‘ క్రీడాభివృద్ధే.. ఆరోగ్యాభివృద్ధి..

May 5,2024 07:55

ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. సమర్ధవంతమైన ఆర్మీ, బలమైన ఆర్థికవ్యవస్థతోనే సాధ్యంకాదు.. క్రీడారంగంలో అభివృద్ధి కూడా ఆయా దేశాల అభివృద్ధికి ఒక కొలమానం. ప్రపంచంలో శక్తివంతమైన యువత తయారు కావాలంటే క్రీడలే ప్రధానం. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ బాల్యాన్ని ఈత, సైకిలింగ్‌, ఫుట్‌బాల్‌ తదితరాలను నేర్చుకోవడం ద్వారా ప్రారంభించేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. అందుకు కారణం.. ప్రస్తుత కాంక్రీట్‌ జంగిల్‌లో ఆటలాడుకునేందుకు స్థలం లేకపోవడం. ప్రభుత్వాలు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం. ఆటలు లేకుండా పిల్లలు కేవలం చదువుకే పరిమితమవ్వడం చాలా అనారోగ్యకరమైన స్థితి. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామం ప్రధానం. అందుకు ఆటలు ఎంతగానో తోడ్పడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఆటల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెల 7వ తేదీన ప్రపంచ అథ్లెటిక్స్‌ దినోత్సవం సందర్భంగా దీనిపైనే ప్రత్యేక కథనం..
 విజయ సాధనలో క్లిష్టమైన పయనం గమ్యం చేర్చడమే గాక, మధుర ఫలాలను అందిస్తుంది!’ అన్న వాక్యం భారతీయ క్రీడా వ్యవస్థకు అక్షరసత్యాలుగా వర్తిస్తుంది. ఏ దేశంలో యువత బలీయంగా, శారీరక శక్తిసామర్ధ్యాలతో ఎదుగుతారో, ఆ ప్రాంతం శాంతి సౌభాగ్యాలతో, ఆరోగ్యవంతమైన సమాజంతో పరిఢవిల్లుతుందని చరిత్ర చెప్పిన సత్యం. ‘పుట్టిన బిడ్డలు, దేశ సంపదగా భావించి, 18 సంవత్సరాలు వచ్చే వరకూ తమ ఆధీనంలోనే ఉంచుకుని, విద్యాబుద్ధులు నేర్పేవారు గ్రీకులు, స్పార్టన్లు. ఏ కుటుంబంలో జన్మించినప్పటికీ, ఆ బిడ్డ దేశ పౌరుడుగా ఎదిగే క్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో తీర్చిదిద్దేవారు. ఎదిగే క్రమంలో శారీరక, మానసిక క్రమశిక్షణ బాల్యం నుండే అలవర్చడమేగాక, మంచి పోషకాహారం అందించి, శారీరక బలాఢ్యులుగా పెంచేవారు. ఆనాటి సమాజంలోని రాజకీయ అవసరాలకు అనుగుణంగా, సైన్యానికి అవసరమైన రీతిలో యుద్ధ విద్యలు నేర్పేవారు. ప్రధానంగా కత్తిసాము, విలువిద్య, గుర్రపు స్వారీ, ఏనుగులపై నుండే యుద్ధం చేయడం, పద దళాల శక్తి కోసం పరుగులు, నదీనదాలు దాటడానికి, నౌకా యుద్ధాలకు అనుగుణంగా ఈత, అడవిలో వేటకు అనుగుణంగా బల్లెం విసరడంలాంటి విద్యలు నేర్పేవారు. ఇదే విధానం భారతీయ సంస్కృతిలో సైతం ఉంది.. అయితే ఈ విద్యలు కేవలం ఉన్నత వర్గ సంజాతులకు, ముఖ్యంగా రాజ వంశీయులకు నేర్పేవారు. వారికి సహచరులుగా, మిగిలిన వర్ణాల వారికి అవకాశాలు కల్పించేవారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతిలో ఎన్ని సంపదలున్నప్పటికీ ‘మానవ -సంపద’ ను మించినదేదీ లేదు. ఏ దేశమైతే తన మానవ వనరుల పట్ల శ్రద్ధాసక్తులు కనపరచి తన పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యాల పట్ల సంపూర్ణ దృష్టి కేంద్రీకరిస్తుందో, ఆ దేశం అభివృద్ధి చెందుతుంది.
