పిట్టగోడ

Apr 7,2024 08:33 #Sneha, #Stories

ఎండల తరువాత చల్లటి సాయంకాలం వీచింది. ఆ రోజు, కోయిలలు, సూర్యుడి సన్నటి వెలుగులు, కమ్మటి వేప గాలులు, అప్పుడే పుడుతున్న చల్లగాలులు, కలిసి హుషారుగా ఆడుకుంటున్నాయి. వాటితో పాటు, పాతబడ్డ ఓ ఇంటి ముందరి పిట్టగోడపై, షీర్‌ కుర్మా డబ్బా పట్టుకుని కూర్చుని ఆస్వాదిస్తూ, ఎవరికోసమో ఎదురు చూస్తున్నాడు రెహ్మాన్‌. ఆ పిట్టగోడతో ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, కళ్ళుమూసుకున్నాడు.
ఆయసాల సంచులు మోస్తూ పరుగులు నడకల కలయికతో వచ్చాడు ఓ బుడ్డోడు. ‘హుం, ఎప్పటిలాగే లేటు, సరే రా కూర్చో అన్నాడు’, రెహ్మాన్‌. ‘ఒరేరు, ఈరోజయితే మా అమ్మకి అనుమానం వచ్చేసిందిరా తెలుసా, నీ స్నేహితులందరూ ఇంటికి వచ్చి ఉగాది పచ్చడి తినేశారు కదా, ఇంకెవరికి పట్టికెళుతున్నావు, అని అడిగితే ఏదో కవర్‌ చేసి వచ్చేశారా బాబు’ అన్నాడు పూజిత్‌.
‘అన్నట్టు పూజిత్‌, కొన్ని ఏళ్ళ తరువాత, ఇలా రహస్యంగా కాకుండా, ధైర్యంగా కలిసే రోజు ఒకటి వస్తుందంటావా?!’, అనడిగాడు రెహ్మాన్‌, తన స్నేహితుడి కేసి.. ఓ వంతు ప్రేమగా, రెండు వంతులు దిగులుగా చూస్తూ. ‘అన్నట్టు ఒక విషయం తెలుసా, మొన్న ఎవరో రేడియోలో భవిష్యవాణిలో చెప్పారు.. భవిష్యత్తులో ఇలా ఏమీ ఉండదటరా, అందరూ కలిసి మెలిసి ఉంటారట,’ అన్నాడు, పూజిత్‌ ఆకాశమంత ఆశ నిండిన కళ్ళతో.
‘అలా అయితే భలే ఉంటుంది కదా.. సరేగానీ ముందు మేరా ఉగాది పచ్చడి దేదోరే భరు’, అన్నాడు రెహ్మాన్‌. ‘ముందు నా షీర్‌ కుర్మ ఇవ్వు, దాని తరువాతే నేను నీకు పచ్చడి ఇస్తాను, మరే’, అన్నాడు పూజిత్‌.
అలా ప్రస్తుతంలోని బోలెడంత ప్రేమతో, భవిష్యత్తులోని ఇంకెంతో ఆశతో, పచ్చడి, షీర్‌కుర్మ పంచుకుని తింటూ, కాళ్ళూపు కుంటూ ఎన్నో ఊసులు చెప్పుకున్న ఆరోజు, గుర్తుకు వచ్చింది.
ఇంతలో ఎప్పటిలాగే ఉగాది పచ్చడి పట్టుకుని మళ్లీ ఆయాసపు మూటలతో వస్తున్న పూజిత్‌ని చూసి నవ్వుకుని, ‘ఒరేరు 20 ఏళ్ళు గడిచినా నువ్వేం మారలేదు రా, మళ్లీ లేటు. మొత్తానికి, మనం అక్కడ నుండి ఇంతదాకా వొచ్చేశాం చూసావా, నీ చిన్నప్పటి భవిష్యవాణి విషయం నిజమయ్యింది రోరు’ అన్నాడు రెహ్మాన్‌ గర్వంగా.
ఇద్దరూ కలిసి, విరబూసిన వేపపూతతో నిండివున్న చెట్టు కింద పిట్టగోడపై కూర్చుని, కాళ్ళూపుకుంటూ, చిన్ని నవ్వులు నవ్వుకుంటూ, తెగ అరిచేస్తున్న రెండు కోయిల.. పిచ్చుకలు, దేని వేర్లు ఏవో చెప్పలేనంత కలిసిపోయి ఉన్న ముళ్ళ చెట్టు, పూల చెట్టు, నన్ను వీడొద్దని అడగిన తెల్లటి పువ్వుపై వాలిన నీలపు సీతాకోచిలుక, విడిపోకుండా ముడేసుకుని అల్లుకుపోయిన జంట తీగలను, చూస్తూ కూర్చున్నారు.

– సాయి మల్లిక పులగుర్త
8008928587

➡️