కురుపాంలో త్రిముఖపోటీ

Apr 10,2024 07:21 #2024 elections, #ap election, #Kurupam

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ వైసిపికి చెందినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ వైసిపి వారినే అభ్యర్థులుగా ప్రకటించింది. మూడు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యుర్థులను ఖరారు చేసింది. పాలకొండ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. పాలకొండ, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖారారు చేశారు. కురుపాంలో సిపిఎం పోటీచేయడంతో త్రిముఖపోటీ ఏర్పడింది. మిగిలిన మూడు చోట్ల ప్రధాన పోటీ టిడిపి, వైసిపి మధ్య ఉంటుంది.
వైసిపి వర్సెస్‌ టిడిపి
పార్వతీపురం వైసిపి అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఉన్నారు. గెలుపే లక్ష్యంగా చాలా కాలం నుంచి జనాలకు తాయిలాలు అందిస్తున్నారు. పార్టీలో ఆయన్ని బంహిరంగంగా విభేదించేవారు లేకపోవడంతో నియోజకవర్గంలో ఏకచత్రాధిపత్యం సాగుతోంది. ఐదేళ్లలో రూ.కోట్లకు పడగలెత్తారనే ప్రచారం ఉంది. కొందరు నాయకులు అభ్యర్థి తీరుపై లోపల్లోపల గుర్రుగానే ఉన్నారు. టిడిపి నుంచి కీలక నాయకులకు ఆయనతో లాలూచీ వ్యవహారాలు ఉన్నాయి.
టిడిపి అభ్యర్థి బోనెల విజయచంద్ర రాజకీయాలకు కొత్త. సాలూరు నియోజకవర్గంలో వైసిపి తరపున స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర తిరిగి ఆ పార్టీ తరపున పోటీచేస్తున్నారు. ఆయన గతంలో ఇక్కడి నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. పార్టీలో టికెట్‌ కోసం పోటీ పడేవారూ లేరు. కొంతమంది నాయకులతో అంతర్గత విభేదాలున్నా చక్కబెట్టుకుంటున్నారు. టిడిపి తరపున పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి పోటీలో ఉన్నారు. కులవివాదంతో పోటీ అర్హత కోల్పోయిన ఆర్‌పి భంజ్‌దేవ్‌ ప్రతి ఎన్నికల్లోనూ ప్రత్యేక గ్రూపును నడుపుతుండడంతో టిడిపి నష్టాన్ని చూడాల్సి వస్తోంది. అధిష్టానం ఈ గ్రూపులను ఒకటి చేశాయి. ఆర్థిక వనరులు పెద్దగా లేకపోవడంతో సంధ్యారాణి పార్టీపైనే ఆశలు పెట్టుకున్నారు.
కురుపాంలో ముక్కోణం
కురుపాంలో వైసిపికి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీవాణి ఆ పార్టీ తరపున పోటీలో ఉన్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో ఎమ్మెల్యేపై తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. శ్రీవాణిపై అసంతృప్తి ఉన్నప్పటికీ, దాన్ని టిడిపి అభ్యర్థి తోయక జగదీశ్వరి అనుకూలంగా మలుచు కోలేకపోతున్నారు. దీనికితోడు గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ దత్తి లక్ష్మణరావు కొంతమంది గిరిజనేతర నాయకులతో ఒక గ్రూపును నడుపుతున్నారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నప్పటికీ వీరు కలవలేదు. టిడిపి తరపున అత్యంత శక్తిమంతమైన నేతగా వున్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వృద్ధాప్యంలో వున్నారు. గతంలో టిడిపి తరపున తన మేనల్లుడు జనార్థన్‌ థాట్రాజ్‌ పోటీలో ఉండడం వల్ల పుష్పశ్రీవాణిని ఢకొీట్టేలా పనిచేశారు. ఈసారి విజయరామరాజు కుటుంబీకులు పోటీలో లేరు. అంతర్గతంగా ఆయన కోడలు పుష్పశ్రీవాణికి సహకరించే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే విజయరామరాజు కూడా ఇప్పటికీ టిడిపి కేడర్‌కు దిశానిర్ధేశం చేయలేదు. ఇదే నియోకవర్గం నుంచి సిపిఎం రంగంలోకి దిగుతోంది. సిపిఎం అభ్యర్థిగా మండంగి రమణ పోటీలో ఉన్నారు. నాగూరు కేంద్రంగా వున్న ఇదే నియోజకవర్గంలో 2004లో సిపిఎం విజయం సాధించింది. నాటి నుంచి జనాన్ని అంటిపెట్టుకుని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. ఈ నేపథ్యంలో కురుపాంలో త్రిముఖ పోటీ నెలకొంది.
వైసిపి, టిడిపిలో విభేదాలు
పాలకొండలో వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతి ఉన్నారు. ఈమె 2009లో ప్రజారాజ్యం తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత వరుసగా రెండు సార్లు వైసిపి తరపున గెలిచారు. టిడిపి నుంచి ఇటీవల జనసేన పార్టీలో చేరిన నిమ్మక జయ కృష్ణకు ఆ పార్టీ టికెట్‌ ప్రకటించింది.
ఇటీవల టిడిపి నుంచి జనసేనలోకి వెళ్లిన తేజోవతి కూడా టికెట్‌ ఆశించారు. వైసిపికి చెందిన స్థానిక ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌బాబు, ఎమ్మెల్యే కళావతికి మధ్య విభేదాలున్నాయి.
అరకు పార్లమెంటు పరిధిలోనే..
పార్వతీపురం మన్యం జిల్లా అంతా అరకు పార్లమెంటు పరిధిలోనే ఉంది. వైసిపి అభ్యర్థిగా తనూజరాణి, కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎంపి కొత్తపల్లి గీత, ఇండియా ఫోరం తరఫున సిపిఎం అభ్యర్థి అప్పలనర్స పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి ఎంపిగా గెలిచిన గీతపై మన్యం జిల్లా వ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. వ్యతిరేక ఓట్లు సిపిఎంకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపితో సిపిఎం పోటీపడుతోంది.

➡️