తల్లి గర్భంలో పిండంగా ఉన్న నాటి నుండే ఈత నేర్చుకుంటాడు బిడ్డ.. తొలి శ్వాస నుండే, చేతులు, కాళ్ల కదలిక ఉంటుంది.. శరీరం పెరిగే క్రమంలో, నడక, పరుగు, చేతికి అందిన వస్తువును విసరడం ఇవన్నీ ప్రకృతే మానవాళికి ప్రసాదించింది.
ఆదిమ మానవుడు తన జీవనాధారంగా వేటను ఎంచుకున్నాడు.. ఆ క్రమంలో రాళ్లతో వేటాడడం, దూరంగా జంతువులను చంపడానికి బల్లెం విసరడం లాంటివి తన జీవికకై చేశాడు.. యుగాల పరిణామ క్రమంలో ఆధునిక మానవుడు అంతరిక్షాన్నే అధిరోహించాడు. మానవశక్తి మహోన్నతమైనదని నిరూపించాడు.

విద్యా, విజ్ఞాన సముపార్జనతో పాటు తన శారీరక దారుఢ్య పరీక్షలకై వివిధ పోటీలు ఏర్పాటు చేసుకున్నారు. అలా, ప్రపంచం అంతా పిలుచుకునే ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌ ‘అథ్లెటిక్స్‌గా ఆరంభమై, విశ్వ క్రీడలుగా మారాయి. ప్రపంచ మానవాళి మధ్య శాంతి, సౌహార్ద్ర భావాలను పెంచే సద్భావనతో వ్యాప్తి చెందాయి. ‘గెలుపు ఓటముల కన్నా, పాల్గొనడమే మిన్న’ అన్న నినాదంతో అంతర్జాతీయంగా పోటీలు జరుగుతున్నప్పటికీ, విశ్వ విజేతగా నిలవడానికి, విక్టరీ స్టాండ్‌పై తన జాతీయ గీతం వినడానికి ప్రతి అథ్లెట్‌, క్రీడాకారుడు కలగంటాడు. కృషి చేస్తాడు. అలా ఆశించనివాడు క్రీడాకారుడు కానేరడు.
ఈ నేపథ్యంలో భారతీయ క్రీడావ్యవస్థ తీరుతెన్నులు ఓసారి పరిశీలిద్దాం..! ఏం చేయగలమో యోచన చేద్దాం..!!
143 కోట్ల జనాభా! అయినా క్రీడారంగంలో, విశ్వ వేదికపై, మన ప్రభంజనం కొనసాగడం లేదు. ఎందుకని? కొన్ని ఆటలకు కోట్లాది రూపాయల వ్యయం, ఆ క్రీడాకారులకు, అపరిమిత ఆదాయం.. మరికొన్ని ఆటలలో పాల్గొనే క్రీడాకారులకు, కనీసం ప్రయాణపు భత్యం కూడా లభించడం లేదు ఎందువలన?

