సంగమ

Jan 14,2024 09:11 #Sneha, #Stories
sangamam

నటి సంగమ తన సోషల్‌ మీడియా ద్వారా త్వరలో రెండో పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పగానే వండర్‌ స్టార్‌ వినయ్ రాజ్‌ అభిమానులు వీరంగం సృష్టించారు.. మా అన్న భార్య మీరు! మరొక పెళ్లికి మేము ఒప్పుకోము అంటూ కోపంగా కొంతమంది.. పిల్లలు పెద్దవాళ్లయ్యాక ఇవ్వేం పనులు అంటూ కొంత మంది బూతులు తిట్టారు సోషల్‌ మీడియా ద్వారా.. సంగమ కూడా ఎక్కడా తగ్గ కుండా మీ అన్న రెండో పెళ్లి చేసుకుంటే తప్పు లేదు గానీ నేను చేసుకుంటే తప్పా అంటూ ఆ ఫ్యాన్స్‌ మీద ఫైర్‌ అయింది. ఫ్యాన్స్‌ సంగమ దిష్టి బొమ్మలు తగలపెట్టీ నీ పెళ్లికి మేము అంగీకరించము అంటూ వినయ్ రాజ్‌ అభిమానులు ర్యాలీలు చేశారు.

ఇది నా వ్యక్తిగత జీవితం. మీ హీరో నన్ను వదిలి వేసి పదేళ్లు అవ్తుంది. చిన్న పిల్లలతో రోడ్‌ మీదకి వస్తే మీ అభిమానం ఏమైంది? నాకు ఎవరైనా సాయం చేశారా? ఏదో చిన్న చిన్న సీరియల్‌ వేసి ఇద్దరు ఆడ పిల్లలును పెంచి పెద్ద వాళ్ళును చేశాను. నా జీవితంలో పడిన కష్టాలు మీకేం తెలుసు అంటూ విలపించింది సంగమ. కానీ ఆ ఫ్యాన్స్‌ మాత్రం వినే ఆలోచన లేకుండా మిమల్ని మరొకరి భార్యగా మేము తట్టుకోలేము వాడు ఎవడో తెలిస్తే కొడతాము అని హెచ్చరించారు. సంగమకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇదే అభిమానులు చేత ఆనాడు జేజేలు అందుకున్నాను. ఇప్పుడు ఇలా అంటూ గతం గుర్తు చేసుకుంది.

వండర్‌ స్టార్‌ వినయ్ రాజ్‌కి ఫ్లాప్‌లు నడుస్తున్న కాలం అది. ఫ్యాన్స్‌కి కావాల్సిన సినిమా అందించడంలో విఫలం అవుతుంటే ఈ సారి కుర్రాళ్ళు ఊగిపోవాలి ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. కానీ హీరోయిన్‌కి సమాన స్థాయిలో పాత్ర ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కథ కావడంతో ఒక కొత్త అమ్మాయిని తీసుకున్నారు. కానీ సగం సినిమా అయ్యాక ఆ హీరోయిన్‌ వెళ్లి పోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక పక్క ఫ్యాన్స్‌ ఎదురుచూపులు మరీ ఎక్కువయ్యాయి. తొందరగా తీయాలి అనే ఉద్దేశంతో సీరియల్‌ నటి సంగమను పెట్టి తీశారు. సినిమా విడుదలయ్యాక సంగమ నటనకు వినయ్ రాజ్‌ హీరోయిజంతోడవ్వడంతో సినిమా బంపర్‌ హిట్‌ కొట్టింది. అక్కడ నుండి దశ తిరిగింది సంగమకి. అమాంతం క్రేజ్‌ పెరిగింది. తర్వాత వీరితోనే మరో సినిమా వచ్చింది అది ఇంకా పెద్ద హిట్‌ అయింది. ఫ్యాన్స్‌ వీరిది హిట్‌ పెయిర్‌ అంటూ జేజేలు పలికారు ఎక్కడ చూసిన వీరి ఫోటోలు దర్శనం ఇచ్చాయి. ముచ్చటగా మూడో సినిమా హిట్‌ అవ్వడంతో మూడు ముళ్ళ బంధంగా దారి తీసింది. అభిమానుల కేరింతలు కోలాహలం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సంబరాలు, ఊరంతా కటౌట్లు. ‘వదిన రాక అన్న కేక’ అంటూ సంగమను దేవతతో పోల్చారు. సంవత్సరం తిరిగేసరికి పాప పుట్టింది. హీరో క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. రెండో పాప పుట్టే సరికి పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు.

తోటి హీరోలందరికీ మగ పిల్లలు ఉండడంతో వారసుడు లేరని సంగమ మీద చాలా కోపం పడేవాడు. మూడోసారి అబార్షన్‌ అవ్వడంతో వారసుడు ఆలోచన మరింత ఎక్కువ అయింది. నా తర్వాత నా వారసుడు ఉండాలి అనుకున్నాడు వినయ్ రాజ్‌. ఇంతలో ఒక పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్న సమయంలో ఒక సహాయనటితో చనువు ఏర్పడింది. అది చివరికి వారసుడు లోటును తీర్చింది. ఇది పెద్ద చర్చకు దారి తీయక ముందే సంగమతో విభేదాలు సృష్టించుకుని విడాకులు ఇచ్చేలా చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల్నీ తీసుకుని కష్టాలతో కొత్త జీవితం ప్రారంభించింది సంగమ. నటిగా అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి.

