వసంతం

May 12,2024 10:43 #katha, #Sneha

వసంత ఋతువులో సూర్యోదయం ఎంతో అద్భుతంగా వుంటుంది. చెట్లన్నీ లేత చిగుళ్లతో పూల పరిమళాలతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. వాటి నుంచి వీచే చల్లని గాలి మనసును ఉల్లాసపరుస్తుంది. పెరటిలోని మామిడి చెట్టు చిగుళ్లు ఆరగిస్తూ… కుహు కుహు అని మత్తుగా కూస్తున్న మత్తకోయిల గానం… గాఢ నిద్రలో వున్న రంగారావు చెవిలో గిలిగింతలు పెడుతోంది. రాత్రి తాగిన మత్తు ఇంకా వదల్లేదు. కోయిల అరుస్తూనే వుంది. అంత నిద్రమత్తులోనూ బలవంతానా కళ్లు విప్పి, కిటికీలోంచి పెరటిలోని మామిడి చెట్టు వైపు చూశాడు. చెట్టుపై సంగీత కచేరీ చేస్తున్నట్టుగా కోయిల కూస్తూనే వుంది. కోయిల మధురగాత్రాన్ని ఆస్వాదించడం రంగారావుకు చాలా ఇష్టం.
కోయిల గానం నుంచి మళ్లిన రంగారావు దృష్టి… మామిడి కొమ్మ వంచి, కాయలు కోస్తున్న రాధాదేవి మీద పడింది. తలస్నానం చేసి, ఆరబెడుతున్నట్లుగా వదిలేసిన జుట్టు… గాలికి మేఘాల్లా కదులుతోంది. సగానికి సగం వున్న తెల్లని వెంట్రుకలు వెండితీగల్లా మెరుస్తున్నాయి. పట్టుచీర కట్టు, ఒంటి రంగు ఆమెకు మరింత అందంగా అమరినట్లుంది. ముఖానికి పసుపు, నుదుటిన కుంకుమ బొట్టు… వయసు తెచ్చిన హుందాతనం, బిగితగ్గని శరీరసౌష్టవం తొలిపొద్దు కిరణాల వెలుగులో మెరిసిపోతోంది. ఆమెనలా చూస్తూనే వున్నాడు.
రెండు మామిడి కాయలు తెంపుకొని… వంటగదిలోకి వెళ్లింది.
రంగారావు మంచం దిగి…హాల్లోకి నడిచాడు. గుమ్మానికి ఆనుకుని ఆమెనే చూస్తున్నాడు.
‘ఉగాది పచ్చడి చేస్తుంది కాబోలు. ఎన్నాళ్లయిందో… ఈ ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకొని’ అనుకున్నాడు.
రంగారావుని గమనించిన రాధ… ‘ఏమిటలా చూస్తున్నారు?… నాకు సిగ్గేస్తుంది బాబూ…’ అంటూ చిన్నపిల్లలా సిగ్గుపడిపోయింది.
రంగారావుకు మరింత ముద్దుగా అనిపించింది. ‘బాపూ బొమ్మలా వుంటేనూ…’ అన్నాడు.
‘ఇంకా నయం… బాపూ గారు లేకుండా పోయారు గానీ, లేకపోతే… నా బొమ్మకు ఎంత గతి పట్టిందిరా అని వాపోయేవారు’ అంది కిలకిలా నవ్వుతూ…
‘ఇవాల్టి ఉగాది పండుగంతా మీలోనే కనిపిస్తుందండీ…’ అన్నాడు.
‘ఎన్నిసార్లు చెప్పాను మీకు… అండీ… అనొద్దనీ….ఆ…’
‘మీకూ అన్నిసార్లూ చెప్పాను కదండీ… మన పరిచయం నాటి నుంచీ పిలుస్తున్న పిలుపును… మధ్యలో ఎలా మార్చుకుంటాను….’
‘మీతో ఇప్పుడు వాదించేంత టైమ్‌ లేదు గానీ… త్వరగా స్నానం చేసి రండి మరి… మీరూ పండుగ చేసుకుందురు…’ అంటూ బెడ్‌రూమ్‌లోకి వచ్చి పడక సర్దుతోంది.
అటువైపు తిరిగి ఆమెనలా చూస్తూనే వున్నాడు రంగారావు.
‘ఈ సంతోషం శాశ్వతమైతే… బాగుండు…’ అనుకున్నాడు.
డాక్టర్‌ చెప్పింది గుర్తొచ్చింది.