1900వ సంవత్సరంలో ప్యారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ‘నార్మన్‌ ప్రిట్‌చంద్‌ మెన్స్‌ 200 మీటర్ల పరుగులో భారతదేశానికి రజిత పతకం సాధించారు. 2024లో మరలా ప్యారిస్‌లోనే జరగబోతున్న వేసవి ఒలింపిక్స్‌ నాటికి అంటే 124 సంవత్సరాల వ్యవధిలో, మన దేశం కేవలం 35 మెడల్స్‌తోనే సంతృప్తి చెందడం ఏమిటి? అన్నీ ప్రాచీన భారతంలో ఉన్నాయనే వాదనతో ఏకీభవించే వారుగానీ, అన్నింటా అగ్రగామిగా, ఆధునికతతో ఎదగాలని ఆకాంక్షించేవారుగానీ, క్రీడారంగం పట్ల చిన్నచూపు ఎందుకు చూస్తున్నారు? తొలి శ్వాస నుండే మలి శ్వాస వరకూ తోడుండే తన శరీర శక్తి సామర్థ్యాలను పదును పెట్టుకోవడంలో వ్యక్తులు వైఫల్యం చెందుతున్నారా? వ్యవస్థ వైఫల్యం చెందుతుందా?
పురుషాధిక్య భావజాలమున్న మన దేశంలో క్రీడారంగంలో మహిళలు ఏ విధంగా కృషి చేస్తున్నారు? విశ్వవేదికపై పతకాలతో మెరుస్తున్న మగువలు, దేశవాళీ క్రీడారంగంలో ఎలాంటి వివక్ష ఎదుర్కొంటున్నారు? అసలు మన దేశంలో క్రీడారంగం పటిష్టంగా ఉండకపోవడానికి కారణాలు ఏమిటి? ఆలోచన చేసిన కొద్దీ, అన్నీ ప్రశ్నలే! సమాధానం దొరికినా, సమస్యను అధిగమించడానికి చిత్తశుద్ధి లేని రాజకీయరంగమా?
అతి త్వరలో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ఒక్క రాజకీయ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో క్రీడల ప్రస్తావన చేసిందా? ఎందుకు చేయలేదు? 1956లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 2014లో పునర్విభజన జరిగింది. 68 సంవత్సరాల చరిత్రగల రాష్ట్రంలో ప్రతి జిల్లాకో విశ్వవిద్యాలయముంది. కానీ, ప్రస్తుతం కోట్లాది జనాభా ఉన్న రాష్ట్రంలో ఒక్క క్రీడా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఏ ఒక్కరికీ కలగలేదు. ఎందుకని? ఒలింపిక్స్‌లో మెడల్స్‌ సాధిస్తే పోటీలు పడి కోట్ల రూపాయల నగదు బహుమానం, స్థలాల పంపిణీ, ఉద్యోగాల ఊరట ప్రభుత్వపరంగా, ప్రైవేటుగా, అమిత సంపాదన.. గెలిచిన తర్వాత బహుమానాల వరద తప్పా, గెలవడానికి బీజం ఏది? పునాది కట్టకుండా భవనం ఎలా ఏర్పడుతుంది?
నేనొక డాక్టర్‌, ఇంజనీర్‌, ఫలానా డిపార్ట్మెంట్‌లో ఉద్యోగిని అని సగర్వంగా చెప్పుకుంటున్న రీతిలో, నేనొక పూర్తికాలం క్రీడాకారుడ్ని, నాకు ఈ దేశంలో ఉజ్జ్వల భవిష్యత్తుంది అని ఎంత మంది ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతున్నారు? క్రీడల ద్వారా వివిధ డిపార్ట్‌మెంట్‌లలో ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులు, తదనంతర కాలంలో తమ రంగంలో అత్యున్నత స్థాయి క్రీడాకారులను ఎందుకు తయారుచేయలేకపోతున్నారు? ప్రతి రంగంలో ఆధిపత్యం చేయడానికో, తమను నడిపించడానికో నాయకులు, అధికారులను ఎంచుకునే అవకాశమున్న మన దేశంలో, క్రీడాకారులు తమ అసోసియేషన్‌ నడపడానికి నాయకులను ఎంచుకునే ప్రాథమిక హక్కును ఎందుకు పొందలేకపోతున్నారు? మేధో మధనంలో మొదలు తప్ప, తుదిలేని ప్రశ్నలు.

నేటి యువత గమ్యం ఎటు?
