చెట్టు నీడ

Apr 28,2024 09:01 #kavithalu, #Sneha

చెట్టుకు ఆకులు కాదు
తుపాకులు చిగురించాలి
మొలుచుకొచ్చిన
కొమ్మలు కత్తులై
కట్టెను నరికినట్టు
ఓసారి నరికిన భయం
ఎలా ఉంటుందో చూపించాలి
చెట్టు నీడను
రంపంమిల్లులో పొట్టు చేసిన
వాళ్ళను పొట్టుగా
రాల్చి నీడలేని
ఎండ బతుకు చేయాలి

పశువులకు
పక్షాలకే కాదు
మనిషికి కూడా చెట్టునీడ అవసరమే..
ఏ జీవైన బతికుండాలంటే
మనకు ఆక్సిజన్‌ ఇచ్చే
చెట్లు విలువ తెలుసుకోవాలి..

నీటి సెలయేటి గట్ల మీద
వేర్ల కాళ్లారజాపి
ఆకాశానికి గొడుగు పట్టినట్టుండే చెట్లు రహదారిపై నిలబడి
ప్రేమతో ఆహ్వానం పలికే చెట్లు
ఏం చేశాయని నీ స్వార్ధానికి
నేలకూల్చి..
భవితకు నీడలేని
నిప్పుల కాలాన్ని అందిస్తున్నావో చెప్పు

చెట్లు పిలిస్తేనే
వర్ష ఋతువు మేఘాల్ని మోసుకొచ్చి..
కాసింత బీడుభూముల గొంతు తడిపితే
రైతుకే కాదు లోకానికి అన్నం దొరికేది…
ఎండలు మండుతున్నాయని
కాలాన్ని తిడుతున్నావే గానీ
చెట్టును నరకకూడదని
ఎన్నడైనా అనుకున్నావా
ఏనాడైనా ఎదిగే మొక్క చుట్టూ
కంచెలా నిలబడ్డావా..

నీ ఇంట్లో టీపారుగా
సోఫా సెట్టుగా అమరడానికి
ఎంత అడవి నాశనమయ్యిందో గ్రహించావా..
వానలు రాలేదని కప్పలకు
పెళ్లి పేరంటాలు చేసే మూర్ఖపు
మేటలేసుకున్న మనిషి..
భూమి హృదయం మీద
అందమైన పచ్చబొట్టు
అడవి పచ్చదనమే…అని గ్రహించు

అన్ని సంపదలు సృష్టించి
పచ్చని రహస్యం తెలుసుకోలేక
పోతున్నావు
పచ్చదనాన్ని దోచుకపోయే
నీ స్వార్ధం జయించు
మట్టితో స్నేహం చెరు..
చెట్టులా చిగురిస్తావు…

రత్నాజీ నేలపూరి
8919998753

➡️