‘మీ అతి తాగుడుతో ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. మానెయ్యడం మంచిది. లేదా కనీసం తగ్గించండి. కొంతకాలమైనా బతుకుతారు’ అన్న డాక్టర్‌ మాటలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.
రాధవైపు చూశాడు. నిండు ముత్తైదువులా ఒక పరిపూర్ణమైన స్త్రీని చూసినట్లు అనిపించింది. ఆమె ఇల్లంతా తిరుగుతోంటే… ఆ ఇంటికే నిండుదనం వచ్చినట్లు, కొత్త అందమేదో వచ్చినట్లుగా వుంది.
‘తనకు మళ్లీ వైధవ్యం ప్రాప్తించకూడదు. రాధ ఎప్పుడూ సంతోషంగా కళకళలాడుతూ వుండాలి’ అనుకున్నాడు.
స్నానం చేసి, పట్టు పంచె, లాల్చీ కట్టుకున్నాడు. కొత్తగా అనిపించింది రంగారావుకు.
రంగారావును అలా చూసి ముచ్చటపడింది రాధ.
రాధ దగ్గరకు వచ్చి, చాలా సున్నితంగా తన రెండు చెంపలకు చేతులు ఆన్చి, నుదుటిపై మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు.
‘రాధా… ఈ ఉగాది నిజంగా మన జీవితాలను వసంతమయం చేస్తుంది’ అన్నాడు ఉత్సాహంగా.
రాధ కళ్లలో మెరుపు… క్షణంలోనే ‘ఈ సంతోషం శాశ్వతమౌతుందా’ అన్న సంకోచం…
ఒక్కసారిగా గతం కళ్లముందు కదలాడింది.

సాయంత్రపు చల్లగాలి. చుట్టూ రకరకాల పూల మొక్కలు. పార్కు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. పొద్దంతా తన ప్రతాపం చూపిన సూర్యుడు… నెమ్మదిగా అస్తమిస్తున్నాడు.
వాకింగ్‌ తర్వాత అక్కడున్న సిమెంట్‌ బెంచ్‌ మీద కాసేపు కూర్చోడం రాధాదేవికి అలవాటు.
తాగి పడిపోయినట్లున్న ఓ వ్యక్తి ఆ బెంచి మీద అడ్డదిడ్డంగా పడివున్నాడు. ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. రాధ చేతిలో వున్న వాటర్‌ బాటిల్‌లోని నీళ్లు అతని ముఖంపై చల్లింది.
‘చదువు సంస్కారం వున్నవాడిలానే కనిపిస్తున్నాడు. పబ్లిక్‌గా ఈ తాగుడేమిటో’ అనుకుంది. కాసేపటికి అతను కొంత తేరుకున్నాడు.
తన దగ్గరున్న వాటర్‌ బాటిల్‌ ఇచ్చింది. తాగమన్నట్లుగా. రెండు గటకలు తాగి, ‘థ్యాంక్స్‌’ అన్నాడు.
‘పార్కులో రోజూ కనిపిస్తుంటాడు. ఎప్పుడూ డ్రింక్‌లోనే వున్నట్లు వుంటాడు గానీ… చాలా మర్యాదగా మాట్లాడతాడు’ అనుకుంటూ…బాటిల్‌ తీసుకుని, కూర్చోకుండానే ఇంటిదారి పట్టింది.
మరుసటి రోజున ‘సారీ అండీ… నిన్న కాస్త డ్రింక్‌ ఎక్కువైంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను’ అన్నాడు బెంచ్‌ మీద ఓ మూలగా కూర్చుంటూ… అప్పటికే వాకింగ్‌ పూర్తిచేసుకున్న రాధాదేవి ‘అదేం లేదు’ అంటూ మరికాస్త ఒదిగి కూర్చుంది.
‘పిల్లలు ఉద్యోగాలతో బిజీ… నేను మందుతో బిజీ. ఎవరి పనుల్లో వారున్నాం.
ఏదో వంటమనిషి కాస్త వండిపెడుతుంది. ఏదోక టైమ్‌కి తినడం, ఈ పార్కులో పచ్చని ప్రకృతి మధ్య గడపటం. మిగతా సమయంలో పుస్తకాలు చదవడం. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కాలక్షేపం. దాదాపు పదిహేనేళ్లుగా ఇదే నా జీవితం’… తన గురించి క్లుప్తంగా చెప్పాడు రంగారావు.
