నీటి పొదుపు

Apr 16,2024 08:22 #kavithalu, #Sneha

రాము యనెడి బాలుడుండె
నీరు పారబోయుచుండె
నేలలోన యింకిపోయి
నీరు వ్యర్థము అగుచుండె

వారించెను అతని భ్రాత
దారిన పోయేటి తాత
అలా చేయవద్దనుచును
పలికించెను జనుల చేత

వారి మాటలు వినడాయె
మీదు మిగుల నవ్వుడాయె
తుంటరి చేష్టలు మానక
ఊరంతా తిరుగుడాయె!

ఎండ తిరుగ దాహమాయె
రాములోన తాపమాయె
నీటి కొరకు వెదకి వెదకి
అతడెంతో అలసిపోయె!

ఎండ చాల మండు చుండె
నీటిజాడ దొరకకుండె
సూర్య ప్రతాపమునకునూ
నీరంతా యింకు చుండె!

కోతులకూ బాతులకూ
పోతులకూ పీతలకూ
నీరెంతో ముఖ్యమాయె
చూడ అన్ని ప్రాణులకూ!

నల్లయొకటి రాము గాంచె
దాని చేత తిప్పి చూచె
బొట్టు బొట్టు నీరు రాగ
త్రాగ ప్రాణములును నిలిచె!

నీటి విలువ తెలిసి వచ్చె
నీరు పొదుపు చేయ మెచ్చె
పొదుపు చేయుచున్న వారు
రాము మనసునకును నచ్చె!

నీటి పొదుపును చేయండి
జనులందరు పూనుకొండి
అని రామును చాటి చెప్పె
తనలొ మార్పు వచ్చెనండి!

వేసవిలో నీటి కరువు
లేకుండా పెంచు తరువు
నీరు పొదుపు చేయకున్న
ప్రాణుల మనుగడే బరువు

– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, ధర్మపురి.
99085 54535.

➡️