కొంప మునుగుతుందా?

Mar 26,2024 07:20 #TDP
జిల్లాకు సంబంధించి టిడిపి మరో నాలుగు స్థానాలకు
  • బిజెపితో దోస్తీపై టిడిపిలో ఆందోళన
  • ఆ 29 అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు కష్టమే..!

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి నేతల్లో కొత్త భయం నెలకొంది. ఎన్నికల నిర్వహణ సులువుగా చేసుకోవచ్చునని ఆ పార్టీ అధిష్టానం భావించి బిజెపితో పొత్తు కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ వల్ల తమ కొంప మునుగుతుందేమోనని టిడిపి నేతలు భయపడుతున్నారు. కమలం వల్ల తమకు ఓట్లు పడతాయా? లేదా? అనే ఆందోళనలో ఉన్నారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి చేసింది శూన్యమని టిడిపి నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రైల్వేజోన్‌ ఊసేత్తకపోవడంతోపాటు విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకోవడంతో రాష్ట్ర ప్రజలు బిజెపిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టిడిపి నేతలు ఆందోళనలో చెందుతున్నారు. ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన సభలో ఈ అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీంతో టిడిపి నేతలతోపాటు రాష్ట్ర ప్రజలూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఒక్క మాటా అనకపోవడంతో టిడిపి కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. దీంతో జగన్‌కు మోడీ పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే భావన టిడిపిలో నెలకొంది. అదేవిధంగా మతోన్మాద పార్టీ అనే ముద్ర ఉండటమే కాకుండా ముస్లిములకు వ్యతిరేకంగా ఇటీవల సిఎఎ బిల్లును కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలు, మేధావులు, తటస్థ వర్గాల ప్రజలు బిజెపిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. అయితే బిజెపి పోటీ చేయనున్న 6 లోక్‌సభ స్థానాల పరిధిలోని శాసనసభ స్థానాల్లో టిడిపి అభ్యర్థులు కలిసి ప్రచారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బిజెపిపై ఉన్న కోపంతో తమ పార్టీకి ఓటు వేస్తారా? లేరా? అనే ఆందోళన టిడిపి అభ్యర్థుల్లో నెలకొంది. తిరుపతి, రాజంపేట, నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లి, అరకు లోక్‌సభ స్థానాల్లో బిజెపి పోటీ చేయనుంది. ఈ పరిధిలో టిడిపి నుంచి 29 మంది అభ్యర్థులు అసెంబ్లీ బరిలో ఉన్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో సర్వేపల్లి, సూళ్లురుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాలు, రాజంపేట పరిధిలో రాయచోటి, తంబలపల్లె, పీలేరు, పుంగనూరు, మదనపల్లి నియోజకవర్గాలు, అరకు పరిధిలో కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, రంపచోడవరం నియోజకవర్గాలు, అనకాపల్లి పరిధిలోని పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల స్థానాలు, రాజమండ్రి పరిధిలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌, అనపర్తి, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాలు, నరసాపురం కింద ఆచంట, పాలకొల్లు, ఉండి, తణుకు స్థానాలు ఉన్నాయి. వీటిల్లో మరలా 8 ఎస్‌సి, 5 ఎస్‌టి నియోజకవర్గాలు బిజెపి పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానాల పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ నియోజకవర్గాల్లోని టిడిపి అభ్యర్థుల్లో ఈ ఆందోళన మరికొంత నెలకొంది.

➡️