స్త్రీలు స్వయంసిద్ధలు

కుటుంబ వ్యవస్థలో ప్రధానంగా స్త్రీలను పిరికి వారిగాను, బలహీనులుగాను, సహనం, ఓర్పు, భావోద్వేగం కలవారుగాను నిర్ణయించబడడం, పురుషులు ధైర్యవంతులుగాను, బలం, సామర్ధ్యం, దూకుడు కలవారుగా వుండడం వల్ల స్త్రీలపై ఆధిపత్యం చేయడాన్ని జెండర్‌ రూపకంగా సమాజం ఆమోదిస్తున్నది. అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో, స్త్రీలు ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదు.. అందులో ప్రధానంగా ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం లాంటి పనులన్నీ స్త్రీలకు సంబంధించినవిగా, పురుషులు కేవలం కుటుంబం వెలుపల కష్టపడి పని చేయాలని సూచిస్తోంది.

కుటుంబాలలో కీలకంగా ఉన్న స్త్రీలు అనేక రకాలుగా వివక్ష, అణచివేతలకు బలి అవుతున్నారు. చదువు, హోదా, ఆర్ధిక స్థోమత ఉన్న వారి కంటే, ఏ ఆధారం లేకుండా కుటుంబ వ్యవస్థ నుండి బయటకు వచ్చిన స్త్రీల జీవితాలు అనేక కష్ట, నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. పెళ్లి సమాజం కోసం, పిల్లలు వారసత్వం కోసం మాత్రమే పురుషులు భావించడం వలన స్త్రీలపై కుటుంబ హింస మరింత ఎక్కువ అవుతోంది. పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులిద్దరిది. చాలా కుటుంబాలలో పిల్లల్ని కానీ, పెంచే విషయంలో పురుషులు ఆ నిబద్ధతను చాలా కుటుంబాలలో పాటిస్తున్నట్లు కనబడరు. స్త్రీలు భర్తల, కుటుంబ పెద్దల అసహనాల నడుమ తన పిల్లల్ని పెంచడం ఎంతటి కష్టతారమైనప్పటికి వారిని పెంచక తప్పని స్థితి.

ఒకవేళ స్త్రీలు కుటుంబ హింసలను భరించలేక కుటుంబ వ్యవస్థ నుండి బయటకు వస్తే ఆమె పట్ల సమాజం చిన్నచూపు చూస్తుంది. భర్తను వదిలివేసిన స్త్రీగా ఆమెను ముద్రవేస్తుంది. బరితెగించిన మహిళగా ఆమెను కించ పరుస్తుంది. ఒకవేళ పిల్లల్ని భర్త దగ్గరే వదిలి వచ్చిన స్త్రీలను సమాజం మరింత హీనంగా చూస్తుంది. అందుకే భర్తకు దూరంగా ఉంటున్న ఆడవాళ్లు ఎక్కువ శాతం పిల్లల భాద్యత తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో ఒంటరి స్త్రీలుగా వారి జీవనపోరాటం మరింత దుర్భరంగా మారిపోతుంది.

ఇల్లు, కుటుంబం, పెళ్లి, మాతృత్వం ఇవన్నీ స్త్రీలను నియంత్రించే భావవాదం మన సమాజంలో వేనూళ్లుకుని పోవడం వల్ల పురుషులు స్త్రీలను బయటకు రానీయకుండా హింసా రాజకీయాలు ప్రయోగించడం కూడా జరుగుతుంది. పరువు, మర్యాద, కట్టుబాట్లు అనే కారణాలను చూపిస్తూ వారిని మరింత బంధించే ప్రయత్నంలో చాలామంది స్త్రీలు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించుకోవలసిన స్థితి ఏర్పడింది.