రోజూ సాయంత్రం పార్కులో కలవడం, గంటల తరబడి మాట్లాడుకోవడం. ‘అయ్యో చాలా సమయం అయింద’ని ఆవిడ హడావుడిగా వెళ్ళిపోవడం. ఆవిడ వెళ్లిన తర్వాత జేబులోంచి క్వాటర్‌ బాటిల్‌ తీసి తాగి, నెమ్మదిగా ఇంటిముఖం పట్టడం రంగారావు దినచర్య. ఈ పదిహేనేళ్లలో కొత్తగా వచ్చిన మార్పంటూ ఏదైనా వుందంటే, అది రాధతో కాలక్షేపం.
రోజులు గడిచేకొద్దీ… ఇద్దరూ వ్యక్తిగత విషయాలు పంచుకునేంత చనువు ఏర్పడింది. సరదాగా మాట్లాడుకోవడం నవ్వుకోవడం. తమ ఇష్టాఇష్టాల గురించి చెప్పుకోవడం… కష్టాలు కన్నీళ్లు పంచుకోవడం…
ఇద్దరికీ ఒకరికొకరు ఓదార్పు. ఎప్పుడైనా రాధ రాకపోతే రంగారావుకి చాలా వెలితిగా వుండేది. అతను ఎప్పుడైనా రాకపోయినా ఆమెకి అలాగే వుండేది. ఒకరోజు ‘మీ గురించేమీ చెప్పలేదు’ అన్నాడు రంగారావు.
అంత చెప్పడానికేమీ లేదు. మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. 13వ ఏటనే పెళ్లి. రెండేళ్లకి పాప పుట్టింది. పాప పుట్టిన ఏడాదికే అనారోగ్యంతో ఆయన కాలం చేశారు. అత్తింటి ఆరళ్లతో పాటు జీతంలేని పనిమనిషినయ్యాను. వాళ్ల మాట తీరు మారింది. వాళ్ల నడత మారింది. అత్తింటితో తెగతెంపులు చేసుకుని పుట్టిల్లు చేరాను అన్న దగ్గరకి.
అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది… ‘నీడలేని ఆడదానికి బతుకు ఎంత చులకనో’. అన్నయ్య మంచోడే… కానీ వదిన మాటకు అడ్డు చెప్పలేడు.
పాపను అన్నయ్యే స్కూల్లో చేర్పించాడు. వాడి కొడుకుతో పాటు చదివించాడు. అది వదినకు నచ్చలేదు. వదిన ససేమిరా అన్నా… కోడలిని చేసుకున్నాడు. ఇప్పుడు పిల్లలిద్దరూ అమెరికాలో వున్నారు. అప్పుడప్పుడు అమ్మాయి ఫోన్‌ చేస్తుంటుంది.
‘అన్నయ్య ఇంట్లో జీతం.. భత్యం లేని కూలీని. ఆ ఇంట్లో నుంచీ బయటపడి స్వతంత్రంగా బతకాలని చాలాసార్లు అనిపించేది. కానీ… వాడ్ని బాధపెట్టడం ఇష్టంలేక అలాగే రోజులు గడుపుతున్నాను. కాలం ఆగదు కదా… దానిపని అది చేసుకుంటూ పోయింది. ఇప్పుడు నా వయసు 55. రోజులు అలా వెళ్లిపోతున్నాయి’ అంది నిర్లిప్తంగా…
‘కానీ మీరలా కనిపించరు…’ అని నాలిక్కరుచుకున్నాడు.
‘సారీ…’ అన్నాడు.
‘పర్వాలేదులెండి’ అంది ముసిముసిగా నవ్వుతూ.
‘మీరేమీ అనుకోనంటే ఓ విషయం అడుగుతాను…. అడగమంటారా…’
‘ఏం అనుకోనులే అడగండి… అంది నవ్వుతూ…’
‘మనం పెళ్లి చేసుకుందామా….!!’
ఒక్కసారిగా ఆమె ముఖంలో నవ్వు మాయమైంది. గంభీరంగా మారిపోయింది.