ప్రపంచీకరణ నేపథ్యంలో తమ మేధస్సుకు అనుగుణంగానో, అవకాశాల ఆధారంగానో, ఆర్థిక సుస్థిరత కోసమో, గత అర్ధ శతాబ్దకాలంలో భారతీయ యువత సముద్రాలు దాటేస్తున్నారు. విద్య, ఉపాధి మెరుగ్గా ఉన్న సమాజంలో ద్వితీయశ్రేణి పౌరులుగా సైతం బతకడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో సర్టిఫికెట్‌పై అచ్చయ్యే మార్కులు, గ్రేడులకే ప్రాధాన్యత.. అందుకే అందరి చూపులు. ఆ పట్టావైపే తప్పా, పదికాలాల పాటు పనిచేయడానికి కావలసిన దేహదారుఢ్యం వైపుండటం లేదు. దీనికి ప్రధానకారణం, వ్యాయామ విద్య జాతీయ విద్యావిధానంలో నామమాత్రంగానే ఉండటం.
మనదేశంలో ప్రి నర్సరీలు.. నర్సరీలుంటాయి. ప్రైమరీ పాఠశాలలుంటాయి.. కానీ ఆ స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులుండరు. శరీరం ఎదిగే క్రమంలో విద్యార్థికి సహజమైన ప్రతిభ ఏ రంగంలో ఉందో తెలుసుకునే అవకాశం లేదు. తల్లిదండ్రులకున్న వ్యక్తిగత ఆసక్తో, లేదా ఆ ప్రాంతంలో ఉన్న అవకాశాలను వినియోగించుకునే వారు మాత్రమే క్రీడలవైపు కన్నేస్తున్నారు. ఇటీవల కొన్ని రాజకీయపార్టీలు సైతం తమ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాలను చిన్న చిన్న ఆటస్థలాలుగా మారుస్తూ, వాటిపై ఎటు చూసినా, మానవ మస్తిష్కంలో ముద్ర వేసే రీతిగా వారి పార్టీ గుర్తులతో నింపేస్తున్నారు.. పెద్దవారు తప్పా, పిల్లలు అడుగుపెట్టరు. పెట్టాలనుకున్నా, రాజకీయ విభేదాలు.. కొద్దో గొప్పో ప్రభుత్వ పబ్లిక్‌ పార్కులున్నా, సదుపాయాలు కలుగజేసినా, శిక్షణ ఇవ్వడానికి సిబ్బంది ఉండరు.. తద్వారా ప్రజా ప్రయోజనం నెరవేరడం లేదు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. వెలుస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీలలో, టెర్రస్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉంటున్నాయి. సమయాల సద్వినియోగం, మెయింటినెన్స్‌ వ్యవహారాలు కొద్దిమంది చేతిలోనే ఉండి, బలమున్న వాడిదే, వైభోగం.
ఉన్నత విద్యా పాఠశాలల్లో ప్రతి 200 మందికి ఒక వ్యాయామ ఉపాధ్యాయుడుండాలి. కనీసం ఆటస్థలం ఉండాలన్న నిబంధనలు ప్రభుత్వం విధించింది. కానీ రికగ్నిషన్‌ ఇచ్చే సమయంలో తాము పెట్టిన నిబంధనలను తానే అతిక్రమిస్తుందన్నది సుస్పష్టం. కొందరు ‘అతి’ మేనేజ్‌మెంట్‌ వాళ్లు నిబంధనలకు అనుగుణంగా ఒక పాఠశాల చూపించి, అదే బోర్డుతో అపార్ట్‌మెంట్లలో సైతం విద్యాలయాలు నడిపేస్తున్నారు.