అసలు ఒంటరి స్త్రీలు అంటే ఎవరు? అనే ప్రశ్న వచ్చినప్పుడు కేవలం భర్త చనిపోయిన తర్వాత జీవించే వారిని మాత్రమే సమాజం ఈనాటికీ ఒంటరివారిగా గుర్తిస్తోంది. చాలామందిలో ఒంటరిగా జీవించడం అంటే ఏకాకిగా బతకడం అని అపోహపడుతూ వుంటారు. అసలు ఏకాకితనం, ఒంటరితనం అనే పదాలు రెండు కూడా వేరు వేరు. వివాహ వయసు వచ్చినప్పటికి పరిస్థితుల ప్రభావంతోనో లేదా ఐచ్చికంగానో పెండ్లి చేసుకోకుండా వున్న స్త్రీలు మన సమాజంలో కోకొల్లలుగా వున్నారు. అలాగే అనేక కారణాల వలన భర్తల నుంచి దూరంగా వచ్చి, పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నవారు ఉన్నారు. వైవాహిక జీవితాలకు దూరంగా వున్న స్త్రీలను ఒంటరివారిగా వారిని సమాజం ముద్రవేస్తుంది. ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా వుండి కేవలం భర్తకు దగ్గరగా వున్న స్త్రీల మానసిక స్థితి వర్ణానాతీతంగా వుంటుంది. స్త్రీలు తమ ఆత్మగౌరవాన్ని భర్తల పాదాల వద్ద బలవంతంగా తాకట్టు పెట్టి దుర్భర జీవితాలను గడుపుతున్న వారే ఈ సమాజంలో ఎక్కువ. ఆర్ధిక భద్రత వున్న స్త్రీల పరిస్థితి ఒకలా వుంటే, ముందు వెనక ఎవ్వరూ, ఏ ఆసరాలేని దుస్థితి మరింత ఘోరంగా వుంటుంది.

ఒక స్త్రీ ఏ కారణంతో ఒంటరిగా జీవిస్తున్నా, సమాజంలో ఆమె ఎదుర్కొనే సమస్యలు అనేకం వుంటాయి. అడుగడుగునా అనేక ఇబ్బందులను, సవాళ్లను ఎదుర్కోవలసి వుంటుంది. సాటి స్త్రీల నుండి కూడా హేళనతో కూడిన వివక్షను ఎదుర్కోవలసి వస్తుంది. ఒంటరి స్త్రీలకు సమాజంలో ప్రోత్సాహం కానీ స్నేహభావం కానీ ఇచ్చేవారే వుండరు. ఒక వైపు కుటుంబం నుండి బయటకు వచ్చిన అభద్రతాభావంతో పాటు, సమాజంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ముందుగా వారు ఎంతో ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని ధైర్యాన్ని ప్రదర్శించాల్సి వుంటుంది. ఎలా బతకాలో తెలియని అయోమయ స్థితి నుంచి తనను తాను నిలుపుకోవడానికి సమాజంలో ఒంటరి స్త్రీలు పెద్ద పోరాటాలే చేయవలసి వుంటుంది. ఆ పోరాటంలో ఆమె ఆత్మగౌరవమే ఆమెకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

చాలామందికి ఒంటరి అనేది ఒక చేదు పదం. నిజానికి స్త్రీ పురుషుల సమానత్వం కోరుకునే వారికి ఒంటరి అనే పదం ఒక అనుభూతి, ఒక అనుభవం. ప్రాణం వున్న ఏ ప్రాణి అయినా ఒంటరిగా వుండాలని కోరుకోవు. అందుకే మనిషిని సంఘజీవి అన్నారు. ఒంటరి స్త్రీలు ఏ తోడు లేకుండా (లైంగిక, శారీరక) తమ జీవనానికి కావలసిన అన్ని పనులను స్వశక్తితో చేసుకుంటూ, ఎటువంటి కట్టుబాట్లు, అజమాయిషీ లేని సానుకూలమైన ఒక వాతావరణాన్ని ఏర్పర్చుకోగల్గుతున్నారు. ఆమె తన మనసు చెప్పిన మాటనే ఆచరిస్తూ, సర్వస్వతంత్రంగా జీవించడాన్ని ఆస్వాదిస్తుంది. అందులో నుంచే ఆమె ఆనందాన్ని చవిచూసి స్వయంసిద్ధగా ఎదిగి స్వయం ప్రకాశితమౌతుంది. సమాజంలో ఒంటరి మహిళల ఆత్మగౌరవమే ఆమెను ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. ఎవరికి జంకని ధైర్యమే ఆమెను, ఆమె చుట్టూ వున్న వారికి ఆదర్శంగా, ఆచరణీయంగా నిలబడుతుంది.

– విజయ భండారు, 88019 10908

➡️