కొండంత అప్పు

Apr 27,2024 09:32 #debt
  • కుంగుతున్న కుటుంబాలు
  • గరిష్టస్థాయికి చేరిన రుణభారం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సాధారణ కుటుంబాలు అప్పుల కుప్పలుగా మారుతున్నాయి. కొండంత రుణభారం సగటు మనిషిని కుంగతీస్తోంది. కుటుంబాల రుణభారం గరిష్టస్థాయికి చేరింది. రిజర్వుబ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాలను విశ్లేషించి మార్కెటింగ్‌ వ్యవహారాల అధ్యయన సంస్థ ‘మోతీలాల్‌ ఓస్వాల్‌’ చేసిన విశ్లేషణ ప్రకారం 2023- 24 మూడవ త్రైమాసికంలో (క్యూ3) భారతదేశ కుటుంబ అప్పులు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జిడిపిలో 39.1శాతానికి కుటుంబ అప్పులు చేరినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ స్థాయిలో కుటుంబాల రుణాలు నమోదుకావడం గతంలో ఎన్నడూ లేదని ఆ సంస్థ తెలిపింది. రానున్న రోజుల్లో కుటుంబ రుణభారం మరింత పెరిగి 39.1శాతానికి చేరుకుంటుందని కూడా ఈ సంస్థ అంచనా వేసింది. ఇది 2020 – 21 నాలుగవ త్రైమాసికంలో ( క్యూ4 )లో నమోదైన గరిష్ట స్థాయి రుణాలు 38.6 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఈ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం గత ఏడాదితో పోల్చుకుంటే (ఇయర్‌ టు ఇయర్‌ ప్రాతిపదికన) 2023-24 మూడవ త్రైమాసికంలో కుటంబాల అప్పు 16.5శాతానికి పెరిగింది. గృహేతర రుణంలోఈ వృద్ధి ఎక్కువగా కనపడుతోందని ఈ సంస్థ విశ్లేషించింది. గృహరుణాలు 2023- 24 మూడవ త్రైమాసికంలో కేవలం ఏడాదికి 6.1 శాతం పెరిగాయి. జిడిపిలో ఇది 15 ఏళ్ల కనిష్టస్థాయికి తగ్గింది. అనేక తక్కువ- ఆదాయ కుటుంబాలు కరోనా మహమ్మారి బారిన పడి తప్పనిసరిగా రుణాలు తీసుకోవలసి రావడంతో 2020- 21 చివరినాటికి కుటుంబ అప్పులు భారీగా పెరిగాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కుటుంబ అప్పులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) డేటా ప్రకారం.. 2021- 22 లో 7.2 శాతం నుండి 2022- 23 లో కుటుంబాల నికర ఆర్థిక పొదుపులు దాదాపు ఐదు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయిందని సెప్టెంబర్‌ 19, 2023లో ఎఫ్‌ఇ నివేదిక ప్రకటించింది.

➡️