ఇవన్నీ తెలిసి కూడా ప్రభుత్వం, అధికారులు నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నారు. ఈ తంతు వలన, ప్రైవేటురంగ విద్యాసంస్థలలో చిన్నారులు వ్యాయామవిద్యకు దూరమవుతున్నారు. కానీ కొన్ని దేశాలు ఉదాహరణకు క్యూబా, ఫిన్‌లాండ్‌, చైనా లాంటి దేశాలలో అత్యంత పసిప్రాయం నుండే శిక్షణ ఇస్తున్నారు. 12 సంవత్సరాల ప్రాయం నాటికి, వారు ఏ క్రీడలకు పనికివస్తారో తెలుస్తుంది. ల్యాబ్‌లలో పరిశోధన వలన వారి కండరాలు ఏ ఆటలకు పనికి వస్తాయో, నిర్ధారణ అవుతుంది. అంటే శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, మానవ దేహాలను, క్రీడలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో బిడ్డల బాధ్యత సంపూర్ణంగా ప్రభుత్వమే తీసుకుంటుంది.
మనదేశంలో కూడా ప్రభుత్వ నిర్వహణలో కొన్ని సెంటర్లున్నాయి. శిక్షకులున్నారు.. కానీ తేడా ఏమిటంటే ఆయా దేశాల్లో 100 శాతం జవాబుదారీతనం ప్రభుత్వం తీసుకుంటుంది. మనదేశంలో అత్యంత పరిమితంగా ఉంది. అంటే అవకాశాలు అందరికీ సమానంగా అందడం లేదు.
కనీసం జిల్లాకు ఒక్క క్రీడా పాఠశాలగానీ, వ్యాయామానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మిలటరీ స్కూల్స్‌ గానీ లేవు. మన ఆంధ్ర రాష్ట్రంలో రెండే సైనిక్‌ పాఠశాలలున్నాయి.. ‘ఉక్కు కండరాల యువతను తనకివ్వమంటాడు’ వివేకానందుడు.. కానీ నేటి యువత ఎ.సి. జిమ్నాజియంలలో చెమటలు కక్కుతుంది.

అంచెలంచెలుగా క్రీడావ్యవస్థ..
స్కూల్‌, కాలేజీ, యూనివర్శిటీలలో చదువుకుంటున్న విద్యార్థులు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నిర్వహించే పోటీలు.. 14 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 19 సంవత్సరాలలోపు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనడం.
చదువుతో నిమిత్తం లేకుండా, క్రీడా ప్రావీణ్యం ఉన్నవారు అసోసియేషన్లు / ఫెడరేషన్లు నిర్వహించే పోటీలలో అంచెలంచెలుగా పాల్గొంటూ అంతర్జాతీయ వేదికలపై ఆడటం.
జూనియర్‌ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో విశ్వవిద్యాలయాలలో వ్యాయామ విద్యకు నిర్దేశిత పాఠ్య ప్రణాళికగానీ, సమయంగానీ ఉండవు. ఉదయం, సాయంత్రం వ్యాయమోపాధ్యాయ సిబ్బంది తమ ఆసక్తితో అదనపు పనిగంటలు పనిచేస్తారు. కళాశాలలు నడిచే క్రమంలో విద్యార్థుల క్రమశిక్షణ పెంచాలి.. అంటే ఏ పనికి నిర్దేశించబడ్డారో, ఆ పని జరగదు. ప్రధాన అస్తవ్యస్త వ్యవస్థ వలన ఇంటర్నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌లో సత్తా చాటలేకపోతున్నారు. డిగ్రీ స్థాయిలో పరిశీలన చేసినపుడు అంతర్‌ కళాశాలలు, అంతర్‌ విశ్వవిద్యాలయాల పోటీలతో పాటు అంతర్జాతీయంగా ‘వరల్డ్‌ యూనివర్సైడ్‌’ జరుగుతుంది.
ఏవిధంగా క్రీడాకారులు పోటీలలో పాల్గొన్నా, ఫలితం ఒక్కటే! అయితే, ఈ వ్యవస్థ సమస్తం లోపభూయిష్టం.
పౌష్టికాహారం నుండీ, ప్రాక్టీసుకు కావలసిన యూనిఫారం వరకూ నామమాత్రం లభిస్తుంది. కుల, మత, వర్గ రాజకీయ నేపథ్యం ప్రమేయం ఎంపికలో లేకుండా ఉండదు.
