మొక్కల విలువ

Apr 21,2024 12:09 #Sneha

అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో లహరి, సంయుక్త అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సంయుక్త వాళ్ళ అమ్మానాన్నల పేర్లు సురేష్‌, సుశీల. లహరి వాళ్ళ అమ్మానాన్నల పేర్లు వరలక్ష్మి, వంశీ. వీళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి స్నేహితులే. వీళ్ళ నాన్నలు ఒకే ఆఫీస్‌లో పనిచేసేవారు.
సంయుక్త, లహరికి మొక్కలు అంటే ప్రాణం. వీరికి ఉన్న కొద్దిపాటి స్థలంలో రోజు ఏదో ఒక మొక్క నాటేవారు. ప్రతిరోజూ స్కూలు నుంచి రాగానే నాటిన మొక్కలకు నీళ్లు పోసేవారు. వాటి పక్కన పిచ్చిమొక్కలు పెరగకుండా, పెంచి పెద్ద చేసేవారు. మొక్కలను ప్రాణంలా చూసుకునేవారు. కొన్ని పూల మొక్కలు, పండ్ల మొక్కలు నాటారు. అవి పెద్దవై పూలు పూయడం, పండ్లు కాయడం మొదలయ్యాయి. అలా ఆ ప్రాంతం కాస్త తోటగా మారింది. వాళ్ల తల్లిదండ్రులు ‘ఎందుకమ్మా సమయం వృధా చేసుకుంటారు. వాటి వల్ల మనకు ఏమొస్తుంది?’ అనేవారు. అయినా వాళ్ళు ప్రయత్నాన్ని ఆపలేదు. ఈ చెట్లు మనల్ని ఎప్పటికైనా రక్షిస్తాయి అనేవారు.
కొన్ని రోజుల తరువాత వీళ్ళ తల్లిదండ్రులు పనిచేసే ఆఫీస్‌ మూతపడింది. కొన్ని నెలల పాటు దాచుకున్న డబ్బును ఖర్చు పెట్టారు. ఆ తర్వాత డబ్బులకు కష్టాలు మొదలయ్యాయి. అప్పులు చేయాల్సి వస్తోందని ఇద్దరు నాన్నలు బాధపడ్డారు. అది గ్రహించిన లహరి, సంయుక్త ‘ మీరు బాధపడకండి మేము కొన్ని చెట్లను పెంచుతున్నాం వాటికి పూలు, పండ్లు చాలా ఉన్నాయి. వాటిని అమ్మితే మనకు బోలెడు డబ్బులు వస్తాయి. వాటితో ఇల్లు గడుస్తుంది.’ అన్నారు. సంతోషంతో వారంతా ఆ తోటలోకి వెళ్లి చూశారు. అక్కడ రకరకాల పూలు, కాయలు ఉన్నాయి. వాటిని గంపలకు కోసి, మార్కెట్లో అమ్మారు. ఆర్థిక కష్టాలను తీర్చుకున్నారు. సంయుక్త, లహరిలను మెచ్చుకున్నారు. వారు కూడా ఆ మొక్కల సంరక్షణ బాధ్యత చేపట్టారు. జీవనోపాధి పొందారు.
నీతి : వృక్షో రక్షతి రక్షితః

– పుల్లగూర్ల సాయికృప,
7వ తరగతి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,
ఘనపురం, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా.

➡️