ఎర్ర డబ్బా

Apr 21,2024 11:58 #mallikalu, #Sneha

అలా కళ్ళు మూసుకుని, నా చుట్టూ ఉన్న చల్లగాలిపై దృష్టి పెట్టాను. రకరకాల చోట్ల నుండి మధురంగా వినపడుతున్న పక్షుల ఉల్లాసపు కిలకిలలు, చల్లగాలికి మురిసిపోతూ ఊగుతున్న చెట్ల కొమ్మల చిటచిటలు, నా దెగ్గరికి వచ్చి వెళుతున్న అడుగుల శబ్దాలు. ఒక్కసారి పాతబడిన అందమైన గతంలోకి తీసుకువెళ్ళిపోయాయి.
ఎన్నో రకాల మనుషులు, స్నేహితుడికి సరదా విషయాలు చెప్తూ రాసే లేఖ, అమ్మానాన్నల ఆరోగ్యం కోసం రాసే లేఖ, ఎన్నో ఏళ్ల తరువాత తొలిప్రేమను తెలపాలని నిశ్చయించుకుని రాసిన లేఖ, వచ్చిన లేఖకి ప్రేమగా రాసిన బదులు లేఖ, అందరూ రాస్తున్నారని తను కూడా వచ్చీరాని మాటలతో, బోలెడన్ని తప్పులున్నా ప్రేమతో నిండి ఉన్న బుడ్డి లేఖ, ఉద్యోగం కోసం పట్నం వచ్చి అమ్మకి, ఇక డబ్బు సమస్య ఉండదని రాసిన హామీ లేఖ, కొత్త ప్రదేశాలు చూస్తూ ఆ విషయాలన్నీ వర్ణిస్తూ రాతల్లోనే చూపిస్తూ చెల్లికి రాసిన లేఖ. ఎన్నో రాతలు, ఎన్నో విషయాలు, ఎన్నో పనులు, ఎన్నో అందమైన అంగీకారాలు, కొన్ని కష్టమైన తిరస్కారాలు, మోసే నిర్విరామ బాధ్యత నాదే. నాకోసం వచ్చే ఆశతో నిండిన మనసులు, నాకోసం ఎదురుచూసే కళ్ళు, ఒకప్పటి గతంతో తృప్తి పడిపోతూ, రిటైర్మెంట్‌ తీసుకుంటాను అనుకున్నా. కానీ నా మనసు దానికి అంగీకరించలేదు. నన్ను ఆనందపడనివ్వలేదు. ఇక లేఖలు రాసి, పోస్టు బాక్సుల్లో వేసే రోజులు కావివి అని చెప్పినా వినట్లేదు.

ఇప్పుడే బయలుదేరడానికి తయారయ్యి, దాని బాధ్యతను రాత్రికి అప్పచెపుతూ వెళుతున్నట్టు ఉంది సాయంత్రం. అలా ఆయాసపు శ్వాస తీసుకుని, ఎరుపు నీలాల మిశ్రమంతో అందంగా ముస్తాబయ్యిన ఆకాశం వంక చూస్తూ ఉన్నా. ఈలోపు, పెద్ద రింగులు పెట్టుకుని వచ్చింది ఓ పెద్ద కళ్ళ పాప. ఆమె చూపులాంటి అందాన్ని చూసి ఎన్నాళ్ళయిందో, ఆమె లోతైన కళ్ళలో ఆతృత, కొంచెం సందేహం, బోలెడంత సిగ్గు కనపడుతున్నాయి. నేను పనిచేస్తున్నానో లేదో, అసలు వాడకంలో ఉన్నానో లేదో అన్నట్టు, పాతబడి, తుప్పు పట్టేసి ఉన్న నా ఎర్ర శరీరం కేసి చూసింది. పక్కనే ఉన్న కిరాణా కొట్టతన్ని అడిగితే, ‘ఉత్తరాన్ని వేసేయండి, పని చేస్తుంది’ అని చెప్పాడు ఆమెతో. నాలో ఉత్తరం వేస్తోందని అర్థమై, తన చెయ్యికి కుదిరినంత దగ్గరగా వెళ్ళి, నా చెయ్యి చాచాను.

ఆమె అటూ ఇటూ చూసి, రెండు సెకన్లు ఆలోచించి, నాలో ఒక ఉత్తరం వేసి, ఎండిపోయిన నాకు బోలెడంత జీవం పోసింది. తన కళ్ళలో భావోద్వేగాన్ని బట్టి, తను రాసినది ప్రేమలేఖ అని అర్థమైంది. ఆమెకి నిజంగా నా ఫీలింగ్స్‌ అర్థమయ్యినట్టు, ఆమె నాకేసి చిన్న నవ్వు ఇచ్చి, నా తలపై మృదువుగా తడిమి వెళ్ళింది. నాకెందుకో అది, Oh dear, you are doing a great job, keep up your hope, days are definitely going to change. Stretch your arms and get ready for your job, as you are gonna see many and more precious letters, love, feelings filled with warmth, eyes searching for you, souls waiting for you, coming your way అన్నట్టు అనిపించింది. మీరేం దిగులు పడకండి, ఈ సందేశాన్ని ప్రతి అక్షరంలో ఉన్న మీ అమూల్యమైన భావోద్వేగంతో సరిగ్గా చేర్చే పూచీ నాది. దానికి వచ్చే బదులుకై మీరు వేచి చూస్తూ ఉండండి, అని నా పాత శరీరానికి వచ్చిన కొత్త మెరుపుతో, రెక్కలు దులుపుకుని పనికి తయారయ్యి, ‘దాన్నీ వీలయినంత త్వరగా, ఇంకెన్నో రెట్లు ప్రేమగా తెచ్చేస్తా’ అని హామీ ఇచ్చాను.

➡️