పోటీలకు సంబంధించి వార్షిక కాలెండర్‌ ముందస్తుగానే వస్తుంది. ఎంపికైన టీమ్‌లకు రవాణా సౌకర్యాలలో రాయితీ ఉంటుంది. కానీ, ప్రయాణాల సమయంలో రిజర్వేషన్‌ చేసుకునే సమయానికి, పోటీలకు మధ్య అత్యంత తక్కువ వ్యవధి వలన, ఎంత దూరపు ప్రయాణమైనా, సాధారణంగా జనరల్‌ బోగీలలో ప్రయాణం అవుతుంది. తద్వారా క్రీడాకారులు అలసిపోయి, పోటీలలో పాల్గొనే క్రమంలో అలసటకు లోనవుతారు. ఆర్థికంగా వనరులున్న వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారి పరిస్థితి అన్నివిధాలా మెరుగ్గా ఉంది.. అంతర్జాతీయంగా మెరుస్తున్నారు.. విశాల భారతదేశంలో నేటికీ సమగ్ర క్రీడా ప్రణాళిక లేకపోవడం వలన, అటు చదువు, ఇటు ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేని యువత వెనకబడుతున్నారు.. కేవలం క్రీడల్లో మాత్రమే గాదు..
ప్రభుత్వమే విక్రయిస్తున్న మత్తు పానీయాలకు, నార్కోటిక్‌ డిపార్ట్‌మెంట్‌ పనిచేస్తున్నప్పటికీ బానిసలవుతున్నారు. అంతేగాక శారీరక శ్రమకు తగినరీతిగా ఆటస్థలాలు లేకపోవడం, పదిమంది కలిసి గ్రామస్థాయి నుండీ – నగర స్థాయి వరకూ కచ్చితంగా ఆడుకునే వ్యవస్థ లేకపోవడం వలన, ఉచితంగా, సులభంగా లభిస్తున్న ఇంటర్నెట్‌ వలన, ఆన్‌లైన్‌ ఆటలకు అలవాటుపడటమే గాక, బెట్టింగ్‌లకు పాల్పడి, ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులకు లోనవుతున్నారు. తద్వారా కుటుంబాలకు ఆర్థిక సమస్యలతో పాటుగా సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతుందనడానికి ఉదాహరణ.. నిత్యం మనం చూస్తున్న అనేకానేక వింత మరియు జుగుప్స కలిగించే ఘటనలు, హత్యలు.. వీటన్నింటికీ మూలం యువతకు కావల్సినంత శారీరక శ్రమ ఆటస్థలం లభించకపోవడం.
ఈ అంతఃసూత్రాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా నూతన ప్రణాళికలు రచించుకుని యువతను సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు.. సభ్య సమాజం కోసం కృషి చేసే ప్రతి ఒక్కరిదీ!
భారతీయ క్రీడావ్యవస్థ బలోపేతం అవ్వాలంటే కొన్ని చర్యలు అనివార్యం! వాటికోసం ప్రభుత్వ కృషి, ప్రజల సహకారం, దాతల ఆర్థిక సహకారం అవసరమా? అంటే కొంతవరకు అవసరమే!
నిజాయితీగల క్రీడాపండితుల సారథ్యంలో ఒక కమిటీ నియమించి ‘మనిషికి ఒక రూపాయి విరాళం’గా దేశ జనాభా నుండీ స్వీకరించినట్లయితే కోట్ల మూలధనం ఏర్పడుతుంది.
ఒక్కో రాష్ట్రం ఒక్కటి లేదా రెండు క్రీడలను ఆయా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా దత్తత తీసుకుని, దేశవ్యాప్తంగా ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేయడం గాకుండా, పసిప్రాయం నుండీ పసిడి పతకాలు సాధించేవరకూ సంపూర్ణ బాధ్యత వహిస్తే ఫలితంగా కచ్చితంగా ఉంటుంది.
