జీతం లక్ష

Jun 30,2024 08:54 #katha, #Sneha

రామనాథం, గురునాథం ఇద్దరూ సన్నకారు రైతులు. ఇద్దరి కొడుకులు, కూతుళ్లు మంచి స్నేహితులు. కలిసి పెరిగారు, కలిసే చదివారు. రామనాథం కొడుకు ప్రకాష్‌ డిగ్రీ అయిపోయి అమ్మానాన్నలకు తోడుగా వ్యవసాయం చేస్తూ పిజి సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. కూతురు గిరిజ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది గురునాథం కూతురు నీలిమ లాగే. ఒకరోజు పొలంగట్లమీద ఎదురుపడి అరకొర చదువులు చదివితే ఇలా ఊళ్లోనే ఉండిపోవాల్సి వస్తది. నా కొడుకు మోహన్‌ చూడు బిటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు వెంటనే క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఏదో ఒక జాబ్‌ తెచ్చుకుంటాడు అని గురునాథం ప్రకాష్‌ని తక్కువ చేసి మాట్లాడతాడు.
సాహిత్యం చదివే అలవాటు ఉన్న ప్రకాష్‌ ఏ కాస్త సున్నితత్వానికి లోనైనా ఆరోజు రాత్రంతా కూర్చొని మహనీయుల జీవిత చరిత్రలు తిరగేస్తుంటాడు. అలా చదివే అలవాటుతోనే జీవిత సారాంశం తెలిసింది కాబోలు.. గిరిజని, నీలిమని కూర్చోబెట్టి తను కూడా వాళ్లతో పాటు పీజీ కోసం బాగా ప్రయత్నిస్తాడు. అదే సమయంలో కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌ కూడా పాస్‌ కావడంతో ప్రకాష్‌ కానిస్టేబుల్‌గా, గిరిజ, నీలిమలిద్దరూ పీజీ చేస్తూ సిటీలో సెటిల్‌ అయ్యారు.
మోహన్‌ బిటెక్‌ అయిపోయిన తర్వాత జాబ్‌ లేకుండా ఇంటికి రావడం గురునాధానికి ఏమాత్రం నచ్చకపోవడంతో రెండు రోజుల్లోనే సిటీకి తిరిగి బయలుదేరతాడు. కన్సల్టెన్సీ సహాయంతో ప్రైవేట్‌ ఉద్యోగిగా దుబారు వెళ్తున్నానని సంవత్సరానికి 5 లక్షల జీతంతో జాబ్‌ దొరికిందని ముందు ముందు ఇంకా జీతం పెరుగుతుందని చెబుతాడు. సంతోషంగా సిటీలో ఉన్న చెల్లెలు నీలిమకు, ఊళ్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పి వెళ్ళిపోతాడు.
ప్రకాష్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం చేస్తూనే పీజీ పూర్తి చేయాలనే సంకల్పంతో దూర విద్యా విధానం ద్వారా ఎంఏ తెలుగు పూర్తి చేస్తాడు. స్టేషన్లో తోటి కానిస్టేబుల్స్‌, ఎస్సై వంటి వారు ఇతని సంతోషాన్ని పంచుకుంటారు. ఒకవైపు పోలీస్‌ వృత్తి, మరొకవైపు సాహిత్యం ఎలా కుదురుతుంది రెండింటికి.. అని ఎస్‌ఐ అన్న మాటలు ప్రకాష్‌ని ఆలోచింప చేస్తాయి.
గిరిజకు పీజీ మధ్యలో ఉండగానే బీఈడీలో ప్రవేశం దొరకడంతో టీచర్‌ ట్రైనింగ్‌ చేస్తుంది. నీలిమ మాత్రం పీజీనే కొనసాగిస్తుంది. గిరిజను చూసి తను కూడా టీచర్‌ వృత్తిలోకి వస్తే సాహితీ సేవలో ఉండొచ్చు, సాహిత్యాన్ని ఆదరించడానికి నాకు కాస్త సమయం దొరుకుతుందేమో అని ఆలోచించి దూర విద్యా విధానం ద్వారా బీఈడీ కూడా పూర్తి చేస్తాడు ప్రకాష్‌.
ఎన్నికల పుణ్యమా అని అదే సంవత్సరం నోటిఫికేషన్లు వెల్లువలా వచ్చి పడతాయి. ప్రకాష్‌తో సహా నీలిమ, గిరిజ వారి అర్హతకు తగ్గ ఉద్యోగ పరీక్షలు రాస్తారు. కానీ కాలం కలిసి రాక పరీక్షలు అన్నింటిపై కోర్టు స్టే ఇవ్వడంతో రామనాథం కూతురు వివాహం చేద్దామనే ఉద్దేశంతో గురునాథం దగ్గరకు వెళ్ళి మన పిల్లలకు కుండ మార్పిడి వివాహాలు చేద్దామా! దీని ద్వారా మన స్నేహ బంధాన్ని బంధుత్వంగా మార్చుకోవచ్చు అంటాడు.
నచ్చని గురునాథం నీ కూతురు టీచర్‌ చదువు చదివింది. నా కొడుకు దుబాయి ఇంజనీరు. పైగా నీ కొడుకు కానిస్టేబుల్‌ ఉద్యోగం కూడా చేసేలా కనపడట్లేదు. ఇంకా ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలిసింది. నా కూతురుకు ఇంజనీరు సంబంధం చూద్దామని అనుకుంటున్నా అని సమాధానం ఇవ్వడంతో మనసు నొచ్చుకున్నవాడై ఇంటికి తిరిగి వెళ్తాడు రామనాథం.