ఆమె సీరియస్‌ ముఖం చూసి…. ‘క్షమించాలి. నా మనసులో మాట చెప్పాను. ఆ రోజు తాగి పడిపోయిన రోజున మిమ్మల్ని మత్తులో చూశాను. ఎవరో దేవత నా ముందు ప్రత్యక్షమైనట్లు అనిపించింది. ఆ రోజు నుంచి ఇప్పటికి ఆరు నెలల ఇరవై రోజులు. మళ్లీ నా జీవితంలో సంతోషం చిగురించిందేమో అనిపించింది. ప్రతి రోజూ మీరు ఎప్పుడొస్తారా అని చూస్తూనే వున్నా…
నిజంగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. నా వయసు 65 ఏళ్లు. ఈ వయసులో ప్రేమేంటి, పెళ్లేమిటీ అనుకోవద్దు. ‘ప్రేమకు వయసుతో సంబంధంలేదు, అదో సంఖ్య మాత్రమే అన్నాడో రచయిత’. అయినా ఈ వయసులో ఒకరికి ఒకరు తోడు కావాలి. ఆప్యాయత కావాలి. నా భార్య చనిపోయిన ఈ ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఈ ఆరునెల్ల కాలంలో వున్నాను.
మీరు నాకు…. మీకు నేను… తోడుగా వుంటే… మిగతా ఈ జీవితమంతా సంతోషంగా వుండగలం అనిపించింది. ఈ విషయం కొద్దిరోజులుగా ఆలోచిస్తున్నాను.
మనిద్దరికీ బాదరబందీ లేదు. ఏమంటారు…?’ అంటూ ఆమె వైపు చూశాడు.
ఆమె ఏం మాట్లాడలేదు. మౌనంగా లేచి… ‘వస్తాను’ అని వెళ్లిపోయింది.
‘ఆమెని బాధ పెట్టానా… చాలా పద్ధ్దతిగా వుంటుంది. నేను తప్పతాగి పడిపోవడం ఈ పార్కులోనే చాలాసార్లు చూసి వుంటుంది. నన్నెలా చేసుకుంటుంది. తొందరపాటుతో ఆమె స్నేహాన్ని కూడా పాడుచేసుకున్నానా….’ ఆలోచనలతో రంగారావు బుర్ర వేడిక్కిపోయింది. జేబులోంచి క్వార్టర్‌బాటిల్‌ తీసి ఒక్క గుటకలో తాగేశాడు. అలాగే కళ్లు మూసుకుని కూర్చున్నాడు.
మరుసటిరోజు ఏమీ తినాలనిపించలేదు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ గడిపాడు. సాయంత్రం కాగానే చకచకా పార్క్‌కి బయల్దేరాడు. ‘రాధ గారిని క్షమాపణ అడగాలి. మన స్నేహాన్ని ఇలాగే కొనసాగిద్దాం అని వేడుకోవాలి’ అనుకున్నాడు.
పార్కులో రాధను చూడగానే రంగారావు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. బాటిల్‌ తీసి తాగేద్దామా అనిపించింది. మరీ ఆమె ముందు తాగడం బాగోదని బలవంతంగా ఆగిపోయి నమ్మదిగా వెళ్లి, ఆ బెంచీపైన చివరగా కూర్చున్నాడు.
ఆమె వైపు నేరుగా చూడకుండా… కాస్త దూరంలో ఆడుకుంటున్న పిల్లలవైపు చూస్తూ ‘క్షమించండి..’ అన్నాడు.
అతన్ని చూసింది. ‘ఏమైంది అలావున్నారు. రాత్రంతా నిద్రపోలేదా… ఏమిటి? ఏమైనా తిన్నారా..?’
అతను ఏమీ మాట్లాడలేదు. తనతో తెచ్చిన సంచిలోంచి ఒక బాక్సు తీసి ఇచ్చి, తినండి అంది రాధ.ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు.
‘మీకు ఇష్టమైందేలే.. తినండ’ి అంది.
ఏదో మంత్రం వేసినట్లుగా మారుమాట్లాడకుండా ఆ బాక్సు తీసుకుని ఓపెన్‌ చేశాడు. అందులో పులిహోరా, దానిపైన స్పూను. మాటల మధ్యలో ఒకసారి చెప్పినట్లు గుర్తు. తనకు పులిహోర అంటే చాలా ఇష్టమని. ఆమె ముఖం వైపు ఆశ్చర్యంగా సంతోషంగా చూశాడు.
ఊ… తినండి అంది. రాత్రి నుంచి ఏమీ తినకపోవడం… పైగా తనకిష్టమైన పులిహోర కావడంతో… ఆత్రంగా రెండుమూడు స్పూన్లు తినగానే, గొంతుకడ్డంపడి పొలమారింది.
