నేనెవర్ని?

May 5,2024 09:02 #Sneha

సెలవుల్లో పిల్లల గలగల.. బయట ఎండలు మలమల.. మరి పిల్లలను ఎలా మెయింటైన్‌ చేయాలి..! అని తర్జనభర్జన పడుతున్న డియర్‌ పేరెంట్స్‌కు.. పిల్లలు ఎండల్లో బయటికి వెళ్ళగూడదు.. విసుగు కలిగించే అల్లరి చేయకూడదు.. వ్యాయామంతో కూడిన ఆలోచన రేకెత్తించే ఆటలు ఆడాలి.. సెలవుల్లో పిల్లలు చేసే అల్లరి కూడా సృజనాత్మకంగా ఉండాలి.. అంటే మనం కాస్త ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే మరి. అదేనండి వారిని పదేపదే విసుక్కోకుండా వారిలో స్నేహభావం పెంపొందేలా ఆటలు నేర్పుదాం. మనమూ ఆనందిద్దాం.
ఇలా ఆడించేద్దాం..
పిల్లలందర్నీ ఒకచోట కూర్చోమనాలి. ముందుగానే పేపర్లను రిబ్బన్‌లుగా కట్‌ చేసుకోవాలి. ఒక్కొక్క పేపరుపై ఒక పేరు చొప్పున కొన్ని పేర్లు రాయాలి. ఆ పేర్లు వారి స్థాయిలోనే ఉండేలా జాగ్రత్తపడాలి. అలా పేర్లను రాసిన రిబ్బన్‌ పేపర్లు.. ఒక్కొక్క పిల్లవాడి నుదుట ఒక్కొక్క పట్టీని కట్టాలి. వాటిపై ఏమి రాసి ఉందో కట్టించుకున్న వారికి తెలియకూడదు. రాసిన పేరు కనుగుణంగా అది చదివిన పిల్లవాడు అభినయించాలి. ఉదాహరణకు ‘కోతి’ అని రాసి ఉంటే కోతిలా.. ‘కుమ్మరి’ అని ఉంటే కుమ్మరిలా..’మహారాజు’ అని ఉంటే రాజులా.. వారు అభినయించాలి. అంటే యాక్షన్‌ చేయాలి. వారి యాక్షన్‌ను బట్టి తన నుదుటిమీద ఉన్న పేరు ఏమిటో రిబ్బన్‌ వాలా చెప్పాలి. అదీ ఆట. చెప్పలేని వారు, సరిగా యాక్షన్‌ చేయలేని వారు అవుట్‌ అన్న మాట. ఈ ఆట పిల్లల్లో ఆలోచనను, సృజనాత్మకతను పెంపొందిస్తుంది. చూసేవాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది.

➡️