తలపాగా

Dec 17,2023 14:46 #Sneha, #Stories
talapaga story

రోజూలాగే ఈ రోజు కూడా సూరయ్య ఆకాశంలో సూరిబాబు కంటే ముందుగానే నిద్ర లేచాడు. ఆ మాటకొస్తే అతనసలు నిద్ర పోలేదు. టిక్కెట్‌ రిజర్వేషన్‌ కన్ఫామ్‌ అయ్యాక, తానెక్కే రైలు కోసం ప్లాట్‌ఫారమ్‌పై ఎదురుచూసే ప్రయాణికునిలా రాత్రంతా మేల్కొనే ఉన్నాడు. ఆ ప్రభాకరుని కోసం, తూర్పు ఇంట వేకువ కోసం. చీకటి చిన్నగా పలచబడ సాగింది. వెలుగు సన్నగా మొదలవుతోంది. వెలుగును చూడగానే సూరయ్యలో ఏదో ఆనందం. కిర్రు చెప్పులు కాళ్లకు తొడిగాడు. ఇంటి చూరు కింద వేలాడుతున్న తుండు గుడ్డను తీశాడు. తలపాగాలా చుట్టాడు. తల మీద పెట్టుకున్నాడు. అలా పెట్టుకోగానే అతనిలో ఏదో ధైర్యం. గుండెల్లో ఆశ మొదలవుతుంది. అరుగు దిగగానే, తనకు ఎదురైన వెంకన్నను చూసి ఆగాడు.’తలపాగా ఏదిరా వెంకన్నా’ అడిగాడు. వెంకన్న దీనంగా ఉన్నాడనిపించింది. తల పట్టుకుంటూ దిక్కుల కేసి చూస్తున్నాడు.. ఏ దిక్కు లేనివాడిలా. ‘రాజుకు కిరీటం, మనకు తలపాగా రెండూ ఒక్కటే. ఆయనది పాలన. మనది పోషణ. రైతుగా ఉన్నందుకు గర్వపడు, నిరాశ పడకు.. ధైర్యం చెప్పాడు వెంకన్న భుజం మీద చేయి వేస్తూ. అప్పుడే సూరయ్య కొడుకు గిరి అరుగు మీదకు వచ్చాడు. బద్ధకానికి, బాధ్యతా రాహిత్యానికి చొక్కా, పొడుగు నిక్కరు వేస్తే.. అలాగే ఉంటాడనిపిస్తోంది సూరయ్యకు. ‘లేదు సూరయ్య మామా, వ్యవసాయం నా వల్ల కాదు. పట్నం పోతా. కూలీగా మారిపోతా. ఎండ కోసం ఎదురుచూసే పని ఉండదు. వాన ఎక్కువైతే ఏడుపు రాదు. పురుగు మందు కల్తీ అని భయపడనక్కర్లేదు. నా పొలం కౌలుకు తీసుకో మామా. అది అడగాలనే పొద్దుటే నీ వాకిట్లోకి వచ్చాను’సూరయ్యకు వెంకన్న వచ్చిన విషయం అర్థమైంది. రాత్రి గిరి ఇక్కడకు ఎందుకు వచ్చాడో గుర్తుకొచ్చింది. ఉన్న ఒక్క ఎకరం పొలం అమ్మేసి, పట్నం రమ్మన్నాడు. తనతో ఉండమంటున్నాడు. సూరయ్యకు అది ఇష్టం లేదు. ఇప్పుడు తాను చెప్పే మాటలతో అటు గిరి, ఇటు వెంకన్నలో మార్పు రావాలనుకున్నాడు.జేబులోంచి చుట్టలు తీశాడు. ఒకటి వెంకన్నకి ఇచ్చాడు. రెండోది తన నోట్లో పెట్టుకున్నాడు.చుట్ట పొగ తాగుతున్న వెంకన్నతో, ‘చుట్ట కాల్చడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని తెలుసా వెంకన్నా?’ అడిగాడు వెంకన్నకేసి విచిత్రంగా చూస్తూ.’తెలుసు సూరయ్య మామా.. కానీ చుట్టంటే ఇష్టం’ నోట్లో నుండి చుట్ట పీకను బైటకు తీస్తూ అన్నాడు.’