బతుకుతెరువు బాధల్లేని కుటుంబాలు ఆర్థిక సహకారం అందిస్తే నీరవ్‌ చోప్రాలు ఈ దేశంలో పుడతారు.. పతకం గెలిస్తే ఫలం వెనక్కి ఇవ్వగలుగుతారు లేకుంటే ధనికులకు పోయేదేముంది?
ప్రతి గ్రామం, మండలం, కనీసం ఒక విశాల ఆటస్థలం అభివృద్ధి చేసుకోగలగాలి.. ప్రజా విరాళాలతో పాటుగా శ్రమదానం సైతం అవసరం. జిల్లాలోని మెరికలందరినీ ఒకచోట చేర్చి, బాలికలకు వేరుగా, బాలురకు వేరుగా సైనిక స్కూళ్లను ఏర్పాటు చేయాలి. అవే స్పోర్ట్స్‌ స్కూళ్లుగా కూడా పనిచేస్తాయి.
ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం స్పోర్ట్స్‌ యూనివర్శిటీ ఏర్పరిచి, భారత దేశానికి తొలి పతకం సాధించిన శ్రీమతి కరణం మల్లీశ్వరిని వైస్‌ఛాన్సలర్‌గా నియమించినట్లు ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ఒక స్పోర్ట్స్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేసి, వివిధ కోర్సులను ఏర్పాటు చేయాలి.ఆవిర్భావం ఇలా..
ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎంపిక కాబడిన ఆటల్లో, క్రీడల్లో వ్యక్తిగతంగా, బృందాలుగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒలింపిక్స్‌ జరుగుతాయి. అయినప్పటికీ, ప్రాంతీయంగా ఉన్న ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, సుహృద్భావ వాతావరణం సమాజంలో కొనసాగడానికి, నాందిగా, 1996వ సంవత్సరంలో ఇంటర్నేషనల్‌ అమెచ్యూర్‌ అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులుగా ఉన్న, ”ప్రైమో నెబైలో” తన దార్శినికతలో ఏర్పాటు చేసినదే ”వరల్డ్‌ అథ్లెటిక్స్‌ డే” ప్రతి సంవత్సరం మే 7వ తేదీన ఒక ప్రత్యేక నినాదంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాలలో జరుగుతుంది.

ప్రభుత్వ తక్షణ కర్తవ్యం..
ఆంధ్రప్రదేశ్‌కి ”క్రీడా ప్రణాళిక”ను రచింపచేయడం. అత్యుత్తమ మరియు మన ప్రాంత అవసరాలు తీర్చే వాస్తవ రచనకు ఆహ్వానం పలికి మూడు ఉత్తమ ప్రణాళికలు – రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలకు కోటి రూపాయల చొప్పున, మూడు కోట్ల బహుమతి ప్రకటించాలి.
అన్నదానం, విద్యాదానంలాగా దాతలు క్రీడా పరికరాలు దానం ఇవ్వాలి. అప్పుడే సమాజంలో ఎంతో కొంత క్రీడా చైతన్యం కొనసాగుతుంది. ”ప్రపంచ అథ్లెటిక్స్‌ దినోత్సవం” సందర్భంగా మీరు కూడా క్రీడాంధ్రప్రదేశ్‌ను నిర్మాణం చేయండి. తద్వారా దేశ ఘనతను చాటే యువతను సమాజానికి బహుమానంగా ఇవ్వండి.
క్రీడావ్యవస్థ ప్రక్షాళనకు మీరు కూడా సహకరించండి..!

నాటి నుంచి స్త్రీలదే ప్రతిభ..
భారతీయ పురాణాలు పరిశీలించినపుడు వనితలు సైతం యుద్ధ విద్యలలో ప్రావీణ్యం సంపాదించేవారు. ఉదాహరణ సత్యభామ- నరకాసుర వధ; రాజ కుటుంబీకులు అనివార్యంగా నేర్చుకునేవారు. ఉదాహరణ రాణీ ఝాన్సీ లక్ష్మీభారు.. ఇలా ఎందరెందరో..!
