సేవా కార్యక్రమాల్లోనూ స్టారే

Apr 14,2024 13:12 #Sneha

టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ తర్వాత నాలుగు దశాబ్దాల పాటు స్టార్‌ హీరోగా నిలిచిన వ్యక్తి మెగాస్టార్‌ చిరంజీవి. మెగాస్టార్‌ అనే బిరుదు ఆయన తీసిన సినిమాలతోనే రాలేదు. ఆయన వ్యక్తిత్వంలోనూ, నడవడికలోనూ ఆ విధంగా ఉండేవారు. యువనటులకు ఆదర్శంగా ఉంటూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. అందులోనూ ఆయన చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి. ఇప్పటికే బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌లతో ఎంతోమందికి రక్తదానం, నేత్రదానం చేసిన ఆయన సినీ కార్మికుల కోసం, సమస్యల్లో ఉన్నవారికి తనవంతుగా పాటుపడుతుంటారు. అటువంటి వ్యక్తి గురించి ఈ వారం సెలబ్రిటీలో…

అసలు పేరు : కొణిదెల శివశంకర వరప్రసాద్‌

జీవిత భాగస్వామి : సురేఖ కొణిదెల
సంతానం : సుస్మిత, రాం చరణ్‌ తేజ, శ్రీజ
నివాసం : హైదరాబాద్‌
వృత్తి : సినీ నటుడు, రాజకీయ నాయకుడు, వ్యాఖ్యాత
పురస్కారాలు : పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు, పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు.

చిరంజీవి.. తెలుగు సినిమా ఇండిస్టీలో ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎలాంటి బ్యా గ్రౌండ్‌ లేకుండా స్టార్‌ హీరోగా ఎదిగిన ఆయన 1955 ఆగస్టు 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. చిరంజీవి తండ్రి పోలీస్‌ కానిస్టేబుల్‌. ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. దాంతో నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులలో చిరంజీవి ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. ఒంగోలులో డిగ్రీ పూర్తిచేశారు. నటన మీద ఉన్న ఆసక్తితో మద్రాసు వెళ్లి, ఒక నటనా సంస్థలో శిక్షణ పొందారు. తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, స్టార్‌గా ఎదిగారు. 1978లో ‘పునాదిరాళ్ళు’ సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకూ 156 సినిమాలల్లో హీరోగా నటించారు.
తనకు వస్తున్న ఆదాయంలో నుంచి ప్రజలకు సేవలు చేయాలనుకున్నారు. 1998లో ‘చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌’ స్థాపించారు. ‘చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌’, ‘చిరంజీవి ఐ బ్యాంక్‌’ నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. ఆయన అభిమానులంతా ఈ ట్రస్టుల ద్వారా రక్తదానం, నేత్రదానం చేస్తున్నారు. ఇప్పటివరకు పది లక్షల యూనిట్ల బ్లడ్‌ సేకరించి, వాటిని అవసరమైన వారికి అందించారు. ఐ బ్యాంక్‌ ద్వారా పదివేల మందికి కంటి చూపునిచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు ‘అత్యుత్తమ సేవా సంస్థలు’గా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకొన్నాయి.
తాజాగా ‘బలగం’ సినిమాలో నటించిన మొగిలయ్యకు కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా మధుమేహంతో బాధపడుతూ నిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు చూపు మందగించింది. విషయం తెలుసుకున్న చిరంజీవి మొగిలయ్య కంటిచూపు కోసం అయిన ఖర్చంతా భరించారు. అంతేకాదు.. మొగల్తూరుకు చెందిన బాల్యమిత్రుడు పువ్వాడ రాజాకు అనారోగ్యంతో బాధపడుతుంటే అపోలో ఆసుపత్రిలో చేర్పించి, వైద్యం అందించారు. ఇలా ఎంతోమందిని ఆదుకుని, అండగా నిలుస్తున్నారు చిరంజీవి. ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమలో ఆయనకులానే మరికొంతమంది అగ్ర, యువ హీరోలు నాగార్జున, మహేష్‌బాబు, బన్నీ, ఎన్టీఆర్‌ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఎంతోమంది యువనటులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని, ఇండిస్టీకి వస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారి సినిమా ట్రైలర్స్‌, ఆడియో ఫంక్షన్స్‌ సందర్భాల్లో చిరంజీవి గెస్ట్‌గా వెళుతూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.

అలనాటి కథానాయికలతో..
పద్మవిభూషణ్‌ అందుకున్న ప్రముఖుల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. అయినా ఎంత ఎత్తు ఎదిగినా తాను వచ్చిన బాటను ఎప్పుడూ మరిచిపోనంటున్నారు. ఓ మధ్యతరగతి కుటుంబీకుడిగా ఇంట్లో వ్యవహరిస్తానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు.. తనతో పాటు నటించిన అలనాటి హీరోయిన్లు, హీరోలను ప్రతి సంవత్సరం ఇంటికి ఆహ్వానించి, సెలబ్రేట్‌ చేస్తుంటారు. రాధిక, సుహాసిని, రాధా, సుమలత, రమ్యకృష్ణ, కుష్బు, తదితర నటీనటులతో ఇప్పటికీ స్నేహ పూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు.

కోవిడ్‌ సమయాల్లో..
కష్టాల్లో ఉన్న అభిమానులకు స్వయంగా సాయం, మెడికల్‌ క్యాంపులు, పెను ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇటీవల కరోనా సమయంలో సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. అంతేకాకుండా ఆక్సిజన్‌ అవసరమైన వారికోసం ఆక్సిజన్‌ బ్యాంక్‌ కూడా నిర్వహించారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు చిరంజీవి సినీ కార్మికుల కోసం ఏకంగా హాస్పిటల్‌నే నిర్మించబోతున్నారు. ఇక సినీ పరిశ్రమకి ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపిస్తుంటారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి ప్రాణదానం చేసి, రీల్‌ లైఫ్‌ లోనే కాదు రియల్‌ లైఫ్‌లో కూడా హీరోగా నిలిచారు మెగాస్టార్‌.

 

➡️