ఇష్టం ఉంటే చేసే పనిలో లాభం, నష్టం చూసుకోం. వ్యవసాయం మీద కూడా ఇష్టం పెంచుకో, కష్టం అనిపించదు’ అని చెప్పాడు.అందుకు బదులుగా వెంకన్న జీవం లేని నవ్వు నవ్వుతూ, ‘మా నాన్న రైతు.. తాత రైతు.. ఇప్పుడు నేను కూడా. తరాలు మారుతున్నాయి.. కానీ మా పరిస్థితులు మాత్రం మారడం లేదు. మెతుకు పండించే రైతు బతుకు చితికిపోవాల్సిందే. చివరకు అతుకుల బొంతలా జీవితం.. అక్కరకు రాని ఆదాయం.. వద్దు మామా వ్యవసాయం’ నిరాశ, నిస్పృహతో అన్నాడు వెంకన్న.’బాగా చెప్పావ్‌ బాబారు. అమ్మ బతికున్నంత కాలమూ కష్టమే మిగిలింది. నేను కూడా వ్యవసాయం వద్దన్నాను. వింటే కదా! మొండివాడు రాజు కన్నా బలవంతుడు’ ఇదే మంచి సమయం అనుకుంటూ నాన్న కేసి కోపంగా చూస్తూ అన్నాడు గిరి.సూరయ్య గిరి కేసి చూస్తూ చిన్నగా నవ్వాడు. ‘గిరీ సారం ఉంటేనే సంసారం రసవంతం అవుతుంది. సాయం అందితేనే వ్యవసాయం ఫలవంతం అవుతుంది. కానీ నువ్వు వ్యవసాయం వద్దన్నావు.. వ్యాపారం ముద్దన్నావు.. పట్నం పోయావు. కష్టపడితేనే ఏ రంగంలోనైనా లాభం వస్తుంది.. లేకపోతే నష్టమే మిగులుతుంది. నాకు దక్కిన ఈ ఒక్క ఎకరం మీద నీ చూపు పడింది. నీ ప్రేమ నా మీద కాదు, నా భూమి మీదని నాకు తెలుసు. నీది వ్యాపారం. చేసే పనిలో లాభనష్టాలే తప్ప, మమకారం ఉండదు. నాది వ్యవసాయం, వ్యాపారం కాదు’ అని గంభీరంగా అన్నాడు సూరయ్య. ‘ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి నాన్నా’ గిరి అనబోతుండగా ..’గిరీ నీ తెలివితేటల్ని వ్యాపారంలో చూపించు పైకొస్తావ్‌. నా మీద ప్రదర్శించకు, కిందకు పోతావ్‌. ఎందుకంటే నేను మట్టిమనిషిని. మట్టినే నమ్ముకున్నాను, అమ్ముకోను’ అన్న సూరయ్య మాటలతో గిరి నోటికి తాళం పడింది. తిరిగి వెంకన్న కేసి చూస్తూ.. ‘ఈ రోజు ఏరువాక పున్నమి. నేలమ్మను పూజించాలి. ఎద్దుకు దణ్ణం పెట్టాలి. కలిసి సాగు చేద్దాం. తిరిగి బాగు పడదాం!’ అంటూ భుజం తట్టాడు. వెంకన్నలో ఏదో ఆశ కలిగింది. సూరయ్య మాటలతో వ్యవసాయంపై భరోసా వచ్చింది. సూరయ్య నింపిన స్ఫూర్తితో నవ్వుతూ చూసాడు. ‘నాన్న మారడు. ఇక లాభం లేదు’ అని గిరి వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లక తప్పదనుకుంటూ పడమటి వైపు పయనమయ్యాడు. అది గమనించిన సూరయ్య ‘గిరీ వ్యవసాయం గొప్పదని నువ్వు గుర్తించే రోజు తప్పకుండా వస్తుంది’ అని మనసులో అనుకున్నాడు. తలపాగా సవరించాడు. వెలుగు కిరణాలు తోడు రాగా, వెంకన్నతో కలిసి తూరుపు దిక్కునున్న పొలం వైపు ఆనందంగా అడుగులు వేశాడు.

– కె.వి.లక్ష్మణరావు, 9014659041

➡️