వర్తమాన సమాజంలో సైతం ఎందరో వనితలు, క్రీడారంగంలో మనదేశ పతాకను అంతర్జాతీయంగా ఎగురవేశారు. కరణం మల్లీశ్వరి, సైనా నెహ్వాల్‌, మేరీకోమ్‌, పి.వి. సింధు, మీరాభారు ఛాను, పి.టి.ఉష, కె.కె.శోభ, కేవలం మచ్చుకు మాత్రమే. శిక్షణాకాల క్రమంలో స్త్రీ-పురుష తేడాలుండవు. వారు ఎంచుకున్న క్రీడలకు అనుగుణమైన ట్రైనింగ్‌ ఉంటుంది.

దృష్టికోణమే అన్నింటికీ మూలం..
ఇటీవల కాలంలో కనీవినీ ఎరుగని రీతిగా, కొందరు మహిళా క్రీడాకారిణులు లైంగిక వేధింపుల పట్ల నిరసన గళమెత్తారు. తమ ఘోషను నడిరోడ్లపై వినిపించారు. పోలీసుల లాఠీల రుచి చూసినా, దేశ పెద్దలు పట్టించుకోలేదు. దోషులకు శిక్ష లేదు. సమస్య ఎంత ఉధృతమైనప్పటికీ తన సత్తా చాటి 2024 ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో బెర్త్‌ సంపాదించింది. స్త్రీలో అమ్మతనం మరిచి, లైంగిక దృష్టితో చూసిన, వేధించిన అపర కీచకులకు ఆమె సాధించిన విజయమే అసలైన శిక్ష.. ఇలాంటి సందర్భాలలో.. దోషులు తాత్కాలికంగా తప్పించుకోవచ్చు. కానీ చరిత్ర చీకటి పుటలలో దోషులుగా మిగిలేది మాత్రం అగ్రనాయకత్వమే! నీ వెంట మేమున్నామంటూ నైతిక బలమిచ్చిన సభ్య సమాజానికి జేజేలు.. దోషుల వెంట నిలిచిన నీచులకు ఛీత్కారాలు..
ఇలాంటి సంఘటనలలో.. మహిళలు సైతం కన్నీరు కార్చుతూ మూలన ఉండిపోవలసిన అవసరం లేదు. ఆత్మరక్షణకై ఆయుధం పట్టడం తప్పుకాదని చట్టం చెబుతుంది.

మనదేశ ప్రత్యేకత..
మన దేశంలో క్రీడాసంఘాల, ఫెడరేషన్‌ల విషయంలో అధికారులు, ఎక్కడో ఒకచోట షెల్టర్‌ కోసం క్రీడాశాఖలను ఆశ్రయిస్తున్నారు.. తత్ఫలితంగా క్రీడల పట్ల నామమాత్ర వైఖరి కొనసాగుతుంది. అత్యల్ప బడ్జెట్‌ను కేటాయిస్తే వారు మాత్రం ఏం చేయగలరు?
తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ప్రజలకున్నప్పుడు, అసోసియేషన్‌ నాయకత్వాన్ని ఎన్నుకునే ”హక్కు” క్రీడాకారులకు ఎందుకుండగూడదు? జిల్లా స్థాయిలో జిల్లా క్రీడాకారులు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర క్రీడాకారులు, జాతీయ స్థాయిలో అప్పటికే అత్యుత్తమ ప్రతిభ ఆ రంగంలో కనబరచి, పతకాలు సాధించిన క్రీడాకారులను నాయకత్వంలో నిలబెడితే మూల సమస్యలు ఎరిగిన క్రీడా దిగ్గజాలు వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేస్తారు.

డాక్టర్‌ దుట్టా శమంతకమణి
94919 62638

➡️