దుబారు నుంచి మోహన్‌ దసరా పండక్కని గ్రామానికి వస్తాడు. ప్రకాష్‌ని చూడగానే క్షేమ సమాచారాల భాగంలో ‘ఈ రెండేళ్లు జాబ్‌ బాగానే నడిచింది కానీ ప్రస్తుతం చేతిలో ఏ ప్రాజెక్టు లేక బెంచ్‌ మీద ఉన్నానురా. త్వరలోనే మన హైదరాబాద్‌కి వద్దామనుకుంటున్నాను’ అంటూ చెల్లెలు నీలిమ కనపడగానే లగేజ్‌తో ఇంటికి వెళతాడు మోహన్‌.
దసరా కానుకగా కోర్టు అన్ని ఎగ్జామ్స్‌కి సంబంధించి స్టే ఎత్తివేసి ఫలితాలను విడుదల చేయాలని చెప్పడంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది. తెల్లవారగానే న్యూస్‌ పేపర్‌లో ప్రకాష్‌కి లెక్చరర్‌ జాబ్‌ వచ్చినట్లు, గిరిజ టీచర్‌గా, నీలిమ జూనియర్‌ అసిస్టెంట్‌గా సెలెక్ట్‌ అయినట్లు రిజల్ట్స్‌ రావడంతో ఆ రెండు కుటుంబాలతో పాటు, గ్రామం అంతా సందడి వాతావరణం నెలకొన్నది.
ప్రకాష్‌ ప్రెస్‌ వాళ్ళతో పుస్తకం చదివే అలవాటు చేయించిన టీచర్లందరికీ ఈ నా లెక్చరర్‌ ఉద్యోగాన్ని అంకితం చేస్తున్నట్లు.. అలాగే కానిస్టేబుల్‌గా సమాజపు లోతుల్ని చూశానని.. ఆ అనుభవాలనన్నింటిని ఉపయోగించుకొని సమాజానికి హితవు
చేకూరేలా విద్యార్థులను తయారు చేస్తానని ఇంటర్వ్యూలో చెబుతాడు. ఈ సందర్భాన్ని మోహన్‌ పక్కనే ఉండి సంతోషంగా అనుభూతి చెందుతాడు.
గబగబా ఇంటికి వెళ్లి మన నీలిమని ప్రకాష్‌కి ఇచ్చి వివాహం చేద్దాం నాన్నా అనడంతో మోహన్‌ వాళ్ళ అమ్మ జరిగింది చెబుతుంది. అవును రా చెల్లిని నీలాగా ఇంజనీర్‌కి ఇచ్చి చేయాలనుంది. పెద్ద జీతం వస్తుందని అంటాడు గురునాథం.
బతకలేక బడిపంతులు అనేది ఒకప్పటి మాట నాన్న. కానీ ఒక ఐదు సంవత్సరాలు తిరిగేసరికి లక్ష రూపాయల జీతం తీసుకుంటాడు. స్థిరమైన జీవితంలో ఉంటాడు నాన్న ప్రకాష్‌. పైగా వాడి పట్టుదల, భావజాలం వింటుంటే ఇంకా పై చదువులు చదివి త్వరలోనే యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కూడా అవుతాడు అనిపిస్తుంది. అప్పుడు నేను పనికిరాను నాన్నా అంటూ.. అవును నా ఉద్యోగంలో అభద్రతాభావం ఎక్కువ. దానికి తోడు వేరే ఏ దేశంలోనో, ఏ రాష్ట్రంలోనో నా అన్న వాళ్ళని వదిలేసి, కన్న పిల్లల్ని ఒంటరిగా మేమే చూసుకుంటూ బ్రతకాలి. ఖర్చులు కూడా ఎక్కువే. అని సొంత ప్రదేశంలో చేసే ఉద్యోగానికీ, వారితో కలిసి జీవించే బతుకుకి ఉన్న విలువను తండ్రికి అర్థమయ్యేలా చెబుతాడు మోహన్‌.
పైగా.. కుండ మార్పిడి వివాహంతో ఏ విధంగా చూసినా మన కుటుంబానికి ఎక్కువ క్షేమం నాన్న. ప్రకాష్‌ జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో కాపురం ఉంటాడు కాబట్టి ఇరువురి పొలాలను మధ్యలో వచ్చి చూసుకోగలుగుతాడు. అనడంతో గురునాథం తన కొడుకు లోతైన ఆలోచనకు ముక్కు మీద వేలేసుకుంటాడు.
గురునాథం-రామనాథం దగ్గరికి వెళ్లి గత నెలలో నా ప్రవర్తనకు నన్ను మన్నించు. చిన్న మనసుతో ఆలోచించాను. ఇప్పుడు పెద్ద మనసు చేసుకొని మన స్నేహ బంధాన్ని వియ్యంకుల బంధంగా మార్చరా!. నీ పెంపకంలో నా కొడుకు చల్లగా ఉంటాడు అంటాడు మోహన్‌ వైపు చూస్తూ.. ఆ.. ఇంజనీర్లు తమ భార్యల్ని టీచర్‌ ఉద్యోగాలు చేయనీయరుగా అని గిరిజ అంటుంది. వెంటనే మోహన్‌, హమ్మ పంతులమ్మా! నీ జీతం తెలిసి కూడా చేయనీయనంటావా అని నవ్వుతాడు. అంటే జీతం కోసమేనా నాతో పెళ్లి అని గిరిజ కూడా మోహన్‌తో అనడంతో.. ప్రకాష్‌ తల్లి పెళ్లిళ్లు వద్దు కానీ రిసెప్షన్‌ డేట్‌ ఖాయం చేద్దాం.. అని గిరిజను మొట్టికాయ వేయడంతో అందరూ నవ్వుతారు.

– పి. మృదుల
70934 70828

➡️