తల్లి పాత్రలు చేసుకుంటూ చిన్న చిన్న సీరియల్స్‌ చేసుకుంటూ రోజులు గడిచాయి. ఆడ పిల్లలు పెద్ద వాళ్లు అవ్వడం అవకాశాలు తక్కువ అవడంతో పెళ్లి చేసుకుంటే పిల్లల బాధ్యత కొంత తగ్గుతుంది అనే ఆలోచనతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయింది. పెళ్లి ప్రకటన వెనకకు తీసుకోవాలి అని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎక్కువయ్యాయి. ‘ఇది నా జీవితం’ అని సంగమ చెబుతున్నా ఆ ఫ్యాన్స్‌ వినే స్థాయిలో లేరు. ఇంటి మీద దాడులు, వికృత చేష్టలు చెయ్యడంతో పోలీసులు రాక తప్పలేదు. టీవీలో ఇది పెద్ద చర్చకు దారితీసింది. పెళ్లి చేసుకుంటే తప్పా. హీరోకి లేని చింత హీరోయిన్‌కి ఎందుకు అంటూ టీవీలో గంటల గంటలు వార్తాకథనాలు. ‘ఇంత జరుగుతున్నా హీరో ఎక్కడీ మానవత్వం లేదా?’ అంటూ డిబేట్‌లు జరిగాయి. చివరికి వినయ్ రాజ్‌ ఇది ఇక్కడతో ఆగిపోవాలి అనుకుని ఎవరికీ తెలియకుండా సంగమ ఇంటికి వెళ్ళాడు.

ఇంటిలోకి రాగానే పిల్లలు ఇద్దరూ డాడీ అంటూ పట్టుకుంటారని అనుకున్నాడు. అలా జరగకపోవడంతో నిరాశ చెందాడు. ‘సంగమా! చాలా ఏళ్లైంది నిన్ను చూసి’ అన్నాడు నవ్వుతూ..’మీరు చేసినపని వలన ఎల్లప్పుడూ గుర్తు వస్తూనే ఉంటారు’ అంటూ జవాబు ఇచ్చింది కొంచెం కోపంగా సంగమ.’నేనుండగా నువ్వు మరొక పెళ్లి చేసుకోవడం నాకే కాదు, నా ఫ్యాన్స్‌కి కూడా ఇష్టం లేదు’ అంటూ మరో మాట.

‘మీరు మరొక పెళ్లి చేసుకుంటే మీ ఫ్యాన్స్‌కి ఇష్టం,’ ఇద్దరి ఆడ పిల్లలుతో సహా బయటికి పంపిస్తే మీ ఫ్యాన్స్‌కి ఇష్టం. మగ పిల్లాడు కంటేనే మీ ఫ్యాన్స్‌కి ఇష్టం. కానీ నేను రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం అది భయంకర కష్టం. నేను ఒంటరిగా ఉన్న కాలంలో ఏనాడైనా వచ్చారా? పెళ్లి అంటేనే పరుగు పరుగున వచ్చారు. ఇది కూడా ఫ్యాన్స్‌ కోసమే! వారి ఆనందం కోసమే అంతే కదా వినయ్ రాజ్‌ గారు….’ ‘సంగమా! అసలు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నావు’ అన్నాడు.

చిరాకుగా ‘గౌరవం గురించి మీరు మాట్లాడకండి. వారసుడు కోసం నన్ను.. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అప్పుడు మీ గౌరవం ఏమైంది? అబార్షన్‌ అయి నేను చెప్పలేని బాధ అనుభవిస్తుంటే, మళ్ళీ ఎప్పుడు పిల్లలు కందాం! అని అన్నప్పుడు నేను పడిన క్షోభ అంతా ఇంతా కాదు..”అయితే ఇప్పుడేమంటావు సంగమా?”మీకు నాకు ఏ సంబంధం లేదు!”అలాగే మీ ఫ్యాన్స్‌కి నాకూ సంబంధం లేదు! నేను నా కోసం, నా పిల్లలు కోసం పెళ్లి చేసుకుంటాను అతను రీల్‌ హీరో కాకపోవచ్చు.. కానీ రియల్‌ హీరో తన ప్రేయసి చనిపోతే ఆమె పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నేనే చొరవ తీసుకుని పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాను. అతను సరే అన్నారు మంచి మనుసుతో.

‘వినయ్ అదంతా విన్నాక ‘నేను చెప్పేది విను బంగారం’ అంటూ సంగమ చేయి పట్టుకుని దగ్గరకి తీసుకొని ముద్దు పెట్టుకోవాలి అని చూశాడు. ఒకే ఒక్కటి లాగి పెట్టి, ఇచ్చింది. వినయ్ రాజ్‌ ఒకసారిగా భయపడ్డాడు.’నేను నీ సుఖం కోసం ఎదురు చూసానా? ఆ సుఖం కోసం పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూన్నావా?’ మరోసారి ఇలా అనుకుంటే ఇంటికి వచ్చి కొడతా నీ హీరోయిజం ఏదో నీ ఫ్యాన్స్‌ ముందు చూపించుకో. నేను సినిమాలో చూపించే నటిని మాత్రమే కాదు జీవితంలో అన్నీ తెలుసుకున్న శక్తిని’ అంటూ హెచ్చరించింది.ఆ మాటలతో వినయ్ రాజ్‌ బయల్దేరాడు. ఆ పక్కన పిల్లల కేరింతలు విన్పించాయి. కానీ ఏమీ చేయలేని స్థితిలో తల వంచుకున్నాడు. ఫ్యాన్స్‌ తిట్లు, శాపనార్థాల నడుమ నటి సంగమ వివాహం పిల్లల మధ్య ఘనంగా జరిగింది.

➡️