పేరునే తన పేరుకు కలిపి, సత్యం రాజేష్‌గా మార్చుకున్నాడు. ఆ సినిమాలో ‘పులిరాజాకు ఎయిడ్స్‌ వస్తుందా?!’ అనే డైలాగుతో ప్రాచుర్యం పొందాడు. తన పాత్రకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డుకు నామినేషన్‌తో సహా దాని ప్రతిపాదనలను గెలుచుకున్నారు. ఆ తర్వాత ”పోకిరి, స్వాగతం, ఆకాశ రామన్న, కృష్ణం వందే జగద్గురుం, క్షణం, మేడ మీద అబ్బాయి, జవాన్‌, జంబలకిడి” వంటి పేరొందిన చిత్రాల్లో రాజేష్‌ కీలక పాత్రలు పోషించి, గుర్తింపు సంపాదించారు. ”ఫిదా, పంబ, గీత గోవిందం, విశ్వామిత్ర, రాహువు..” ఇంకా 250కి పైగా చిత్రాల్లో మంచి హాస్యనటుడిగా నటించి, ప్రేక్షకుల మనసుకు దగ్గరయ్యారు. రాజేష్‌కు ”క్షణం” సినిమాతో సీరియస్‌ పోలీసు ఆఫీసురు పాత్రలో గుర్తింపు వచ్చింది. నిజానికి మొదట్లో ఈ పాత్రలో నటుడు సంపత్‌రాజ్‌ను నటింపజేయాలని అనుకున్నారు. కానీ చివరికి రాజేష్‌కు ఆ పాత్ర దక్కింది. ఇదే అతని జీవితానికి కీలక మలుపుగా మారింది. ఈ సినిమా తర్వాత రాజేష్‌కు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. త్రిష ప్రధాన పాత్రలో వచ్చిన ”నాయకి” సినిమాలో కథా నాయకుడిగా నటించారు.
ఇప్పుుడు ”పొలిమేర-2” చిత్రంతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు సత్యం రాజేష్‌. వై. యుగంధర్‌ దర్శకత్వంలో తాజాగా ”టెనెంట్‌” లో హీరోగా నటించారు. ఈ సందర్భంగా సత్యం రాజేష్‌ ‘ఆర్టిస్టుగా నా పరిమితులేమిటో నాకు తెలుసు. అందుకే కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తున్నాను. భారీ బడ్జెట్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమాలను కోరుకోవడం లేదు. మంచి పాయింట్‌ ఉన్న సినిమాలు చేయాలన్నదే నా కోరిక. ఎలాంటి అంచనాలు లేని సినిమాలు చేసినప్పుడే ఒత్తిడి లేకుండా కెరీర్‌లో నిలదొక్కుకుంటాం. ఈ చిత్రాన్ని మేము ఓటీటీ కోసమే ఓ చిన్న సినిమాలా రూపొందించాలని అనుకున్నాం. కానీ, వచ్చిన అవుట్‌పుట్‌ మేము అనుకున్న దానికన్నా బాగా రావడంతో థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నాం. ఇందులో నా పాత్రకు పెద్దగా సంభాషణలు ఉండవు. నా పాత్ర చూసి ప్రేక్షకులు సింపతీతో బయటకొస్తారు. ”మనం కుమ్మేస్తాం.. కొట్టేస్తాం..” అని మాటలు చెప్పే అలవాటు నాకు లేదు. నాకు బాగా నప్పే సినిమాలనే నేను చేస్తా. మంచి కథా బలమున్న చిత్రాలొస్తే హీరోగా చేస్తా. ప్రస్తుతం నేను ప్రధాన పాత్రలో ”స్ట్రీట్‌ ఫైట్‌” ”మిస్టర్‌ బచ్చన్‌”లో రవితేజకు మిత్రుడిగా నటిస్తున్నా. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి’. అని తన కెరియర్‌ గురించి చెప్పారు రాజేష్‌.

➡️