వాటర్‌బాటిల్‌ మూత తీసి ‘తాగండి’…. ఆశ్చరంగా ఆమెను చూస్తూ రెండుగుటకలు వేశాడు. తినే వరకూ ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు.
‘థ్యాంక్యూ…’ అన్నాడు.
‘నాకు తెలుసు… బహుశా ఏమీ తిని వుండరని…’ అంటూ రంగారావు కళ్లలోకి చూసింది.
‘రాత్రంతా ఆలోచించాను. అమ్మాయితో కూడా మాట్లాడాను. అమ్మాయి సంతోషంగా ఒప్పుకుంది. ‘ఇంతకాలానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు’ అంది.’అన్నయ్య వాళ్లతో చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా ఒప్పుకోరు…’
‘అంటే…?’
‘ఊ…’ అంది సిగ్గుగా…
‘ఇది నిజమా… కలా…? నిన్న మీరలా వెళ్లిపోవడంతో… నేను తొందరపడ్డానేమో అనిపించింది. కనీసం మీ స్నేహాన్నయినా నిలుపుకోగలనా అని బాధేసింది’.
అతని చేతిలో చేసి వేసి పట్టుకుంది. ‘నాకు ఒక్క మాట ఇస్తారా….’
ఏమిటన్నట్లు చూశాడు..
‘నా చెయ్యి ఎప్పటికీ విడువని మాటిస్తారా…’
ప్రేమ ధారలు కురుస్తున్నట్లుగా ఆమె కళ్లలో సంతోషం….
ఆమె కళ్లలోకి చూస్తూ…. ‘తప్పకుండా… నా గొంతులో ప్రాణం వున్నంతవరకూ మీ చేయి విడువను’ అని అతని రెండో చెయ్యి రాధ చేతిపై వేశాడు.
ప్రేమగా అతని వైపు చూస్తూ… ఆమె తన రెండో చేతిని అతని చేతిపై వేసింది.ఇప్పుడు వాళ్లకు నిజంగానే వారి వయసు గుర్తులేదు.
మరుసటి రోజే స్నేహితుల సమక్షంలో రాధాదేవి- రంగారావు దండలు మార్చుకున్నారు.

‘రంగా… ఒరే రంగా…’ బయట నుంచి స్నేహితుడు కేకలకు ఆలోచనల నుంచి బయటపడ్డారు రంగారావు, రాధాదేవి.
ఇద్దరి ఆలోచనలూ ఒక్కటే… ‘ఈ ఆనందం శాశ్వతం కావాలి’ అనే.
ఏంట్రా అలా వున్నారు..?… ‘సరేగాని, తోటలో మన మిత్రబృందం ఎదురుచూస్తోంది’ అన్నాడు రంగారావు మిత్రుడు సుబ్బారావు.
దాని సారాంశం ఏమిటో ఆ ఇద్దరికీ తెలుసు.
రాధ మౌనంగా వంటగదిలోకి వెళ్లింది.
రాధ వెళ్లినవైపే చూస్తూ…. ‘రారా… కూర్చో.’
‘అంత టైమ్‌ లేదురా. మనోళ్లంతా సిద్ధంగా వున్నారు’ అన్నాడు సుబ్బారావు.
రంగారావు ఏం చెపుతాడోనని వంటింట్లోంచి చూస్తోంది రాధ.
ఒక్క నిమిషం మౌనం తర్వాత… ‘సారీ రా… ఈ రోజు నుంచి మందు తాగడం మానేస్తున్నాను. జీవితాంతం తన చేయి వదలనని రాధకు మాటిచ్చాను’.
‘దానికీ దీనికీ సంబంధమేంట్రా…’ అన్నాడు సుబ్బారావు.
‘నా మాట నిలబెట్టుకోవాలంటే… నేను బతికి వుండాలి కదా.. అందుకే, తాగడం మానెయ్యాలని ఉదయమే నిర్ణయించుకున్నాను. జీవితంలో ఇంకెప్పుడూ మందు ముట్టను’.
‘రంగా…ఆల్‌ ది బెస్ట్‌ రా…. ఈ ఉగాది మీ జీవితాలను ఆనందమయం చేయాలి’ అంటూ సుబ్బారావు వెళ్లిపోయాడు. వంటింటి గుమ్మంలోంచి రాధ వైపు చూశాడు. ఆమె కళ్లలో సరికొత్త మెరుపు కనిపించింది.

రాజాబాబు కంచర్ల
94900 99231

➡️