మానవత్వం పరిమళించే కథాసుమాలు..

Dec 17,2023 14:57 #book review, #Sneha
suma sourabhalu book review

ప్రతి మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. అయితే చెడు మీద మంచి ఎప్పుడూ గెలవాలి. అది ప్రతి విషయంలోనూ జరిగితే సమాజం బాగుంటుంది. ఇదే విషయాన్ని రచయిత్రి కె.వి. సుమలత ‘సుమ సౌరభాలు’ కథల ద్వారా చెప్పదలచుకున్నారు. గతంలో వివిధ సందర్భానుసారంగా మాస పత్రికలకు రాసిన కథలన్నింటినీ ఓ సంకలనంగా తీసుకువచ్చారు. ఈ పుస్తకంలో మొత్తం 22 కథలు ఉన్నాయి. ప్రతి కథా సమాజహితంగా మలిచే ప్రయత్నం చేశారు. ఈ కథల్లో మనుషుల మధ్య అభిమానాలు, ఆప్యాయతలు, అనుబంధాలు, కలతలు, కన్నీళ్లు, కష్టాలు, నష్టాలు, విలువలు ఉన్న రకరకాల వ్యక్తిత్వాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రతిదీ నాటకీయంగా అనిపించినా.. కథలో నీతి తెలుసుకోవాలనిపిస్తుంది.ఎందుకూ పనికిరాడని భావించిన ఉపాధ్యాయులు, మూగ, చెవిటివాడని ఏడిపించే తోటి పిల్లల మధ్య పెరిగిన రవిలో పట్టుదలను గుర్తించిన వ్యక్తి శారదా టీచర్‌. అతని పేదరికం కారణంగా భవిష్యత్తు చెడిపోకూడదని భావించి, మంచి స్కూల్లో రవిని చేర్పించి, చదివిస్తుంది. సమాజంలో రకరకాల లోపాలతో బాధడుతున్నవారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఎన్నో విజయాలు సాధిస్తారని ‘స్వాతిముత్యం’ కథ సారాంశం. తల్లి స్థానంలో సవితి తల్లిని అంత త్వరగా అంగీకరించదు పసి హృదయం. అయినా భర్త కూతుర్ని తన సొంత కూతురిగా స్వీకరించే మనసు అందరు ఆడవాళ్లకు ఉండాలని ‘ఓ అమ్మ విజయం’ తెలుపుతుంది. ఇప్పటితరం కంప్యూటర్లు, ఫోన్లతో బిజీబిజీగా గడుపుతుంది. ఈ క్రమంలో భార్య తప్పులను భర్త, భర్త పొరపాట్లను భార్య వేలెత్తి చూపుతూ గొడవలు పడుతూ విడిపోతున్నారు. భాగస్వామి పట్ల సామరస్యంగా, సానుకూలంగా ఆలోచిస్తూ, ఒకరికొకరం అన్నట్లు ఉంటేనే కలిసి జీవించగలరని ‘నువ్వు..నేను..మనమై!’ కథ చెబుతోంది. ఈ మధ్యకాలంలో పసిపిల్లలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. తండ్రి, బాబాయి, మామయ్య ఇలా.. బంధువులే అయినా పాముల్లా విషం కక్కుతూ కాటేస్తున్నారు.
అందుకే పిల్లల చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాలను ఎప్పటికప్పుడు గ్రహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ‘నాన్‌ సేఫ్టీ టచ్‌’ కథ అర్థం. పెళ్లి అయిన మహిళలు పని ప్రదేశాల్లో తోటి ఉద్యోగస్తులతో ఎలా వ్యవహరించాలి, ఎంత మేరకు హద్దుల్లో ఉండాలి, వ్యక్తిగత విషయాలు, కుటుంబ వ్యవహారాలను పంచుకోవడం ఎంత ప్రమాదమో తెలియజేసేదే ‘విడుదల’ కథ. ప్రేమను మనసుతో కాకుండా వ్యాపార కోణంలో చూసినప్పుడు ఎదుటివారి మనసు గాయపడుతుంది. అయినా ‘ఆకాశమంత..’ హృదయంతో ఎదుటివారి తప్పులను క్షమించడం మనకే మంచిదనిపిస్తోంది. ఈ రోజుల్లో స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ ఫేస్‌బుక్‌ అకౌంట్లు మెయింటెన్స్‌ చేస్తున్నారు. అందులో ఎవర్ని స్నేహితులుగా అంగీకరిస్తున్నాం అనేదే చాలా ముఖ్యం. మంచితనం ముసుగులో చేసే మోసాలు అన్నీ ఇన్నీ కాదు.. అందులోనూ ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా మసలుకోవాలని ‘ఫేస్‌బుక్‌’ కథ చెబుతోంది.

ప్రేమ, కష్టం విలువ తెలిసినా డబ్బు వ్యామోహంలో పడితే ఒక దశలో జీవితమే బోర్‌ కొడుతుంది. కన్నవాళ్లని, ప్రేమించిన మనిషిని విడిచి.. విదేశాల్లో విలాసవంతమైన బతుకు కోరుకున్న వ్యక్తి సంజరు. కొన్నాళ్లకు ప్రేమానురాగాలు కరువైపోతాయి. మనది కాని ప్రపంచంలో ఎక్కువ రోజులు జీవించలేమని ‘భూగోళానికి ఆ వైపు’ కథ తెలుపుతుంది. నిరాశ, నిస్పృహలు గూడుకట్టుకున్న వ్యక్తి జీవితాల్లోకి సాగర్‌ లాంటి స్నేహితులు రావడం అరుదు. ప్రాణ స్నేహితులుగా మారి, సత్యం ‘జీవితాన్ని చిగురింప’ జేశాడు. పెళ్లిళ్లు జరుగుతున్నప్పడు పెళ్లికొడుకు తల్లికీ లేదా బంధువులకు ఏదైనా ప్రమాదం జరిగితే.. వెంటనే పెళ్లికూతురికి ఆపాదిస్తారు చాలామంది. ఆమె అత్తారింటిలో అడుగుపెట్టడం వల్లేనని నిందలు వేస్తారు. వాస్తవాలను గ్రహించకుండా ఆమెకు సంబంధం లేని విషయాన్ని అసలు ఎలా ఆపాదిస్తారు? ఎంత వరకు సబబు అనేది ‘కోడలూ ఒకింటి ఆడపిల్లే!’ కథలో రచయిత్రి చాలా చక్కగా చెప్పారు. ఇలా ‘ఈనాటి బంధం.. ఆ నాటిదే!, తప్పెవరిది?, ఉత్సాహంగా.. ఉల్లాసంగా, ప్రేమించే మనసు, ఒకరికి ఒకరు, బామ్మగారి బొమ్మ, ‘అమ్మమ్మ-బెడ్‌రూమ్‌’ కథల్లో ఎదుటివారి సమస్యలను, కష్టాలను కళ్లతో కాకుండా మనసుతో, మానవత్వంతో చూడాలని సందేశం ఇచ్చే విధంగా ఉన్నాయి. నిజంగా ఈ కథలన్నీ
సుమ సౌరభాలే.

– పద్మావతి94900 99006

➡️